వైరస్‌ని జయించి హీరో అయ్యాడా?
కరోనా వైరస్ ని ఎదురించి విజేతగా నిలిచిన మొట్టమొదటి టాలీవుడ్ మొనగాడిగా బండ్ల గణేష్ పేరు మార్మోగుతోంది. రెండు వారాల స్వీయ నిర్బంధం .. ఇతర ఆరోగ్య నియమాలను పాటించిన తర్వాత విజయవంతంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు. కొవిడ్ నెగెటివ్ రిజల్ట్ ఈ నిర్మాత కం నటుడిలో ఊపిరి పోసింది.
కొవిడ్ ని జయించగానే మరోసారి బండ్ల ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయినట్టున్నాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు పలు ఆసక్తికర విషయాల్ని ముచ్చటించాడు. తనకు కొవిడ్ అని తెలియగానే అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎవరు మొదటగా కాల్ చేశారు? అని అడిగినప్పుడు, తనకు మొదట మోహన్ బాబు నుండి కాల్ వచ్చిందని బండ్ల చెప్పారు. తన దేవుడి (పవన్ కళ్యాణ్) నుండి ఇప్పటి వరకు తనకు ఎలాంటి పిలుపు రాలేదని కూడా చెప్పాడు.
రెండు తెలుగు రాష్ట్రాల తాజా పరిస్థితిపై ప్రశ్నించగానే.. దానికి సమాధానమిస్తూ “రాష్ట్రం రెండుగా విభజించటం మంచిది. లేకపోతే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి ఉండేది కాదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎపి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి లేదా సంక్షేమం పోలికతో జరుగుతుంది . తెలుగు రాష్ట్రాలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరుల మాదిరిగా విడిపోయి పోటీ స్ఫూర్తితో అభివృద్ధి చెందడం మంచిది“ అని తెలిపాడు.
కెటిఆర్‌తో ఉన్న విభేదాల గురించి పంచుకుంటూ, అపరాధ భావనతో ఎన్నికల తర్వాత తనను కలవలేదని చెప్పారు. ఇంతకుముందు తన గురించి చెడుగా మాట్లాడటం ద్వారా తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు.
లోకేష్ నాయుడు గురించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లోకేష్ ఎన్నికలలో ఓడిపోతారని తాను ముండే ఊహించానని చెప్పారు. మొత్తానికి బండ్ల కొవిడ్ ని జయించిన వీరుడిగా మరోసారి ఇంటర్వ్యూలతో దూసుకెళుతున్నాడనే చెప్పాలి.