కోహినూర్ వ‌జ్రానికి ప‌వ‌న్ సినిమాకు లింకేంటి?

ప‌వ‌న్ కొంత విరామం త‌రువాత న‌టిస్తున్న వ‌రుస చిత్రాల్ని లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. `పింక్‌` రీమేక్‌తో మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాడు. తెలంగాణ రాబిన్‌హుల్ `పండుగ‌ల సాయ‌న్న‌` అనే బందిపోటు దొంగ జీవిత క‌థ ఆధారంగా మొగ‌ల్ సామ్రాజ్య‌పు కాలం నాటి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి చిత్రంగా రూపొందుతోంది.

ఈ సినిమా కోసం ఇప్ప‌టికే భారీ సెట్‌ల‌ని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన ఓ వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మొఘ‌లుల కాలంలోనే కాక‌తీయ సామ్రాజ్యానికి చెందిన కోహినూర్ వ‌జ్రాన్ని అల్లివుద్దీన్ ఖిల్జీ అప‌హ‌రించాడు. ఆ త‌రువాత అది బాబ‌ర్ వ‌ద్ద‌కు చేరింది. అక్క‌డి నుంచి ఆ వ‌జ్రాన్ని బ్రిటీష్ వారు హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. వారి ద‌గ్గ‌రి నుంచి కోహినూర్ వ‌జ్రాన్ని కొట్టేయాల‌ని షాజ‌హాన్‌తో పాటు పండుగ‌ల సాయ‌న్న కూడా ప్ర‌య‌త్నించాడ‌ట‌. కొంత మంది బందిపోటు దొంగ‌ల స‌హాయంతో పండుగ‌ల సాయ‌న్న ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌ది ఈ చిత్రంలో చూపించ‌బోతున్నార‌ట‌.

ప్ర‌ధానంగా ప‌వ‌న్- క్రిష్‌ల చిత్రం కోహినూర్ వ‌జ్రం చుట్టూనే తిరుగుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు `బాహుబ‌లి`కి మించి వుండ‌నున్నాయని, క్రిష్‌, ప‌వ‌న్ కెరీర్‌లోనే ఈ సినిమా ప్ర‌భాస్‌, రాజ‌మౌళిల‌కు`బాహుబ‌లి` ఎలాంటి చిత్రంగా నిలిచిందో ఈ సినిమా కూడా అదే స్థాయిలో నిలిచిపోనుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. గ్రాఫిక్స్ మాయాజాలంగా ఈ చిత్రాన్ని మ‌లుస్తున్న‌ట్టు తెలుస్తోంది. టెక్నిక‌ల్‌గా జెమ్ అయిన క్రిష్ త‌న పూర్తి అనుభ‌వాన్ని రంగ‌రించి తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌.