బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ 77 ఏళ్ల వయసులో కరోనా బారినపడటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తోన్న సమయంలో అమితాబ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నేటి ఉదయం నుంచి పరిస్థితులు ఇంకా తారుమార య్యాయి. నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ ఆరోగ్యం ఎలా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకటే మోతెక్కిస్తున్నారు. వెబ్ మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఈ ప్రచారాలకు తోడు ఆసుపత్రి వర్గాలు కూడా అమితాబ్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేయలేదు.
దీంతో బాలీవుడ్ మీడియా మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే నానావతి ఆసుపత్రిలో అమితాబ్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. కేవలం కరోనా స్వల్ప లక్షణాలతోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. అలాగే బిగ్ బీ కుటుంబంలో సభ్యులందరికీ తొలి దశ కరోనా పరీక్షలు పూర్తిచేసారు. ఫలితాలు రావాల్సి ఉంది. తొలి దశ ఫలితాల్లో జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ కి నెగిటివ్ వచ్చింది.
అయితే పూర్తి స్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్ టీ పీసీఆర్ పరీక్ష ఫలితాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ పరీక్షా పలితాలు ఎలా వస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. అటు అభిషేక్ బచ్చన్ కి కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పటికే అమితాబ్-అభిషేక్ ఇద్దరు తమని కలిసిన వారందర్నీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. గత పది రోజులుగా తమతో ఉన్న వారందరూ తప్పక పరీక్షలు చేయించుకుని, అవసరం మేర క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.