దేశ వ్యాప్తంగా కాకున్నా.. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ కొనసాగించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అందరి అభిప్రాయాలు విన్న అనంతరంప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాలు, అలాగే ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కఠినంగా కొనసాగించే యోచనలు ఉన్నాయి. అలాగే ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన తొమ్మిది మంది సీఎంలలో కొందరు లాక్ డౌన్ ముగింపు కోరగా, మరి కొందరు మాత్రం కొనసాగించాలని కోరినట్లు సమాచారం.
అయితే అన్ని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులు, జిల్లాగా వారీగా సమాచారాలతో నివేదిక రూపొందించాలని మోదీ కోరడం చూస్తే.. ఆయా నివేదికల ఆధారంగా ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే కేసులు ఎక్కువగా నమోదవుతూ.. రెడ్ జోన్లుగా, హాట్ స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ కొనసాగనుంది. అలాగే కేసులు నమోదు కానీ, లేదా అదుపులోకి వచ్చిన ప్రాంతాల్లో సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యలు అంతగా లేవని, అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.