అన్నదాతలకు గుడ్ న్యూస్.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సహా పలువురు ముఖ్య మంత్రులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

అందులో భాగంగా ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. ఈ కొత్త పథకం వల్ల దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుందని తెలిపారు. ముఖ్యంగా రైతుల పంట ఉత్పాదకతను మరింతగా పెంచడం, పంటల్లో వైవిధ్యం తీసుకురావడం, పంచాయతీ స్థాయిలో పంట నిల్వ కేంద్రాలను బలోపేతం చేయడం ఈ పథక ఉద్దేశమని చెప్పారు.

నీటి పారుదల వ్యవస్థను సమర్ధంగా అభివృద్ధి చేయడం, రైతులకు తక్కువ వడ్డీతో తక్షణ, దీర్ఘకాలిక రుణాలు అందించడానికి అవకాశం కల్పించడం కూడా ఈ పథకంలో భాగమని వివరించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 కీలక వ్యవసాయ జిల్లాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. రైతుల జీవితాలను మారుస్తూ, వ్యవసాయ రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చేలా ఈ పథకం పనిచేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.