30 ఇయర్స్ పృథ్వీ .. పరిచయం అవసరం లేని పేరిది. ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన పృథ్వీ చాలా కాలంగా వైసీపీ నాయకుడిగా సేవలందిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు .. వైకాపా తరపున ప్రచారం చేశారు. పరిశ్రమ తరపున పృథ్వీ అంతో ఇంతో వైకాపాకు అండగా నిలవడం అప్పట్లో చర్చకు వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక పృథ్వీకి యంగ్ సీఎం ఒక చక్కని పదవిని కట్టబెట్టారు. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్ ను చేశారు సీఎం జగన్.
పృథ్వీ ఒక రకంగా జాక్ పాట్ కొట్టాడన్న టాక్ వినిపించింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ మహిళతో అసభ్యకరంగా మాట్టాడిన ఆడియో టేప్ లీకవ్వడంతో పృథ్వీ పై వెంటనే చర్యలు తీసుకోవడం సంచలనమైంది. ఆయనను ఎస్.వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. అనంతర పరిణామాలు తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు పృథ్వీ. అప్పట్లోనే తాను మీడియా ముఖంగా ఈ వివాదం గురించి మాట్లాడుతూ లీకైన ఆ ఆడియో టేప్ లో మాట్లాడింది తాను కాదని.. ఇదంతా తనపై ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని కంటతడి పెట్టుకున్నారు.
గతం అలా ఉంటే.. తాజాగా ఆయన ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే.. ఆ క్లిష్ట సమయంలో తనకు మెగాస్టార్ చిరంజీవి బాగా సపోర్టు చేశారని వెల్లడించారు. పృథ్వీ బాధల్లో ఉన్నాడని.. తనను ఆదుకోవాలని .. అవకాశాలు ఇవ్వాలని మెగాస్టార్ పరిశ్రమ వర్గాలకు చెప్పడంతోనే కొంత ఊరట చెందానని వెల్లడించారు. లేకపోతే ఆ సమయంలో తాను ఆత్మహత్య చేసుకునే వాడినని సంచలనం విషయాన్ని బయట పెట్టారు. అయితే తనను ఎస్.వీ.బీ.సీ చానల్ వాళ్లు చెప్పుతో కొట్టి బయటకు పంపించారని.. తాను ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి కష్టకాలంలో అన్ని ఆరోపణలు ఎదుర్కొన్న పృథ్వీకి మళ్లీ అవకాశాలు ఇవ్వాలని మెగాస్టార్ సూచించారా? .. అప్పట్లోనే పవన్ పై కామెంట్లు చేసినందుకు మెగా బ్రదర్స్ పృథ్వీపై సీరియస్ అయ్యారన్న ప్రచారానికి ఇది విరుద్ధంగా ఉంది! అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.