ఎనర్జిటిక్ స్టార్ రాం పోతినేని ‘ఐ స్మార్ట్ శంకర్’ ట్రైలర్ ఓవర్ స్మార్ట్ గా వుంది. ఈసారి పూరీ జగన్నాథ్ యాక్షన్ కమర్షియల్ ఓవర్ మాస్ గా, ‘టెంపర్’ లాంటి లౌడ్నెస్ తో వుంది. ‘డబల్ దిమాక్ హైదరాబదీ’గా రెండుగా ప్రవర్తించే క్యారక్టర్ అని తెలియజేస్తూ, తెలంగాణా డైలాగులు విచ్చలవిడిగా పేల్చారు. ‘పిల్లి గుడ్డి దైతే ఎలుక ఎగిరెగిరి చూపించిందట…నీ జాతి నా పుల్లా’ అని చివరి పదంలో మొదటి అక్షరం మార్చి హిందీ బూతుని దట్టించారు. హీరోయిన్ గా నభా నటేష్ కూడా అంతే మాస్ గా ‘రేయ్ వరంగల్ కాలేజ్ ల పోరగాళ్ళను ఉచ్చ పోయించా’ అని అరిచేస్తుంది.
పూరీ రిపీట్ చేసే పూరీ మార్కు విలన్లతో మరో మాఫియా మూవీ ఇది. ‘సగం మెంటల్, సగం భోజ్ పురి’ విలన్ అంటూ రామ్ చెలరేగిపోయాడు. ఇంత ఓవరాక్షన్ రామ్ కి అతిగా కన్పిస్తోంది. యాక్షన్ సీన్స్ లో మరీ విజృంభించాడు. తెలంగాణా డైలాగులు అతడి నోట ఎబ్బెట్టుగా వున్నాయి. టీజర్ విడుదలైనప్పుడే రామ్ నటన మితిమీరినట్టు కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ ఇందుకేమీ తీసి పోలేదు. ఇది బేసిక్ గా వూర మాసే అయినా స్టయిలిష్ మాస్ గా తీశారు. మాస్ ప్రేక్షకుల్ని ఎక్కువ టార్గెట్ చేసినట్టుంది.
ఐతే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, ఇలా రెండుగా ప్రవర్తించే కథలతో వరుసగా సినిమాలు వచ్చేశాయి, వస్తున్నాయి. కాకపోతే రామ్ బుర్రలో చిప్ పెట్టుకుని రెండుగా ప్రవర్తిస్తాడు. వేరే పరిస్థితుల్లో రెండుగా ప్రవర్తించే కథలతో సవ్యసాచి, గేమ్ ఓవర్ ఇటీవలే వచ్చేశాయి. ఇక జులై 5 న ఓహ్ బేబీ, బుర్ర కథ విడుదలవుతున్నాయి. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు మళ్ళీ ‘ఐ స్మార్ట్ శంకర్’ చూసేందుకు సిద్ధంగా వుండాలి.
‘ఐ స్మార్ట్ శంకర్’ కి హాలీవుడ్ ‘అప్ గ్రేడ్’ తో పోలికలున్నాయని టాలీవుడ్ లో ‘అప్ గ్రేడ్’ ట్రైలర్ షేర్ చేసుకుంటున్నారు. మణిశర్మ సంగీతం, తోట ప్రసాద్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ పూరీ ఆఫర్ జులై 18 న విడుదల.