రచన- దర్శకత్వం : మహేష్ బాబు పి.
తారాగణం : రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే,, మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల, రఘుబాబు, తులసి, సింధూ తులానీ తదితరులు
సంగీతం : వివేక్ – మెర్విన్,
ఛాయాగ్రహణం : సిద్ధార్థ నూని,
కూర్పు : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
విడుదల : నవంబర్ 27, 2027
Andhra King Taluka Movie Review: రామ్ పోతినేని హిట్ సినిమా నటించి దాదాపు ఐదు సంవత్సరాలు అయింది. 2019 లో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత రెడ్, రోమాంటిక్, ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మా ర్ట్ వరుసగా పరాజయం పాలయ్యాయి. వీటి నుంచి కోలుకుంటూ తాజాగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నటించాడు. దీనికి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే హిట్ తీసిన మహేష్ బాబు పి. దర్శకుడు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తమిళ సంగీత దర్శకుల ద్వయం వివేక్-మెర్విన్ సంగీతం అందించారు. పాటలు ఇప్పటికే హిట్టయ్యాయి. ఆసక్తికర ట్రైలర్‌తో వార్తల్లో నిలిచిన ఈ మూవీ ఈరోజు విడుదలైంది. ఇప్పుడు ఫ్లాపుల్లో వున్న రామ్ పోతినేనికి దర్శకుడు మహేష్ బాబు హిట్టిచ్చాడా? ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో హిట్ మూవీని అందించిందా? ఇందులో ఉపేంద్ర నటించడం ఏ మేరకు ప్లస్ అయింది? …మొదలైన వివరాలు తెలుసుకుందాం…
కథేమిటి?
1990 లలో గోదావరి జిల్లాలో గొడపల్లి లంక అనే మారుమూల గ్రామం. ఇక్కడ సాగర్ (రామ్ పోతినేని), హీరో ఆంధ్రా కింగ్ సూర్య (ఉపేంద్ర) కి వీరాభిమాని. సాగర్ మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) ని ప్రేమిస్తాడు, కానీ ఆమె తండ్రి సాగర్ ని ఎగతాళి చేస్తాడు, అతను మహాలక్ష్మి హోదాకి సరితూగడని. సాగర్ మహాలక్ష్మి తండ్రిని సవాలు చేసి, త్వరలోనే గ్రామంలో ఒక పెద్ద సినిమా థియేటర్ నిర్మిస్తానని, మహాలక్ష్మిని పెళ్ళి వివాహం చేసుకునేంత విలువైనవాడని నిరూపిస్తానని అంటాడు. ఇలా సాగర్ అన్న మాట ప్రకారం థియేటర్ నిర్మిస్తాడు. ఇంతలో తన అభిమాన హీరో సూర్య 100 వ సినిమాతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని, థియేటర్ అమ్మేసి మూడు కోట్లు సూర్యకి పంపేస్తాడు.

ఇప్పుడు ఈ డబ్బు అందుకున్న సూర్య ఏం చేశాడు? ఒక అభిమాని తన అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా ముందుకొస్తే ఆ హీరో ఎలా స్పందించాడు? అతను సాగర్ ని కలుసుకున్నాడా? కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా కొనసాగింది? మహాలక్ష్మితో సాగర్ పెళ్ళి విషయం ఏమైంది? చివరికి కథ ఎలా ముగిసింది? ఇవి తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.
ఎవరెలా చేశారు?
రామ్ పోతినేని వరసగా ఐదు సినిమాల్లో నటించిన మూస మాస్ క్యారక్టర్లు వర్కౌట్ కాలేదు. ఆ క్యారక్టర్స్ లో క్యారక్టర్స్ కంటే తనే ఎక్కువ కన్పించాడు. ఈసారి కూడా మాస్ క్యారక్టరే, అయితే ఈసారి రామ్ కనిపించకుండా సాగర్ మాత్రమే కనపించే లాగా తీసుకున్న జాగ్రత్త వర్కౌటయ్యింది. ఈ క్యారక్టర్ లో సామాన్య యువకుడు కనిపిస్తాడు, అతడి అమాయకత్వం కనిపిస్తుంది. మాస్ ఫైట్లు, మాస్ డైలాగులూ లేవు. ముఖ్యంగా తన అభిమాన స్టార్ పట్ల కదిలించే అంకితభావం కనిపిస్తుంది. ఈ లక్షణాలు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. సున్నిత పాత్రని సున్నితంగా నటించి ఆయా సన్నివేశాల్ని హిట్ చేశాడు రామ్. ముఖ్యంగా అభిమాన స్టార్ సూర్యతో బాండింగ్ కళ్ళు చెమర్చే ఫీల్ గుడ్ అనుభవాన్నిస్తుంది. అయితే పాత్రకి ఒక్కటే లోపం. కథ నడవడానికి సరైన భా ద్వేగాల్లేవు.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సూర్య పాత్రకి కథలో తక్కువ చోటు దక్కింది. అయినా చాలా సెంటిమెంటల్ పాత్రని మంచి నటనతో రక్తి కట్టించాడు. క్లయిమాక్స్‌లో భేష్ అన్పించుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సే ప్రేమికురాలి పాత్ర, ఆ పాత్రలో సహజ నటన కూడా ఈ సినిమాకి ఆకర్షణే.
ఇక రావు రమేష్, మురళీ శర్మ ఇద్దరూ కీలక పాత్రలు పోషించి సినిమా బలం పెంచారు. ఆలయ సన్నివేశంలో రావు రమేష్ నటన, ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో మురళీ శర్మ నటన అద్భుతంగా ఉన్నాయి. కామెడీ చూస్తె రాహుల్ రామకృష్ణ, సత్య ఇద్దరూ వినోదానికి లోటు లేకుండా చూసుకున్నారు.
సాంకేతికాల సంగతి?
తమిళ సంగీత దర్శకుల ద్వయం వివేక్-మెర్విన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమా పాజిటివ్ అంశాల్లో ఒకటి. రెండు మెలోడీ పాటలు మంచి ఫీల్ ని, రిలీఫ్ నీ ఇస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బలంగా వుంది. సిద్ధార్థ నూని, జార్జ్ సి. విలియమ్స్ ల ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని సృష్టించింది. గోదావరి జిల్లా సుందరమైన ప్లోకేషన్స్ ని చాలా బాగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో ఫస్టాఫ్ బాగా కత్తెర పడి వేగాన్ని పెంచి వుండాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు మాత్రం అత్యుత్తమంగా ఉన్నాయి.

ఇంతకీ కథా కథనాలెలా వున్నాయి?
ఫస్టాఫ్ బలహీనంగా, సెకండాఫ్ బలంగా వున్నాయి. మొత్తం కలిపి రెండు గంటల నలభై ఆరు నిమిషాల సుదీర్ఘ నిడివి. అమ్మాయి ప్రేమ కోసం, తన అభిమాన హీరో శ్రేయస్సు కోసం ఒక యువకుడు ఎంత దూరం వెళ్ళగలడనే పాయింటు కొత్తగా లేకపోయినా దీనికి రూపొందించిన పాత్రల తీరు, కథనం సినిమా సాంతం కూర్చోబెడతాయి. అయితే సుదీర్ఘంగా సాగే ఫస్తాఫే విషయం లేకుండా బలహీనంగా, కాస్త బోరుగా వుంటుంది. అభిమాన హీరో పట్ల సాగర్ చూపించే క్రేజ్, ఫ్రెండ్స్ తో కలిసి హీరో కోసం చేసే కార్యక్రమాలు, మరో వైపు హీరోయిన్ తో ప్రేమ, ఆమె తండ్రితో చాలెంజ్, వీటి మధ్య సూర్య తనకు డబ్బు పంపి సాయం చేసిన అభిమాని సాగర్ ని వెతుక్కుంటూ రావడం, సాగర్ తో సెంటిమెంటల్ దృశ్యాలూ వగైరా ఫస్టాఫ్ లో చూడొచ్చు. వీటి తర్వాత వచ్చే ఇంటర్వెల్ పాయింటు కూడా బలహీనమే. ఇక సెకండాఫ్ మీదే భారం వేసి చూడడానికి సిద్ధపడాలి.
అదృష్ట వశాత్తూ సెకండాఫ్ బలం పుంజుకుంటుంది. ఉన్న విషయంతా సెకండాఫ్ లోనే వుంది. రావు రమేష్ పాత్ర- సాగర్ – గ్రామస్తులతో కూడిన ఆలయ సన్నివేశం, మహాలక్ష్మి తండ్రితో సూర్య ఘర్షణ సన్నివేశం, క్లయిమాక్స్ లో సూర్య ఘర్షణ, సాగర్ సూర్యని ఎందుకు అంతగా ఇష్టపడుతున్నాడో మహాలక్ష్మికి చెప్పే సన్నివేశం ఇవన్నీ బలంగా తీశాడు దర్శకుడు. వీటికి రాసిన డైలాగులూ బావున్నాయి. సినిమా మొత్తం మీద పదిహేను డైలాగులు బలంగా, ఆలోచింప జేసేవిగా వున్నాయి.

రాంపోతినేని, ఉపేంద్ర ఇద్దరూ ఓవరాక్షన్ కి పేరుబడ్డ వాళ్ళే. అయితే ఇక్కడ పూర్తిగా మనసున్న పాత్రలకి లొంగిపోయి సహజ సిద్ధంగా నటించారు. పోటీ ఏం లేదు. పాత్రల్ని నిలబెట్టడమే పని.
మొత్తం మీద ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వినోదాత్మకంగా, సుసంపన్నంగా వున్న ఒక మంచి ప్రయత్నం దర్శకుడు మహేష్ బాబు చేతి నుంచి. తెలుగులో ఈ మధ్య కాలంలో హింసకి దూరంగా, ఈ మాత్రం కథా బలంతో నిజాయితీగా తీసిన సినిమా రాలేదు. అయితే రామ్ పాత్రకి సరైన భావోద్వేగాలు లేకపోవడం, ఫస్టాఫ్ బలహీనంగా వుండడం, సినిమా ఎక్కువ నిడివితో ఉండడం నెగెటివ్ పాయింట్లు. వీటిని సరిదిద్ది వుంటే మరింత ఎలివేట్ అయ్యేది సినిమా!
రేటింగ్ : 2.5 / 5

