ఆ బ్యాచ్ అంతా మహేష్ పై పడ్డారే
ప్రపంచంలోనే అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోన్న సంగతి తెలిసిందే. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన ఈ అడవుల్లో కార్చిచ్చు రేగి దగ్ధం అవటం చాలా మందికి భయాందోళన కలిగించింది. ఈ తీవ్రతను శాటిలైట్ చిత్రాల్లో బంధించి నాసా సోషల్మీడియాలో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లతోపాటు సినీ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేసారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అనుష్క శర్మ తదితరులు కూడా సోషల్మీడియాలో అమెజాన్ అడవులు దగ్ధం అవుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. జనం మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్లే రివర్స్ గేర్ లో విమర్శలకు కారణమవుతున్నాయి.
ముఖ్యంగా మహేష్ బాబుని ఉద్దేశించి ఆ విమర్శలు మొదలయ్యాయి. మన నల్లమల అడవి గురించి అసలు ఒక ట్వీట్ వెయ్యలేదంటూ ఆయన్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు సోషల్ మీడియా జనం. ప్రస్తుతం నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది.
యురేనియంతో తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులాంటి నల్లమల అడవులు సర్వనాశనమవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సేవ్ నల్లమల పేరుతో ఉద్యమం మొదలైంది. వీరికి సినీ ప్రముఖులు శేఖర్ కమ్ముల, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ వంటి అనేక మంది బాసటగా నిలుస్తున్నారు. యురేనియంతో పచ్చటి అడవులను నాశనం చేయొద్దని గళం విప్పుతున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం ఈ విషయమై ఇప్పటివరకూ మాట్లాడలేదు.