రణవీర్ సింగ్ ‘సింబా’ మూవీ రివ్యూ, రేటింగ్

రివ్యూ  ‘సింబా’

దర్శకత్వం : రోహిత్ శెట్టి
తారాగణం : రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్, వైదేహి, సోనూ సూద్, ఆశుతోష్ రాణా తదితరులు
మూల కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్ – సాజిద్ సంజీ, మాటలు : ఫర్హాద్ సంజీ, సంగీతం : తనిష్క్ బాగ్చీ, తమన్ తదితరులు, ఛాయాగ్రహణం : జొమోన్ జాన్
బ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్, రోహిత్ శెట్టి పిక్చర్జ్
నిర్మాతలు : కరణ్ జోహార్, హీరూ యశ్ జోహార్, రోహిత్ శెట్టి, అపూర్వా మెహతా
విడుదల : డిసెంబర్ 28, 2018
3.5 / 5
*
అజయ్ దేవగణ్ తో సక్సెస్ గ్యారంటీ రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్ తో డబుల్ గ్యారంటీ ప్రయోగం చేశాడు. ప్రతీ కమర్షియల్ కీ ఏదోవొక కొత్తదనం చూపిస్తూ అందరికీ భిన్నంగా వుండే దర్శకుడు రోహిత్ శెట్టి, ఈసారి ‘సింగం’ సిరీస్ కి కొత్త బాట వేశాడు. ఎన్టీఆర్ – పూరీ జగన్నాథ్ ల తెలుగు హిట్ ‘టెంపర్’ ని సింబా – సింగం ల మధ్య వారధిగా చేసుకుని, రీమేక్ కే కొత్త అర్థాన్నిచ్చాడు. ఇదేమిటో చూద్దాం…

కథ
ప్రసిద్ధ పోలీసు అధికారి బాజీరావ్ సింగం పుట్టిన వూళ్లోనే అనాధగా పెరుగుతూంటాడు భాలేరావ్ సింబా (రణవీర్ సింగ్). కానీ సింగంకున్న నీతీనిజాయితీ లు సింబాకుండవు. పోలీసుల అవినీతి చూసి తనూ పోలీసై సంపాదించుకోవాలని పోలీస్ అధికారి అవుతాడు. లంచాలు మరిగి మజా చేస్తూంటే, గోవాలోని మీరామర్ కి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ దుర్వా రణడే (సోనూ సూద్) అనే మాఫియా, అతడి ఇద్దరు తమ్ముళ్ళు డ్రగ్స్ దందా చేస్తూంటారు. ఇది తెలియని సింబా, దుర్వా ఇతర దందాల నుంచి లంచాలు తింటూ విశ్వాసంగా వుంటాడు. లంచగొండి సింబాని చూసి అసహ్యించుకుంటాడు కానిస్టేబుల్ మోహిలే (ఆశుతోష్ రాణా). షగున్ (సారా అలీ ఖాన్) క్యాటరింగ్ బిజినెస్ చేస్తూంటుంది. పోలీస్ స్టేషన్ కి ఫుడ్ సప్లయి చేస్తున్న ఆమెని చూసి ప్రేమలో పడతాడు సింబా. ఆకృతి మెడిసిన్ చదువుతూ అనాధ పిల్లలకి చదువు చెప్తూంటుంది. ఈమె సేవ చూసి చెల్లెలుగా స్వీకరిస్తాడు సింబా. ఈ పిల్లల స్కూల్ బ్యాగుల్లో డ్రగ్స్ వేసి స్మగ్లింగ్ చేస్తూంటారు దుర్వా తమ్ముళ్ళు. ఒక రోజు ఫాలో అయి వీడియో తీస్తుంది ఆకృతి. ఇది దుర్వా తమ్ముళ్ళు చూసి ఆమెని మానభంగం చేసి చంపేస్తారు. తన అవినీతి వల్లే ఇలా జరిగిందని సింబా పశ్చాత్తాప పడి తిరగబడతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ
ఈ రీమేక్ కి తెలుగు ‘టెంపర్’ లోంచి మూల కథ మాత్రమే తీసుకుని రీబూట్ చేశారు. అజయ్ దేవగణ్ తో రోహిత్ శెట్టి ‘సింగం’ సిరీస్ సినిమాలకి ఇంకో సీక్వెల్ గా దీన్ని ముస్తాబు చేశారు. ‘టెంపర్’ లోని ఎన్టీఆర్ లంచగొండి పోలీసు పాత్రగా రణవీర్ సింగ్ తో సింబా పాత్రని సృష్టించి, దీనికి ‘సింగం’ సిరీస్ లోని అజయ్ దేవగణ్ బాజీరావ్ సింగం పాత్రతో జత కలిపారు. దీంతో ఈ రీమేక్ కమర్షియల్ సినిమాల్లో వినూత్న ప్రయోగంగా మారింది.
ఇక కాన్సెప్ట్ పరంగా ఈ మానభంగం – హత్య కథని తెలుగులోకంటే సున్నితంగా చెప్పారు. తెలుగుకి ఫ్యామిలీ ప్రేక్షకులు దూరంగా వుండి పోయారు. ఈ రీమేక్ కి ఫ్యామిలీలు కూడా విశేషంగా తరలి వస్తున్నారు. చెబుతున్నది ఒకమ్మాయి మానభంగ కథ కాబట్టి, ‘టెంపర్’ లోని హార్డ్ కోర్ సీన్లని పూర్తిగా సంస్కరించి, అసభ్యత లేకుండా అత్యధికభాగం తొలగించి, అదనంగా ప్రముఖ స్థానాల్లో స్త్రీపాత్రల్ని సృష్టించి, మానభంగాలపై స్త్రీ గొంతుక కూడా విన్పించారు. ఏం విన్పించినా, చూపించినా, అరుపులతో గోలగోల చెయ్యకుండా సున్నితత్వాన్ని, సెంటి మెంట్స్ ని పలికిస్తూ, ఐదారు చోట్ల కళ్ళు చెమ్మగిల్లేట్టు కూడా చేశారు. కాకపోతే ఆడా మగా ప్రతీ పాత్రా రేప్ అనే పదాన్ని ఓ వందసార్లు పలికి వుంటాయి. ఇది అసభ్య స్థాయికి చేరి జుగుప్సాకరంగా మారింది. ‘ఆ సంఘటన’ అని పరోక్షంగా ప్రస్తావిస్తే సరిపోయేది ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా. పదే పదే రేప్ అని ఎత్తి చూపడం బాధితురాల్ని గ్యాంగ్ రేప్ చేయడమే.

ఎవరెలా చేశారు
ఇది రణవీర్ సింగ్ ఒన్ మాన్ షో. అతను తప్ప ఈ లంచగొండి కామెడీ పోలీస్ పాత్రని ఇంకొకరు చేయలేరు. కామెడీని క్లాస్ గా చేయడం, హావభావాలు, బాడీ లాంగ్వేజి ఫన్నీగా ప్రదర్శించడం, పాత సినిమాల్లోని సెంటిమెంట్లతో, డైలాగులతో ప్రేక్షకుల హృదయాల్ని దోచు కోవడం అతడికే చెల్లింది. పూర్తిస్థాయి మాస్ మసాలా పాత్ర. ఇది సీరియస్ గా మారిపోయే క్రమంలో భావోద్వేగాల్ని రగిలిస్తాడు – తన భావోద్వేగాలే ప్రేక్షకుల భావోద్వేగాలయ్యేట్టుగా. ఆద్యంతం ప్రేక్షకుల్ని తనలో లీనం చేసుకుని లాక్కెళ్ళి పోతాడు. అతను ఆల్ రౌండర్.

ఇతర పాత్రల్లో విలన్ గా సోనూ సూద్, కానిస్టేబుల్ గా ఆశుతోష్ రాణా పాత్రలు ప్రధానమైనవి. ఇద్దరూ బలమైన ముద్రవేస్తారు వీటితో. హీరోయిన్ సారా ఆలీఖాన్ ఫస్టాఫ్ గ్లామరు, సెకండాఫ్ తెరమరుగు. ఆమె ఎక్కడుందో సెకండాఫ్ లో వెతుక్కోవాలి.

తనిష్ బాజ్చీ, తమన్ తదితరుల సంగీత నిర్వహణ ట్రెండ్ కి తగ్గట్టే వుంది. ఒక పాట పూర్తయితే ఆ పాట గుర్తుండదు. రిచ్ ప్రొడక్షన్ విలువలతో జొమోన్ కెమెరా వర్క్ జబర్దస్త్ గా వుంది.

చివరికేమిటి
రిచ్ క్లాస్ మాస్ ఎంటర్ టైనర్. నీటుగా డీల్ చేశారు. తెలుగులోని టెంప్లెట్ కథని మార్చేసి, ఫస్టాఫ్ అంతా పాత్రల రాకపోకల లింకులతో నీటైన హాస్య కథగా అల్లారు. ఎక్కడ ఒక సీను చూడ్డం మిస్ చేసుకున్నా తర్వాతి సీన్లు అర్ధంగావు. కథ అల్లిక అంత మెలిపడి వుంటుంది. హీరోయిన్ తప్ప హీరోకి కన్పించే పెద్ద వయసు పాత్రయితే తల్లిగా, చిన్న వయసు పాత్రయితే చెల్లిగా బంధాలు కలిపేస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్లని రగిలించారు. విలన్ ఇంట్లో కూడా హీరోకి తల్లి, చెల్లి వుంటారు. జడ్జి కూడా అతడికి తల్లియే. తోటి లేడీ కానిస్టేబుల్స్ చెల్లెళ్ళు. ఈ తల్లులూ చెల్లెళ్ళూ నిండిపోయి కనిపించని హమ్ ఆప్కే హై కౌన్ ఫీల్ ని తెరనిండా కల్పిస్తూంటారు. ఇదంతా సైలెంట్ గా జరిగిపోతూంటుంది.

ఇక హీరోయిన్ సారా అలీ ఖాన్ తో రణవీర్ రోమాంటిక్ కామెడీ సీన్లు పాతవే అయినా అతడి వల్ల కొత్తగా మారిపోయాయి. సెకండాఫ్ పాయింటు మీద పోరాటం మొదలెట్టినప్పుడు ‘టెంపర్’ లోని కోర్టు సీన్లు లేవు. ఆ ముగింపూ లేదు. కోర్టు సీన్లు ఇప్పటి సంఘటనల నేపధ్యంలో నవీకరించి, దోషుల ఎన్ కౌంటర్ తో మలుపుతిప్పారు. ఐతే కోర్టు సీన్లలో వాదోపవాదాలు సహేతుకంగా వుండవు. ఇక హీరో దోషుల్ని ఎన్కౌంటర్ చేయడంతో కథ ముగిసినట్టే. కానీ ఎన్కౌంటర్ చేశాడని హీరోమీద కేసు నడిపే ఇంకో ప్రహసనం మొదలెట్టారు. దీంతో మానభంగ కథ వెనక్కి వెళ్ళిపోయి, ఎన్కౌంటర్ లోంచి హీరో ఎలా బయటపడతాడన్న అనవసర కథ ముందుకొచ్చింది.

ఐతే దీన్ని ‘సింగం’ సిరీస్ బాజీరావ్ సింగం ఎంట్రీ తో ఊహించని మలుపు తిప్పాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇలాటి ఆలోచనలు అతడికే వస్తాయి. పాత మసాలా కమర్షియల్స్ ని కూడా ఏదో గిమ్మిక్కు చేసి ఉలిక్కి పడేలా చేస్తాడు. ఇక సింగం (అజయ్ దేవగణ్) వచ్చేసి సింబాని కాపాడి, ఇద్దరూ కలిసి సింబా – సింగం శంఖారావం పూరిస్తారు విలన్ మీద. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకి కనువిందైన మల్టీ స్టారర్.

―సికిందర్