(సికిందర్)
‘రథం’
రచన – దర్శకత్వం : కె. చంద్రశేఖర్
తారాగణం : గీతానంద్, చాందినీ భాగ్వానానీ
సంగీతం : సుకుమార్, ఛాయాగ్రహణం : సునీల్
నిర్మాత : దారపునేని రాజా
విడుదల : అక్టోబర్ 262018
***
రేటింగ్ 2 / 5
***
మంచి బడ్జెట్, మార్కెట్ వున్న హీరో లభించే అవకాశాలు, పరిమితంగా వున్నప్పుడు కొత్త దర్శకులకి కొత్తవాళ్ళతో, తక్కువ బడ్జెట్ తో ప్రతిపాదనలు చేయడమొక్కటే మార్గంగా వుంటుంది. అందుకని దొరికిన కొత్త నిర్మాతలతో రొటీన్ ప్రేమ సినిమాలే తీస్తూంటారు. ఇవెలాగూ ఆడకపోయినా ఓ నిజాయితీ వుంటుంది. ఇలాటి కొత్త దర్శకులు తమకున్న పరిమితులకి సృజనాత్మకంగా తమ హద్దులు తెలుసుకుని, అనుకున్న ప్రేమ సినిమానే తెరకెక్కిస్తారు. ఈ నిజాయితీ లోపించి ఓవరాక్షన్ చేసినప్పుడే కొత్త దర్శకులతో వస్తుంది సమస్య. వీళ్ళు తమ స్థాయికి మించిన రాజమౌళి రేంజిలో తీయాలని బలంగా తలపోస్తారు. దీంతో కోటి రూపాయల బడ్జెట్ కి, కొత్తవాళ్ళతో సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి భారీ సినిమాల్ని దింపేసి పేదవాడి ఆపిల్ లా అందిస్తూంటారు.
ఇలా చుట్టిందే ‘రధం’ అనే ఈవారం లోబడ్జెట్ రాజమౌళి టైపు లవ్ – యాక్షన్ మూవీ. ఎవరో ప్రేక్షకులకి తెలియని కొత్త హీరోతో ప్రభాస్ రేంజిలో కాల్ మనీ ముఠా అన్యాయలపై తిరుగుబాటు. దీనికి పిసరంత ప్రేమ కథ. స్టార్ సినిమాల్లోంచి కాపీ దృశ్యాలు. ఇదంతా ఏమిటో ఓసారి చూద్దాం…
కథ
కార్తీక్ (గీతానంద్) అనే వ్యవసాయం మీద మక్కువగల కుర్రాడు చిన్న వూళ్ళో చదువుకుంటూ తల్లిదండ్రులతోవుంటాడు. అదే వూళ్ళో చదువుకుంటూ సుధ (చాందిని) అనే అమ్మాయి తల్లితో వుంటుంది. ఆమె వెంట చాలా మంది కుర్రాళ్ళు పడుతూంటారు. దీంతో ఆమె కార్తీక్ కి ఎదురెళ్ళి ప్రేయసిగా నటిస్తుంది. దీంతో కుర్రాళ్ళు మాయమైపోతారు. ఆమె ప్రవర్తనని అవకాశంగా తీసుకున్న కార్తీక్ ఆమెని ప్రేమిస్తున్నానని వెంటపడతాడు. ఆమె కూడా ప్రేమలో పడుతుంది. వూళ్ళో ఒకడు కాల్ మనీ దందా చేస్తూ జనాల్ని వేధిస్తూంటాడు. అప్పుతీర్చని వాళ్ళ పిల్లల్ని తీసికెళ్ళి క్వారీలో వెట్టికి అమ్మేస్తూంటాడు. కార్తీక్ దీనిపై దండెత్తి ఆ పిల్లల్ని కాపాడతాడు. దీంతో కార్తీక్ మీద పగబట్టిన కాల్ మనీ ముఠా నాయకుడు కార్తీక్ ని రప్పించి చంపడం కోసం, ఒకమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు. కార్తీక్ వెళ్లి వాణ్ణి చంపేస్తాడు. వాణ్ణి కొత్తగా పెళ్లి చేసుకున్న వాడి భార్య కార్తీక్ తల నరికి తీసుకొచ్చేవరకూ బొట్టు తీయనని భీకర ప్రతిజ్ఞ చేస్తుంది. కార్తీక్ ని ప్రజలందరూ బ్రహ్మరధం పడతారు. ఇలా వుండగా, పేదలకోసం పోరాడి జైలుకెళ్ళిన సుధ తండ్రి తిరిగొస్తాడు. వూళ్ళో కార్తీక్ నాయకుడయ్యాడని తెలుసుకుని పిలవమంటాడు. కార్తీక్ తన కూతుర్ని ప్రేమించాడని తెలుసుకుని నిప్పులు గక్కుతాడు. తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే ఇతరుల కోసం పోరాటాలు మానెయ్యాలని షరతు పెడతాడు. ఇదీ కథ.
ఎలావుంది కథ
ముందే చెప్పుకున్నట్టు రాజమౌళి రేంజిలో వుంది. ఇలాటి కథని చూడాలనుకుంటే ఇదే టికెట్టు పెట్టి చక్కగా రాజమౌళి, బోయపాటి, సురేంద్ర రెడ్డి సినిమాల్ని కరువుదీరా చూసుకోగలరు ప్రేక్షకులు. వాటికి చీప్ నకళ్ళు చూడాల్సిన అవసరం లేదు. కోటి లోపు బడ్జెట్ తో ‘పెళ్లిచూపులు’ ఇలా తీయలేదు. ‘రధం’ ప్రధానంగా ప్రేమ కథ. కానీ కాల్ మనీ అంటూ వీర హీరోయిజాల మీద దృష్టి పెట్టడంతో, ప్రేమ కథకి ఆ కాల్ మనీ వ్యవహారమే లాజిక్ ని మింగేసింది. ఈప్రేమ కథకి పాయింటు ఆసక్తికరంగానే వుంది. హీరోయిన్ తండ్రి పేదల కోసం పోరాడిన ఫలితంగా, కొన్నేళ్ళు జైలు కెళ్ళి కుటుంబానికి దూరమైన కారణంతో, అలాటి పోరాటాలు హీరో మానెయ్యాలని అంటాడు. తన భార్యపడ్డ బాధలు కూతురు పడితే చూడలేనంటాడు. ఈ మాట కూతురు అంటే మానేస్తానని వెటకారంగా అంటాడు హీరో. దీంతో వొళ్ళు మండిన హీరోయిన్ – నిన్ను ప్రేమించడంతో నాకు మా నాన్నని ప్రేమించడం తెలిసిందని ఛీ కొడుతుంది. ఆమెని కొట్టేసి వెళ్ళిపోతాడు హీరో. ఇప్పుడే వీళ్ళు కలిసి వుండకపోతే పెళ్ళయాక ఎలా కలిసి వుంటారని, తండ్రి ఇంకో మాట చెప్తాడు. ఇద్దరూ వేరే వూళ్ళో ఒకే గదిలో వుంటూ చదువుకోవాలని. అలా ఒకే గదిలో వుంటూ చదువు కుంటున్నప్పుడు, గతంలో హీరో చంపిన కాల్ మనీ వాడి ముఠా దాడి చేస్తుంది. దీంతో ఇంకా మారలేదని హీరోయిన్ గొడవ పెట్టుకుని వెళ్ళిపోతుంది. ముందు మారాలని చెప్పిన తండ్రి, ప్లేటు ఫిరాయించి కలిసి వుండాలనడమే కన్విన్సింగ్ గా లేకపోతే, ఇప్పుడు మళ్ళీ గొడవలు పెట్టుకుంటున్నాడని ఫనైల్ గా హీరోయిన్ తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోవడం ఇంకా కన్ఫ్యూజన్. వేరే వూళ్ళో తనతో చదువుకుంటున్న హీరో మీద పథ కక్షతో దాడి చేస్తే హీరో కొత్త గొడవలు పెట్టుకోవడమెలా అవుతుంది? ఈ ప్రశ్న హీరో అడక్కుండా భగ్న ప్రేమికుడైపోతాడు. ఇలా ప్రేమ కథకి ఒక అర్ధం లేక, ముగింపు కూడా ‘అర్జున్ రెడ్డి’ ముగింపు కి ఇంకాస్త పొడిగించి, ఏదో అయిందన్పించారు.
ఎవరెలా చేశారు
కొత్త హీరో గీతానంద్ పర్సనాలిటీ, ఫేస్ కట్ బావున్నాయి గానీ, సినిమా అంతా ఒకే ఎక్స్ ప్రెషన్. పెద్ద స్టార్లు చేసే రేంజిలో ఫైట్లు చేస్తూంటే ప్రేక్షకుల్లోంచి నవ్వులు. భారీ సమస్య భుజానేసుకుని వూరికి అపద్బాంధవుడిలా బిల్డప్ ఇస్తూంటే కూడా నవ్వులు. రోమాన్స్ ఒక్కటే అతడికి సూటయ్యింది. కొత్త టీనేజీ హీరోయిన్ చాందినీ చిలిపిగా నటించాలని ప్రయత్నించింది గానీ, నడుం కింద నుంచి ఆమె పహిల్వాన్ లా వుంది. ఎప్పుడూ చుడీ దార్, షల్వార్ లోనే చూపిస్తూంటే ఇది తెలియలేదు గానీ, మధ్యలో ఒక లిప్ లాక్ సీన్లో ఇహ తప్పక జీన్స్ వేసినప్పుడు భారీగా వున్న తొడలు బయటపడి భయపడాల్సి వచ్చింది. కొత్తగా వచ్చే హీరోయిన్ స్లిమ్ గావుండాలని ఆలోచన వున్నట్టు లేదు. ఇతర నటీనటు
లందరూ కొత్త వారే. తండ్రిగా వేసిన నటుడి ఎక్స్ ప్రెషన్, నటనా బావున్నాయి.
చిన్న సినిమాల్లో ఇప్పుడు ఆరేసి పాటలెవరూ పెట్టడంలేదు. ఇందులో స్టార్ సినిమాల్లో లాగా ఆరు పాటలూ పెట్టేశారు. కొత్త మొహాల మీద ఈ పాటలెవరు చూస్తారు. కెమెరా వర్క్ కాస్త బావుంది గానీ, డీఐ ఏకత్వంతో లేదు.
చివరికేమిటి
భారీ రేంజి కథతో బుడ్డ సినిమా తీస్తే ఎలా వుంటుందో తెలియడానికి ఉదాహరణగా దీన్ని తీసుకోవచ్చు. ఈ యాక్షన్ బిల్దప్స్ లేకుండా, వున్న ప్రేమ కథనే అర్ధవంతంగా తీసి వుంటే బావుండేది. అవ్వా కావాలి, బువ్వా కావాలి అనుకోవడం వల్ల రెంటికి చెడ్డ రేవడి అయింది. ఇంటర్వెల్ సీను సహా అనేక సీన్లు పెద్ద సినిమాల్లోనివే – అర్జున్ రెడ్డి మార్కు ముగింపు సహా. ఈ సినిమా వల్ల లాభం కొత్త హీరోకే, ప్రయత్నిస్తే ఇంకో నాల్గు అవకాశాలతో రాణించడానికి.