సస్పెన్స్ కాదు సహన పరీక్ష! (‘కవచం’ రివ్యూ)

―సికిందర్

నాల్గు సినిమాల వయస్సున్న బెల్లంకొండ శ్రీనివాస్ విజయం కోసం ఐదో ప్రయత్నం చేస్తున్నాడు. నాల్గేళ్ళుగా అపజయాలెదుర్కొంటూ వస్తున్నతను – మొదట్నుంచీ తన మార్కెట్ కి మించిన పెద్ద బడ్జెట్ సినిమాలనే, పేరున్న పెద్ద హీరోయిన్లనే, టాప్ దర్శకులనే నోచుకుంటున్నాడు. అల్లుడు శీనుతో మొదలుపెట్టి స్పీడున్నోడు, జయజానకీ నాయక, సాక్ష్యం వంటి సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడితో పోలీస్ పాత్ర చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తను యంగ్ స్టారే అయినా పాత మూస సినిమాల చట్రంలో బిగుసుకుపోయాడు.

తను ముందుకెళ్ళడానికి ఇదే పెద్ద అవరోధంగా మారింది. మరి కొత్త దర్శకుడితోనైనా ఇప్పుడు కొత్త ప్రయత్నం చేశాడా అన్నది ప్రశ్న. కాజల్ అగర్వాల్ కొంత క్లూ ఇచ్చింది. కవచం ఒక ఉత్కంఠ రేపే స్పీడ్ థ్రిల్లర్ అనీ, తర్వాతేం జరుగుతుందో ప్రేక్షకులు వూహించలేరనీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు అసలు కథని వెల్లడిస్తాయనీ, కమర్షియల్ గా పూర్తిగా డిఫరెంట్ మూవీ అనీ చెప్పింది. మరి ఇలా వుందా? ఒకసారి చూద్దాం…

 

కథ

విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్) వైజాగ్ లో ఎస్సై. తల్లితో వుంటాడు. ఒకరోజు పర్సు పోగొట్టుకుంటే ఒకమ్మాయి (కాజల్ అగర్వాల్) తెచ్చిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇంతలో ఆమెకి పెళ్లి నిశ్చయమై వెళ్ళిపోయిందని తెలిసి బాధపడతాడు. సంయుక్త ( మెహ్రీన్ )అనే ఇంకో అమ్మాయి పరిచయమవుతుంది. కనపడని ఆమె లవర్ ని వెతికేందుకు తోడ్పడతాడు. ఇంతలో తల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడుతుంది. ఆపరేషన్ కి 50 లక్షలు కావాలి. సంయుక్త తనని కిడ్నాప్ చేసి మేనమామ (ముఖేష్ రిషి) దగ్గర ఆ డబ్బు డిమాండ్ చేయమంటుంది. విజయ్ ఆమె చెప్పినట్టు చేసి తల్లిని కాపాడుకుంటాడు. కానీ తర్వాత సంయుక్త కనిపించకుండా పోతుంది. కిడ్నాప్ నేరం విజయ్ మీద పడుతుంది. ఇంతకీ సంయుక్త ఏమైంది? విజయ్ ప్రేమించిన మొదటి అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరికీ ఏమిటి సంబంధం? విజయ్ ని ఇరికించిన శత్రువెవరు? విజయ్ ఎలా బయటపడ్డాడు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాల్సిందే.

ఎలావుంది కథ

ఒక జానర్ కి కట్టుబడి లేదు. ఫస్టాఫ్ అంతా తెలిసిన రొటీన్ మూస ఫార్ములా టెంప్లెట్ గా సాగుతూ, హఠాత్తుగా ఇంటర్వెల్లో సస్పన్స్ థ్రిల్లర్ జానర్ లోకి తిరగబెడుతుంది. అక్కడ్నించీ సెకండాఫ్ ఎండ్ సస్పెన్స్ కథగా సాగుతుంది. ఈ సస్పెన్స్ ప్రేక్షకులు ముందే వూహించేస్తారుగానీ, పోలీసు పాత్ర అయిన హీరోయే తన శశత్రువెవరో తెలుసుకోడు. దీంతో ఎండ్ సస్పెన్స్ కూడా విఫలమయింది. ఓవరాల్ కథగా చూస్తే, కుటుంబంలో పాత కుట్రల కథే. వెంకటేష్, కత్రినా కైఫ్ ల ‘మల్లీశ్వరి’ లాగా. పాత కుటుంబ కుట్రల్ని రీసైక్లింగ్ చేసి సస్పెన్స్ కానీ సస్పెన్స్ కథ చేశారు.

ఎవరెలా చేశారు

బెల్లంకొండ శ్రీనివాస్ నటనతప్ప మిగతా డాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరు నిలబెట్టుకున్నాడు. కాకపోతే ‘తగిన కథ తప్ప’ – అని కూడా జోడించాలి. ఇప్పుడు కూడా పాత మూస చట్రంలోనే వుండిపోయాడు. ఈసారి పాత్రకి తగిన భావోద్వేగాలు కూడా లేక కృత్రిమ పాత్ర పోషించాడు. కాజల్ అగర్వాల్ తో రోమాన్స్ కూడా రొటీన్ టెంప్లెట్ రోమాన్సే. అందులో ఏదో నవ్వించబోయాడుగానీ ప్రేక్షకులు ఎక్కడా నవ్వలేదు. సెకండాఫ్ లో అసలు నవ్వడానికి అవకాశమే లేని సీరియస్ నెస్. ఇక డైలాగులు చూస్తే, ‘భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా, వాడే పోలీస్!’ … ‘పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదురా, పోలీస్!’…లాంటి పాత మూస డైలాగులు ఇప్పుడు కూడా వాడడం హాస్యాస్పదంగా వుంది. ఇవెప్పుడో సాయికుమార్ మొదలెట్టి ఆయనే మానేశాడు.

కాజల్ అగర్వాల్ గ్లామరస్ గా వుంది, పాత్రగా చేయడానికి ఏమీ లేకపోయినా. నెగెటివ్ పాత్రలో మెహ్రీన్ పీర్జాదా కథని మలుపు తిప్పడానికి పనికొచ్చింది – అది మలుపనుకుంటే. విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ చివరి అరగంటలో విజృంభిస్తాడు. సత్యం రాజేష్ కానిస్టేబుల్ గా కనిపిస్తాడు.

మ్యూజికల్ గా తమన్ కాస్త ఫర్వాలేదు. పాటలు గుర్తుకురాక పోయినా చూస్తున్నంత సేపూ క్యాచీ ట్యూన్స్ తోనే వుంటాయి. వీటికి చిత్రీకరణకి లొకేషన్స్ అద్భుతంగా వున్నాయి. సినిమా ఎలావున్నా ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ కూర్చోబెట్టేస్తుంది. కానీ ఈ సినిమాని ఎలా ముగించాలో తెలీనట్టు సాగదీసుకుంటూ పోవడంతో కూర్చోబెట్టడానికి ఛోటా కె నాయుడుకి పని పెరిగింది. ముందే చెప్పుకున్నట్టు బెల్లంకొండ శ్రీనివాస్ అంటేనే బిగ్ బడ్జెట్స్ తో, అదిరిపోయే ప్రొడక్షన్ విలువలతో వుంటాయి- విషయం తప్ప. ఇదీ అలాగే వుంది.

చివరికేమిటి

‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా వుండాలి’ అని ఇంకో డైలాగు. సస్పెన్స్ త్రిల్లర్ తీయాలంటే టెంప్లెట్ ఫార్ములా కంటే ఎక్కువ ఇంటలిజెంట్ గా వుండాలని మనకన్పించే ఒపీనియన్. కొత్తదర్శకుడు కూడా వరసగా ఫ్లాపవుతున్నటెంప్లెట్ నే ఫాలో అయ్యాడంటే ఏమనుకోవాలో అర్ధంగాదు. పాపం కాజల్ అగర్వాల్ ఇది డిఫరెంట్ కమర్షియల్ మూవీ అని చాలా చెప్పింది. ఆమె మాటల్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్ హీరో ఎంట్రీ, ఫైట్, గ్రూప్ సాంగ్, హీరోయిన్ ఎంట్రీ, ఆమెతో లవ్ ట్రాక్, లవ్ సాంగ్, ఆమెతో లవ్…ఇలా పసలేని రొటీన్ టెంప్లెట్ గా సాగి సాగి, రెండో హీరోయిన్ తో మళ్ళీ ఇంకో ట్రాక్ గా సాగిసాగి – ఇంటర్వెల్ కి చేరగానే సస్పెన్స్ థ్రిల్లర్ అయిపోతుంది.

ఇక్కడ ఇంటర్వెల్ లో అజయ్ తో ఇచ్చిన ట్విస్టు లేదా బ్యాంగు కూడా ఉత్తదేనని ఇంటర్వెల్ తర్వాత పదినిమిషాల్లో తేలిపోతుంది. ఇంటర్వెల్ సీను కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించేలా వుంది. అసలు విలన్ అయిన నీల్ నితిన్ ముఖేష్ ని తెరపైకి తీసుకు రాకుండా ఎండ్ సస్పెన్స్ గా పెట్టుకోవడంతో ఇంటర్వెల్ కీ గతి పట్టింది. ఈ కుట్ర నీల్ నితిన్ ముఖేష్ దేనని వెంటనే సెకండాఫ్ లో మనకి తెలిసిపోతున్నా, హీరోకి చివరిదాకా తెలీక పాసివ్ గా తిరుగాడుతూంటాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథనమెలా చేయాలో తెలియకపోతే వచ్చే తిప్పలివి.

పైగా అనేక ట్విస్టులు, సబ్ ప్లాట్లు సెకండాఫ్ ని కన్ఫ్యూజ్ చేసేస్తాయి. అసలు కాజల్ అగర్వాల్ పేరు ‘సంయుక్త’ పేరు పెట్టుకుని మెహ్రీన్ మోసం చేస్తూంటే ఎస్సై అయిన బెల్లం కొండకి తెలీదా? ఇలాటి లాజిక్ లేని అంశాలు చాలా వున్నాయి. మూస ఫార్ములాకి ఏ లాజిక్ తోనూ పనుండదు. సస్పెన్స్ థ్రిల్లర్ ని లాజికల్ గా తీసినప్పుడే రాణింపు. ఇలా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ని కూడా మూస ఫార్ములాగా తీసెయ్యాలనుకుంటే ఇలాటి ఫలితాలే వస్తాయి.

దర్శకత్వం : మామిళ్ళ శ్రీనివాస్.
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పీర్జాడా, నీల్ నితిన్ ముఖేష్, ముఖేష్ రిషి తదితరులు
సంగీతం : తమన్, ఛాయగ్రహణం : చోటా కె నాయుడు
బ్యానర్ : వంశధార క్రియేషన్స్
నిర్మాత : ఎస్. నవీన్
విడుదల : 7 డిసెంబర్, 2018

Rating: 2 / 5