బెల్లంకొండ ఛత్రపతి.. రెస్పాన్స్ ఎలా ఉందంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అతని తెలుగు సినిమాలకి హిందీ డబ్బింగ్ వెర్షన్ లో విపరీతమైన ఆదరణ ఉంది. యుట్యూబ్ లో మిలియన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలు చూస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని స్ట్రైట్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టాలని ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతిని రీమేక్ చేశారు.

హై వోల్టేజ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ చిత్రంగా వివి వినాయక్ ఈ మూవీని హిందీలో తెరకెక్కించారు. పెన్ ఇండియా ఈ మూవీని హిందీలో భారీ బడ్జెట్ తో నిర్మించింది. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి హిందీలో డిజాస్టర్ టాక్ వస్తోంది. హిందీ ఫిల్మ్ క్రిటిక్స్ అందరూ కూడా అతి తక్కువ రేటింగ్స్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ కథ పరంగా అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీలో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించింది.

ఇక విలన్ గా శరద్ కేల్కర్ కనిపించారు. హీరోయిన్ గా నుష్రత్ భరూచా కనిపించింది. పాకిస్తాన్ నుంచి అనుకోని పరిస్థితిలో తల్లి నుంచి విడిపోయిన శివ గుజరాత్ తీరానికి చేరుకుంటారు. అక్కడ ఒక మాఫియా డాన్ అడ్డాలో బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. అనుకోకుండా వారికి ఎదురుతిరిగి ఛత్రపతిగా మారుతాడు. ఆ పరిస్థితులు ఏంటి. ఛత్రపతిగా మారిన తర్వాత శివ ప్రయాణం ఎలా సాగింది మూవీలో ఉంటుంది.

ఇక ఈ మూవీలో కథ అందరికి తెలిసిందే అంటే తెలుగులో ఉండే ఎమోషనల్ ఎలిమెంట్స్ హిందీలో లేవనే మాట వినిపిస్తోంది. అలాగే డైలాగ్స్, కథనం కూడా ఎక్కడా మెప్పించే విధంగా లేదు. సిచువేషన్ తో సంబంధం లేకుండా వచ్చే సాంగ్స్, అవసరానికి మించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ ఇలా అన్నింటా మూవీ ప్రేక్షకులని నిరాశపరిచింది. మూవీలో చెప్పుకోదగ్గ విధంగా ఏమైనా ఉందంటే అవి యాక్షన్ సీక్వెన్స్, బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి.

మూవీ కోసం తాను ఎంత కష్టపడాలో అంతా పడ్డాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో వివి వినాయక్ ఆవిష్కరించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలలో నార్త్ ఆడియన్స్ యాక్షన్స్ సీక్వెన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఎమోషనల్ బ్లాక్ ని పక్కన పెట్టి వివి వినాయక్ కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్స్ మీదనే దృష్టి పెట్టారు. ఈ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది వీకెండ్ లో తెలిసిపోతోంది.