ఛత్రపతి రీమేక్.. కోలుకోలేని దెబ్బ

టాలీవుడ్ కమర్షియల్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ఛత్రపతి మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాను ఇప్పటి వరకు చేసిన తెలుగు సినిమాలు అన్ని కూడా హిందీలో డబ్బింగ్ అయ్యి యుట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. జయజానకి నాయకా మూవీకి ఇండియాలోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి. దీంతో నార్త్ ఇండియాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి భీభత్సమైన మార్కెట్ ఉందని అంచనా వేశారు.

అయితే డిజిటల్ మీడియాలో ఒక మూవీ చూడటం వేరు. థియేటర్స్ లో డబ్బులు పెట్టి కొనుక్కొని చూడటం వేరు అనే విషయం మొదటిరోజే బెల్లంకొండ శ్రీనివాస్ కి అర్ధమైనట్లు ఉంది. మొదటి రోజు థియేటర్స్ లో ఈ మూవీకి చాలా చోట్ల ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ లేవని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ తేల్చేశారు.

నిజానికి తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు అనేసరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే గంగుభాయ్ ఖతియావాడి మూవీని నిర్మించిన పెన్ ఇండియా ఎ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసింది. ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా భారీగానే పెట్టుబడి పెట్టారు.

బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కొత్త హీరో మీద డెబ్యూ ప్రాజెక్ట్ కి హిందీలో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఛత్రపతికి వివి వినాయక్ దర్శకత్వం వహించడంతో యాక్షన్ సీక్వెన్స్ ని చాలా గ్రాండియర్ గా ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ లో మూవీకి పెట్టిన ఖర్చు కనిపిస్తోంది. అయితే సౌత్ మాస్ మసాలా చిత్రాలు యుట్యూబ్ వరకే బాగుంటాయని నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఛత్రపతి రీమేక్ ని నిర్వంద్వంగా తిరస్కరించారు.

ఎంత గట్టిగా ప్రమోషన్ చేసిన ఈ మూవీని ఆడియన్స్ లోకి తీసుకొని వెళ్ళలేకపోయారు. దీంతో ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఓవరాల్ గా మొదటిరోజు 60 లక్షలు మాత్రమే ఈ మూవీ వసూలు చేసిందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన మూవీగా ఇది నిలిచిందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే జీరో షేర్ వచ్చిందని తెలుస్తోంది. థియేటర్ రెంట్ ఖర్చులు కూడా ఛత్రపతి మూవీతో రాలేదనే మాట వినిపిస్తోంది.