కాంచన –3
రచన – దర్శకత్వం : రాఘవ లారెన్స్
తారాగణం : రాఘవ లారెన్స్, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, శ్రీమాన్, దేవదర్శిని, తరుణ్ ఆరోరా, కోవై సరళ, ఢిల్లీ గణేశన్, కబీర్ దుహన్ సింగ్, తదితరులు
మాటలు: ఏ. రాజేష్ మూర్తి, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, వెట్రి పళని స్వామి
నిర్మాత: రాఘవ
విడుదల : ఏప్రెల్ 19, 2019
1.5 / 5
ఇటు తెలుగు నుంచి కాకపోతే అటు తమిళం నుంచి ఎప్పుడూ ఏదోవొక దెయ్యం కామెడీలు ప్రేక్షకుల తాట తీస్తున్నాయి. దెబ్బకి థియేటర్లు ఖాళీగా కన్పిస్తున్నాయి. లేక మన పక్కన ఖాళీగా వుంటున్న సీట్లలో దెయ్యాలుగా మారిపోయిన ప్రేక్షకులే కూర్చుంటున్నారేమో. రేపోమాపో మన గతీ ఇంతేనేమో. తెరమీద హార్రర్ కి భయపడే మాటేమో గానీ, ఖాళీగా వుంటున్న పక్క సీట్లలోకి చూడాలంటేనే భయమేస్తోంది. అదీ సెకెండ్ షోకైతే రొంబ టెర్రిఫిక్! ఈ రెండు నెలల్లోనే తమిళంలో, తెలుగులో ఐరా, బొట్టు, వేరీజ్ వెంకట లక్ష్మి, చీకటిగదిలో చితక్కొట్టుడు, ప్రేమ కథా చిత్రం – 2 అనే 5 సీరియస్ / కామెడీ దెయ్యాల వడ్డన అయింది. ఇవి చాలనట్టు దెయ్యం కామెడీల రుచిమరిగిన తమిళ లారెన్స్ రాఘవ, ఇంకో ‘కాంచన – 3’ అనే రెండు దెయ్యాల కామెడీతో వచ్చాడు. ప్రేక్షకులు వీటి హార్రర్స్ కి భయపడక, కామెడీలకి నవ్వూ రాక మొద్దుబారి పోయి చాలా కాలమైంది. అయినా గృహమేకదా స్వర్గసీమ టైపులో వీటి మత్తులోపడి ఇంకా తీసుకుంటూనే పోతున్నారు. పోనుపోను దిగజారిపోయి దెయ్యాలు కూడా పారిపోయేట్టు తీసే పరిస్థితి కొచ్చారు. లారెన్స్ రాఘవ ఈ బీభత్సంతో ఆగక, ‘కాంచన -4’ కూడా వుంటుందని బెదిరింపుగా హింట్ ఇచ్చాడు ముగింపులో. ముందు ‘కాంచన- 3’ ఎంత ‘బి గ్రేడ్’ కంటే పతనమైన స్థాయిలో వుందో తెలుసుకుంటే, ‘కాంచన- 4’ ఇంకెంత ‘సి గ్రేడ్’ గా వుండబోతోందో వూహకందుతుంది…
కథ
అనగనగా ఒక వూరు. ఆ వూళ్ళో ఓ తాతయ్య షష్టి పూర్తి కార్యక్రమం. అక్కడికి రాఘవ (లారెన్స్) కుటుంబాన్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ తన ముగ్గురు మరదళ్ళు వుంటారు (ఓవియా, వేదిక, నిక్కీ). ఈ మరదళ్ళతో సరసాలాడాలని వెళ్తే అక్కడ దెయ్యం వుంటుంది. దీంతో భయపడి మంత్రగాడిని పిలిపిస్తారు. వాడొచ్చి మంత్రాలేసి దెయ్యాన్ని వెళ్ళగొట్టానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ దెయ్యం అలాగే వుంటుంది. ఇప్పుడు ఒకటి కాదు రెండు దెయ్యాలు. ఒక దెయ్యం కాళీ,ఇంకో దెయ్యం జూలియా. ఈ రెండూ రాఘవ శరీరంలోకి దూరిపోతాయి. ఇక రాఘవ ద్వారా శత్రువుల మీద పగ దీర్చుకోవాలనుకుంటాయి ( అదేదో శత్రువుల శరీల్లాలోకే దూరి చంపొచ్చుగా?). ఇక ఈ జంట దెయ్యాల కథేమిటి, అసలు కాళీ, జూలియా లెవరు, ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు…ఇవీ తెలుసుకోవాలని అర్జెంటుగా ఆసక్తి పుడితే మిగతా సినిమా చూడొచ్చు.
ఎలావుంది కథ
అర్థం పర్ధం లేని ‘బి గ్రేడ్’ కథ. దీనికి తోడైన మన నరాలు చిట్లిపోయే అరుపులు కేకలు, విపరీత సౌండ్ పొల్యూషన్. ఎలాగూ ప్రేక్షకులు మామూలుగా దెయ్యాలకి భయపడడం మానేశారనేమో, ఇలా అన్ని పాత్రలూ కలిసి కట్టుగా గట్టిగా అరుపులు అరిచి మాట్లాడే, వీధి నాటకాలని తలదన్నే ఓవర్ యాక్టింగులు. అసలే కథలో ఏమీ లేదు. ప్రతీ దెయ్యం కామెడీ ఈ టెంప్లెట్ లోనే వుంటుంది : ఎవరితోనో అన్యాయం జరిగి చచ్చిన పాత్ర, అది దెయ్యమై ఒక ఇంట్లోనో, వొంట్లోనో దూరి ప్రతీకారం తీర్చుకోవడానికి భయపెట్టడం, దీంతో ఇతరపాత్రలు కామెడీగా భయపడ్డం. ఈ విలువ కోల్పోయిన టెంప్లెట్ తోనే లారెన్స్ ఇంకా వాడేస్తున్నాడు. దీనికి బోనస్ గా పాత్రల లౌడ్ కామెడీలు జోడించాడు. మొన్న వచ్చిన తమిళ ‘బొట్టు’ సౌండ్ పొల్యూషన్ తో పోటీ పడుతున్నట్టు ఈ నాసిరకం దెయ్యాల కథ తీశాడు.
ఎవరెలా చేశారు
చనిపోయి దెయ్యమైన కాళి, ఆ దెయ్యం దూరిన రాఘవ డబుల్ రోల్ చేశాడు లారెన్స్. భరించలేని చవకబారు ఓవరాక్షన్, కెమెరాకి క్లోజప్స్ పెట్టేసి మొహమంతా అష్టవంకర్లు తిప్పుతూ దెయ్యం యాక్షన్, ప్రతీ డైలాగూ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు గట్టిగా అరుపులు అరిచి మాట్లాడ్డం. ప్రేక్షకులు పశువుల మంద అన్నట్టు తన ఇష్టారాజ్యం. ఎక్కడా భయపెట్టిందీ లేదు, నవ్వించిందీ లేదు.
సీనియర్ హాస్య నటి కోవై సరళ తన కామిక్ సెన్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ఎంత రోత కామెడీకైనా నవ్విస్తుంది. ఈమెని చూసి లారెన్స్ నేర్చుకోవాలి. మరదళ్ళుగా ముగ్గురు హీరోయిన్లు అసభ్య చేష్టలకి, పాటలకి పనికొచ్చారు. ఇక విలన్ పాత్రలో కబీర్ దుహన్ సింగ్ వుంటాడు.
కెమెరా యాంగిల్స్, హార్రర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎప్పుడో పసతీరి పోయాయి. ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ చేసే ప్రసక్తే లేదు. తమన్ సంగీతంలో పాటలెంత వల్గర్ గా వున్నాయో, నేపధ్య సంగీతం పాత్రల అరుపులతో పోటీ పడుతూ అంత లౌడ్ గా వుంది.
చివరికేమిటి
ఇంకా ‘ముని’ సక్సెస్ ని సీక్వెల్స్ చేసి సొమ్ము చేసుకోవాలనే ఆశకి పోయి చతికిలబడ్డ లారెన్స్ ట్రాజెడీ ఇది. మాస్ ప్రేక్షకులు కొందరు చూస్తారేమో. ఒకప్పుడు హార్రర్ సినిమాలంటే ఒక వర్గం ప్రేక్షకులు చూసే ‘బి గ్రేడ్’ సినిమాలుగా వుండేవి. అలాటిది పెద్ద హీరోహేరోయిన్లు వీటిలో నటిస్తూ అన్నివర్గాల ప్రేక్షకులు చూసేట్టు మెయిన్ స్ట్రీమ్ ‘ఏ గ్రేడ్’ కి స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి ‘బి గ్రేడ్’ కి చేరవేసి చేతులు దులుపు కుంటున్నారు.
లారెన్స్ ఇందులో సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ గా వచ్చే రాజకీయ గూండాయిజం చూపించాడు. ఇది చాంతాడంత సాగిసాగి సినిమా నిడివిని రెండు గంటల 42 నిమిషాల సహన పరీక్షకి పెంచేసింది. పోనీ ఈ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా బావుందా అంటే ఇంకా నాటు ‘బి గ్రేడ్’ కథ! నలభై కోట్ల బడ్జెట్ తో తీయాలంటే ఇంత దిగువశ్రేణి ఐడియాలుంటాయా అని ఆలోచనలో పడేసే వృథా ప్రయత్నం చేశాడు లారెన్స్. ఇక ముందు ముందు ‘కాంచన -4’ ని కాచుకోవాలి మనం!
―సికిందర్