కథ, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
తారాగణం: దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే, రవీంద్ర విజయ్, నిళల్ గళ్ రవి, భగవతీ పెరుమాళ్, బిజేష్ నగేష్
స్క్రీన్ ప్లే: సెల్వమణి సెల్వరాజ్ -తమిళ్ ప్రభ, సంగీతం: ఝాను చంథర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : డానీ సాంచెజ్-లోపెజ్
కూర్పు : లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వెజ్
బ్యానర్స్ : స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్
నిర్మాతలు : రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి,జోం వర్ఘీస్
విడుదల : నవంబర్ 14, 2025
The much-anticipated release has led to a surge in interest for a comprehensive Kaantha Movie Review.
వర్ధమాన మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మలయాళ- తెలుగు- తమిళ-హిందీ భాషల్లో వైవిధ్యభరిత సినిమాలు నటిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. మహానటి, సీతరామం, లక్కీ భాస్కర్, చుప్ -ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, లోకా వంటి సినిమాల తర్వాత మరిన్ని ప్రత్యేకతలతో తాజాగా తమిళంలో ‘కాంత’ నటించాడు. ఇది ఆసక్తి రేపుతూ తెలుగులో విడుదలైంది. సల్మాన్ తో చేతులు కలిపి బహు భాషా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఈ మూవీలో నటించడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇంకా తమిళ నటుడు సముద్ర ఖని ఒక ముఖ్య పాత్రలో, తెలుగులో మిస్టర్ బచ్చన్, కింగ్డం సినిమాల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంకో ముఖ్యపాత్ర నటించిన ఈ మూవీకి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. ఇతను క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ తో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అలాగే నీలా (2016), లైఫ్ ఆఫ్ పై (2012) వంటి విభిన్న సినిమాలతో తనకో శైలిని ఖరారు చేసుకున్నాడు. ఇప్పుడు ‘కాంత’అనే పీరియెడ్ డ్రామా థ్రిల్లర్ తో ఇంకో విజయం సాధించేందుకు ప్రేక్షక లోకం ముందుకొచ్చాడు. పోర్ట్ ఫోలియో చూస్తె ఇంత ఆకర్షణీయంగా వున్న ఈ మూవీలో ఉన్నదేమిటి, అదెంతవరకూ మెప్పిస్తుంది ఈ కింద తెలుసుకుందాం…

కథేమిటి?
ఈ కథ 1950ల నాటి మద్రాసులోని మోడరన్ స్టూడియోస్ లో ప్రారంభమవుతుంది. ఈ స్టూడియోలో లోపలేం జరుగుతోందో బయటికి సమాచారం రాదు. అంత నిగూఢంగాసినిమా నిర్మాణ కార్యకలాపాలు జరుగుతూంటాయి. అయితే ఈ స్టూడియో నష్టాల్లో వుంటుంది.
దీంతో స్టూడియో అధినేత, నిర్మాత మార్టిన్ (రవీం ద్ర విజయ్) దర్శకుడు అయ్యా (సముద్రకని) ని పిలిఛి, చాలా కాలం క్రితం ఆగిపోయిన ‘శాంత’ అనే సినిమాని పూర్తీ చేయమంటాడు.ఈ సినిమాలో హీరో మహదేవన్ (దుల్కర్ సల్మాన్). ఇతను అప్పట్లో అయ్యా (అయ్యా అంటే సర్ అని అర్ధం) శిష్యుడు. వీధి నాటకాలేస్తున్న మహదేవన్ ని ప్రోత్సహించి సినిమా హీరో చేశాడు అయ్యా. ఇప్పుడు అదే మహదేవన్ స్టార్ గా ఎదిగాడు. ఎదగడంతో ఇగో కూడా పెరిగింది. గురువుగారు దర్శకుడు అయ్యా ఆగిపోయిన ‘శాంత’ ని పూర్తి చేసేందుకు అడగడంతో మహదేవన్ కొన్ని కండిషన్లు పెడతాడు. సినిమా టైటిల్ ‘కాంత’ గా మార్చాలనీ, తను చనిపోయే క్లయిమాక్స్ కూడా మార్చాలనీ వగైరా. అసలు అయ్యా ఈ సినిమాని తన తల్లి జీవితం ఆధారంగా తీసేందుకు సంకల్పించాడు. శిష్యుడు ఇలా షరతులు పెట్టడంతో అతడికీ ఇగో పెరిగి పోతుంది. ఇక్కడనుంచీ ఇద్దరి మధ్య ఇగోల సంఘర్షణ మొదలవుతుంది. షూటింగ్ చేస్తున్నారన్న మాటేగానీ ఇద్దరి మధ్య మాటలుండవు. అసలు అయ్యాని పక్కనబెట్టి తనే షూట్ చేస్తూంటాడు మహదేవన్.
ఈ సినిమాలోకి హీరోయిన్ గా కుమారి (భాగ్యశ్రీ బోర్సే) వస్తుంది. ఆమె పరిస్థితి చూసి అయ్యాని సపోర్టు చేస్తుంది. ఈమెని బర్మా శరణార్ధుల శిబిరంలో చూసి సినిమా నటిని చేశాడు అయ్యా. అయ్యా ఒక పత్రికాధిపతి కుమార్తె దేవి (గాయత్రీ శంకర్) ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు కుమారి పట్ల ప్రేమని పెంచుకుంటాడు. ఇదేమీ పట్టించుకోకుండా మహదేవన్ కుమారిని ప్రేమించడం మొదలెడతాడు. ఇలా తీస్తున్న సినిమా తెరవెనుక జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో స్టూడియోలో ఒకరి హత్య జరుగుతుంది. దీంతో మొత్తం పరిస్థితి తిరగబడు తుంది.ఎవరు చేశారు ఈ హత్య? ఎందుకు చేశారు? హంతకుడ్ని ఎలా పట్టుకోవాలి? ఈ ప్రశ్నలతో పోలీస్ అధికారి దేవరాజ్ (రానా దగ్గుబాటి) ప్రవేశిస్తాడు.

ఎలావుంది కథ?
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ మనుషుల్లోని అహం, ఆశయం, ద్రోహం వంటి ఎమోషన్స్ మధ్య సంఘర్షణగా ఈ కథ రూపొందించాడు. నాటి నటుడు, గాయకుడు ఎంకె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరిగింది. భాగవతార్ ని తమిళ సినిమాలకి మొదటి సూపర్ స్టార్ గా పేర్కొంటారు. అయితే దుల్కర్ సల్మాన్ పాత్రకి ఎంకె మహదేవన్ పేరుతో సహా కథ పూర్తిగా కల్పితమని స్పష్టం చేశాడు తర్వాత దర్శకుడు.
ఐతే ఈ కథ గురు శిష్యుల ఇగోలు – ప్రేమాయణాల సంఘర్షణగా ఆసక్తికరంగా ప్రారంభమై, పకడ్బందీ ఎమోషనల్ డ్రామాగా కొనసాగుతున్నది కాస్తా, అకస్మాత్తుగా మర్డర్ మిస్టరీలోకి తిరగబడడంతో మొత్తం కథే మూడ్ బ్రేకింగ్ సిండ్రోంలో పడి పలాయనం చిత్తగించింది. ఫస్టాఫ్ ఇగోల సంఘర్షణ- సెకండాఫ్ మర్డర్ మిస్టరీ అన్నట్టు స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అవడంతో, రసపోషణ రసకందాయంలో పడక భారీ నష్టం సంభవించింది…
ఫస్టాఫ్ సినిమా షూటింగ్ నేపథ్యంలో 1950 ల నాటి కాలం, ఆ నాటి పాత్రల పరిచయం, వీటితో పీరియెడ్ కథా నేపథ్యం, కళాత్మకంగా వాతావరణ సృష్టి, గురు శిష్యుల మధ్య ఇగోలు, హీరోయిన్ రాకతో ముక్కోణ ప్రేమాయణం, ఈ ప్రేమాయణంతో తలపెట్టిన సినిమా షూటింగ్ ఏమవుతుందా, నష్టాల్లో వున్న నిర్మాత ఏమవుతాడా అన్న సస్పెన్స్ క్రియేటై, వీటికి సమాధానాలు వెతుక్కునే పనిలో ప్రేక్షకులుండగా- ఈ మొత్తాన్నీ క్యాన్సిల్ చేసేస్తూ హత్య జరగడం, దాని తాలూకు ఇంకో కథకి ఇంటర్వెల్ మలుపు తీసుకోవదమన్నది మింగుడు పడని వ్యవహారంగా వుంటుంది!

పోనీ ఈ హత్యకి గురయ్యేది గురు శిష్యుల్లో ఒకరో, లేదా హిరోయినో అయివుంటే కథకి కంటిన్యుటీ, ఎమోషన్లు వుండేవి. ఎవరో మైనర్ పాత్ర హత్య కావడంతో మొత్తం కథే ముక్కలయింది.
సెకండాఫ్ రానా పోలీసు అధికారిగా చేపట్టే ఇన్వెస్టిగేషన్ 50 నిమిషాల సేపూ ఓపికని పరీక్షిస్తూ సుదీర్ఘంగా సాగుతుంది. ఇంట సేపూ ఈ ఇన్వెస్టిగేషన్ తో థ్రిల్, యాక్షన్ వంటివేవీ వుండవు. డైలాగులతోనే కథ నడుస్తూంటుంది. ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా కూడా వుండదు. కథనం లోపాలమయంగా, బలహీనంగా సాగుతూ వుంటుంది. చివర్లో ఈ మర్డర్ మిస్టరీని విపినప్పుడు మాత్రం క్లయిమాక్స్ బావుంటుంది, అంతే.
ఎవరెలా చేశారు?
దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ పీరియెడ్ పాత్రకి న్యాయం చేశాడు. వివిధ భావోద్వేగాల సమాహారంగా విభిన్నంగా నటించాడు. గురువుతో ఇగో, హీరోయిన్ తో ప్రేమ, వృత్తితో దూకుడుతనం ప్రదర్శిస్తూ ఆకట్టుకునే ప్రతిభ చూపించాడు. అయితే సెకండాఫ్ కథే అతడికి సహకరించలేదు భావోద్వేగాల్లేక. పెను భారంగా మారిన సెకండాఫ్ ని తనే మోయలేక వదిలేశాడు. దీని పూర్తీ బాధ్యత దర్శకుడిదే.
గురువుగా సముద్రకనికి నటించడానికి పెద్దగా లేదు. దుల్కర్ పాత్ర డామినేషన్ అతడి పాత్రని మింగేసింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాత్రం అన్ని సీన్లలో ఆకట్టుకుంటుంది. కానీ రానా దగ్గుబాటికి కలిసి రాలేదు. అతడి ఇన్వేస్తిగేహ్స్నా లో బలం లేక బోరు కొట్టిస్తాడు.

ఇంకా చిన్న చిన్న పాత్రల్లో చాల మంది నటించారు. వీళ్ళంతా కొత్త వాళ్ళే.
సాంకేతికాల సంగతి?
ఒక్క కెమెరా వర్క్, కళా దర్శకత్వం, కాస్ట్యూమ్స్ తప్ప మిగతా శాఖలు మామూలుగా వున్నాయి. సంగీతం నిరాశ పరుస్తుంది. కెమెరా వర్క్ అత్యంత కళాత్మక దృశ్యాల్ని సృష్టించింది. ఇది సినిమాకి చాలా బలం, అయితే కంటెంట్ వీక్ అవడంతో కెమెరా బలం వృధా అయింది. ఎడిటింగ్ కూడా 2 గంటల 50 నిమిషాల నిడివిని కొనసాగించడం సహన పరీక్షకి దారి తీసింది.
దర్శకుడు సెల్వమణి సెల్వ రాజ్ గతంలో తీసినవి కమర్షియల్ సినిమాలు కావు. భారీ బడ్జెట్ తో కమర్షియల్ సినిమా అనేసరికి తన ఆర్ట్ హౌజ్ సినిమాల అనుభవం చాల్లేదు. ముఖ్యంగా కథతో చేసిన పొరపాటు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేసింది. ఈ బలహీనతని అతను గుర్తిస్తే కమర్షియల్స్ తో కూడా మంచి గుర్తింపు సాధించా వచ్చు.
రేటింగ్ : 2.25 /5

