ఇదో ‘గే’ కామెడీ! : ‘నర్తనశాల’  ( మూవీ రివ్యూ)

(సికిందర్)
చిత్రం :  ‘నర్తనశాల’ 
            రచన – దర్శకత్వం :శ్రీనివాస చక్రవర్తి 
            తారాగణం : నాగశౌర్య, కాశ్మీరా పరదేశీ, యామినీ భాస్కర్, శివాజీ రాజా, అజయ్, జయప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, ఉత్తేజ్ తదితరులు. 
          సంగీతం : మహతీ స్వరసాగర్, ఛాయాగ్రహణం : విజయ్ సి కుమార్ 
          బ్యానర్ :  ఐరా క్రియేషన్స్ 
          నిర్మాత : ఉషా మల్పూరి 
          విడుదల : ఆగస్టు 30, 2018

         ***
       మా రేటింగ్ :   1.5 / 5
          
***


        ‘చలో’ తర్వాత మరో అలాంటి సక్సెస్ కోసం నాగశౌర్య సిద్ధమయ్యాడు. ఈసారి పూర్తి భిన్నంగా ‘గే’ పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి ఈ కొత్త అయిడియాతో వచ్చీ రాగానే నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకున్నారు. దీంతో నాగశౌర్య తల్లిగారు ఉషా మల్పూరి తనే నిర్మాతగా ముందుకొచ్చి సొంత బ్యానర్ లో నిర్మించారు. ఇద్దరు హీరోయిన్లు ఆకర్షణ అనుకున్నారు. పాటల చిత్రీకరణ బావుందని కూడా టాక్ వచ్చింది. మధ్యలో సెన్సార్ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి సరిపెట్టకుండా,          సినిమా చూసి సినిమా ఎలా వుందో పొగిడే బిజినెస్ బాధ్యతలు కూడా మీదేసుకుని విచిత్ర పాత్ర పోషిస్తున్న క్రమంలో, దీనికి కూడా ఆహా ఓహో అంటూ బిజినెస్ జరగడానికి తమ వంతు సహకారాన్ని అందించారు. మరి ఇన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘గే’ కామెడీ చివరికెలా తేలింది? ఏం తేటతెల్లమైంది? తెలుగులో మొదటి ‘గే’ సినిమాగా తెలుగు సినిమాల్ని దాటిందా? ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను బాబో అనిపించు
కుందా?… ఓసారి చూద్దాం…


          కథ


          కొడుకు రాధాకృష్ణ (నాగశౌర్య) ని కళా మందిర్ కళ్యాణ్ (శివాజీ రాజా) అనే అతను  కొన్ని కారణాలవల్ల చిన్నప్పుడు అమ్మాయిలా పెంచుతాడు. పెద్దయ్యాక రాధాకృష్ణ అమ్మాయిలకి ఆత్మ రక్షణా పద్దతులు నేర్పే ట్రైనర్ గా వుంటాడు. అలా మానస (కశ్మీరా పరదేశీ) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఈ ప్రేమలో వుండగా ఇంకో సత్యభామ (యామినీ భాస్కర్) అనే అమ్మాయి రాధాకృష్ణని ప్రేమిస్తుంది. తనని చిన్నప్పుడు ఆడపిల్లలా పెంచినందుకు మగ ఫీలింగ్స్ కలగడం లేదని రాధాకృష్ణ తండ్రికి చెప్పుకుంటాడు. దీంతో వీడికి పెళ్లి ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్న తండ్రి, సత్యభామని కొడుకు ప్రేమిస్తున్నాడని అపార్ధం చేసుకుని, సంబంధం మాట్లాడేస్తాడు. మానసని ప్రేమిస్తున్న  రాధాకృష్ణకి  ఇది తెలిసి, ఇప్పుడు తను సత్య భామని తిరస్కరిస్తే ఆమె తండ్రి (జయప్రకాశ్ రెడ్డి) తో వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, తను ‘గే’ అని చెప్పేస్తాడు. దీంతో సంబంధం క్యాన్సిలవుతుంది. కానీ సత్యభామ అన్న (అజయ్) ‘గే’ కావడంతో, ‘గే’ అని చెప్పుకున్న రాధాకృష్ణ వెంట పడతాడు….ఇప్పుడు రాధాకృష్ణ ఇతన్నుంచి ఎలా కాపాడుకుని, కోరుకున్న మానసని చేపట్టాడన్నది మిగతా కథ. 


ఎలావుంది కథ


          ‘గే’ పాత్రలతో రోమాంటిక్ కామెడీ అనేది తెలుగులో కొత్త కథే. ఈ తరానికి యూత్ అప్పీల్ వున్నదే. కానీ అయిడియా వరకే కొత్త, దాంతో అల్లిన కథంతా పాతావకాయ. సినిమా కథ అనికూడా చెప్పలేకుండా స్టేజి డ్రామాలా వుంది. ఇప్పటి సినిమా లక్షణాలేవీ కన్పించని అరిగిపోయిన పాత స్కూలు మూస. ఎత్తుకున్న ‘గే’ అనే పాయింటు వదిలేసి ఏటో వెళ్ళిపోయే దారీ దిక్కూలేని వ్యవహారం. రోమాన్స్ గానీ, ‘గే’ రోమాన్స్ గానీ, కామెడీ గానీ లేకుండా ఏం తీశారో, ఎవరికోసం తీశారో అర్ధంగాని వృధాప్రయత్నం. 


ఎవరెలా చేశారు


          నాగ శౌర్య ‘గే’ పాత్ర పోషించడానికి తానేమీ ఇబ్బంది పడలేదని చెప్పుకున్నాడు. తన ఫ్రెండ్స్ లో ‘గే’ లుండడం వలన వాళ్ళ బాడీ లాంగ్వేజీని పరిశీలించే వాడినన్నాడు. తెలుగు సినిమాల్లో ‘గే’ కామెడీ సీన్లు కమెడియన్ల మీద చాలానే వచ్చాయి. హిందీలో పూర్తి స్థాయిలో హీరోల మీదే ‘గే’ సినిమా లొచ్చాయి. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఒక హీరోగా నాగ శౌర్య పూర్తి స్థాయి ‘గే’ పాత్ర నటించినట్టు చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ మాట వరసకే ‘గే’ పాత్ర వున్నప్పుడు, దాదాపు ఆ పాత్రే కనపడనప్పుడు, నటించేదేమిటి? అసలిది ‘గే’ కథే కానప్పుడు ‘గే’ పాత్ర ఎక్కడిది? అలా చెప్పుకుని మభ్య పెట్టడం తప్ప. 
          హీరోని ఇరికించే అజయ్ కూడా ‘గే’ వదిలేసి కనపడకుండా పోతాడు. హీరోయిన్లిద్దరూ గెస్టు రోల్సు పోషిస్తున్నట్టు ఎక్కడుంటారో కనపడరు. మరి కనపడేదెవరు? జయప్రకాష్ రెడ్డి, అతడి రొటీన్ గ్యాంగ్. సీనియర్ నటి సుధ కూడా ఎందుకుందో, ఆడవాళ్ళ గ్రూపులో ఒకరిగా బ్యాక్ గ్రౌండ్ లో నిలబడి కనిపిస్తుంది రెండు మూడు సీన్లలో. ఫస్టాఫ్ లో శివాజీ రాజా హీరోకంటే ఎక్కువ నిడివి తినేస్తాడు. పూజారీ పాత్రలో సుదర్శన్ తో ఓల్డ్ కామెడీతో నవ్వించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. 
          ఖర్చు మాత్రం భారీగా పెట్టి రిచ్ గా తీశారు. ఈ ఖర్చు వల్ల కెమెరామాన్ విజయ్ సి కుమార్ కి మాత్రం తన ప్రతిభ విశేషంగా ప్రదర్శించుకునే అవకాశం చిక్కింది. కథలోవుండని హీరోహీరోయిన్ల మీద 
మహతీ స్వరసాగర్ కష్టపడి మ్యూజిక్కొట్టి నాల్గు పాటలిచ్చాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సన్నివేశాలకి తగ్గట్టే పాత మోత విన్పించాడు. సీనియర్ ఎడిటర్  కోటగిరి వెంకటేశ్వర రావు ఒక్కరే ఇక్కడ ఎందుకున్నారో అర్ధంగాదు. ‘గే’ కాని ఈ  ‘గే’ కామెడీని ఇంకెలా ఎడిటింగ్ చేసి, బుక్కయిపోయిన మనబోటి అమాయక ప్రేక్షకుల్ని ఆనందింపజేయగలరు? 


చివరికేమిటి?


          కృష్ణ వంశీ అసిస్టెంట్ అయిన కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి పాత స్కూలుకు చెందిన వాడని అర్ధమవుతోంది. ప్రారంభంనుంచీ చివరిదాకా, ఇప్పటి తెలుగు సినిమాల్లో కన్పించని పాత స్కూలు దర్శకత్వ ప్రతిభ అంతా కన్పిస్తుంది. మార్కెట్ వున్న హీరోతో, మార్కెట్ వుండే ‘గే’ అయిడియా వర్కౌట్ అవుతుందని మాత్రమే అనుకుని, మేకింగ్ కి మార్కెట్ యాస్పెక్ట్ అవసరం లేదనుకున్నట్టుంది. ‘గే’ అయిడియాతో క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా అవసరం లేదనుకున్నట్టుంది. ఇంటర్వెల్లో ఎత్తుకున్న ‘గే’ పాయింటునే వదిలేసి, ఆ పాత్రనే వదిలేసి –ఏం కథ రాశాడో అంతుచిక్కకుండా చేశాడు. ఫస్టాఫ్ ప్రారంభ సీన్లు చూసే ఈ మూవీకి మనుగడ లేదని తెలిసిపోతుంది. యూత్ అప్పీల్ ని పెంచే హీరో ఎక్కడుంటాడో తెలీదు, యూత్ అప్పీల్ ని నీరు గార్చేస్తూ శివాజీ రాజా ఎక్కువ వుంటాడు. ఇద్దరు హీరోయిన్లు సరే, వాళ్ళని మనం మర్చిపోతాం. వాళ్ళు పూర్తి పారితోషికాలు తీసుకుని పార్ట్ టైం చేస్తున్నట్టు కనబడి పోతూంటారు. చివరికెలాగో ఇంటర్వెల్లో శివాజీరాజా జయప్రకాష్ రెడ్డితో సంబంధం కలుపుకున్న పరిణామాల్లో, నాగశౌషౌర్య తను ‘గే’ నని చెప్పుకునే ట్విస్టు కి, తను కూడా ‘గే’ యేనని అజయ్ ఇచ్చే కౌంటర్ ట్విస్టుతో ఇంటర్వెల్ పార్టు మంచి ట్విస్టు నిస్తుంది.
          ఇంతే, నాగశౌర్యకి ఇద్దరు హీరోయిన్లతో వున్న రోమాంటిక్ ట్రయాంగిల్ కి, ‘గే’ గా తోడయిన అజయ్ తో మిక్స్డ్ రోమాంటిక్ కామెడీ – ఇక సెకండాఫ్ లో ఓల్డ్ స్కూల్ డ్రామాగా నైనా వుంటుందనుకుంటే – అదేమీ వుండదు. ‘గే’ కామెడీ వుండదు, రోమంటిక్  కామెడీ వుండదు. మరి వుండే దేమిటి? జయప్రకాశ్ రెడ్డి ఇంట్లో ఇరుక్కున్న నాగశౌర్య, కేరాఫ్ శీను వైట్ల స్కీముతో బయటపడే ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిన వ్యవహారం!
          దీనికి ‘నర్తనశాల’ అనే పాత క్లాసిక్ టైటిల్ అరువు దెచ్చుకోవడం దేనికంటే – హీరో నాగశౌర్య డ్రామా ఆడే జయప్రకాశ్ రెడ్డి ఇల్లే ఒక నర్తనశాల అని దర్శకుడు కవి హృదయం కాబట్టి కావచ్చు. రెండు మంచి మార్కెటబిలిటీలు నాశనమయ్యాయి – ఒకటి ‘గే’ పాయింటు, రెండు ‘నర్తనశాల’ టైటిల్.