గీత దాటని వినోదం:  గీత గోవిందం (మూవీ రివ్యూ)

(సికిందర్)   


రచన – దర్శకత్వం : పరశురాం 
విజయ్ దేవరకొండ, రాష్మిక, సుబ్బరాజు, నాగేంద్ర బాబు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
రచన : జాన్, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : మణి కందన్ 
బ్యానర్ : జీఏ 2 పిక్చర్స్ 
నిర్మాతలు : బన్నీ వాస్ 
విడుదల : 15 ఆగస్టు, 2018

మా రేటింగ్   3 / 5

కథ 

          గోవింద్ (విజయ్) ఒక కాలేజీలో లెక్చరర్. ఎలాటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే  దానిగురించి అతడికి కొన్ని అభిప్రాయాలుంటాయి. అలాటి లక్షణాలున్న గీత (రశ్మిక) ని చూడగానే ఇష్టపడతాడు. ఒకరోజు రాత్రి  వూళ్ళో చెల్లెలి ఎంగేజి మెంట్ కి బస్సెక్కుతాడు. అదే బస్సు గీత కూడా ఎక్కుతుంది. పక్కనే నిద్రలో వున్న ఆమెని సెల్ఫీ తీసుకోబోయి బస్సు కుదుపుకి మీద పడి కిస్ పెట్టేస్తాడు. దాంతో ఆమె అసహ్యించుకుంటుంది. అతడి అంతు చూడాలని అన్నకి (సుబ్బరాజు) కి కాల్ చేసి చెప్పేస్తుంది. అన్న తన్నడానికి బస్టాపులో కాపేస్తాడు. విజయ్ మధ్యలోనే బస్సు దూకి పారిపోతాడు. ఇంటికెళ్లాక అప్పుడు తెలుస్తుంది – చెల్లెల్ని ఈ గీత అన్నకే ఇచ్చి చేస్తున్నారని. దీంతో ఇరుకున పడతాడు గోవింద్. గీత అన్న గీతతో మిస్ బిహేవ్ చేసిన వాణ్ణి వదలకుండా వెతికి పట్టుకుని చంపాలని ప్రయత్నిస్తూంటాడు. ఇప్పుడు వాడు గోవిందే అని గీత చెప్పేస్తుందా? చెప్పేస్తే గోవింద్ చెల్లెలి పెళ్లి ఆగిపోతుందా? ఈ గడ్డు పరిస్థితిని గోవింద్ ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 

          కొత్తదనం లేదు. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ జానర్ లో రొటీన్ గా వచ్చే కథే. కాకపోతే  ‘చిలసౌ’ లో లాగా టెంప్లెట్ కథనం చేయకుండా, పాత్రలెదుర్కొనే సమస్యతో సిట్యుయేషనల్ కామెడీ పూత పూయడంతో నిలబడగల్గే కథయ్యింది. పైగా ‘అర్జున్ రెడ్డి’ తో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ పాత్ర చేయడంతో, హీరోయిన్ రశ్మికతో కెమిస్ట్రీ కూడా కుదరడంతో ఈ రొటీన్ రోమాంటిక్ కామెడీ ఫర్వాలేదన్పించే వినోదాత్మకంగా మారింది. 

ఎవరెలా చేశారు 

          ‘అర్జున్ రెడ్డి’ కి భిన్నమైన బుద్ధిమంతుడి పాత్ర విజయ్ పోషించాడు. కామెడీలో అతడి టైమింగ్ పాత్ర చిత్రణకి చాలా ప్లస్ అయింది. దాదాపు చివరివరకూ అతను సమస్యలోంచి బయటపడలేని పాసివ్ పాత్రగానే కన్పించడం కామెడీ కాబట్టి చెల్లిపోయింది. చివర్లో కాస్త హీరోయిజం ప్రదర్శిస్తాడు గానీ. సమస్యకి అతనిచ్చుకునే ముగింపు,  మళ్ళీ పాత్రని జోకర్ లా మార్చేస్తుంది.
          హీరోయిన్ రశ్మిక అందంగా వుంది, పొందిగ్గా వుంది, ప్రేమలో ప్రత్యర్ధి పాత్రని మారిపోతూండే పరిణామాల్లో ఫర్వాలేదన్పించేట్టుగా పోషించింది. ఇక మిగతా ముఖ్య పాత్రల్లో హీరోయిన్ అన్నపాత్రలో సుబ్బరాజు, హీరో ఫ్రెండ్స్ లో ఒకడుగా రాహుల్ రామకృష్ణ, పెళ్లి కొడుకుగా వచ్చే వెన్నెల కిషోర్ లు కథని మలుపులు తిప్పడానికి పనికొస్తారు. విజయ్ తండ్రి పాత్రలో నాగేంద్రబాబు డబ్బింగ్ ఆయన వాయిస్ లాగా అన్పించదు. 
          ఇలాటి రొటీన్ కథని రచన ఎలావున్నా, డైలాగులే నిలబెట్టాలి. దర్శకుడు పరశురాం ఫన్ డైలాగులు పేల్చడానికి సాధ్యమైనంత కృషిచేశాడు. మళ్ళీ ఇది కూడా వరసగా వచ్చిన హేపీ వెడ్డింగ్, శ్రీనివాస కల్యాణంల లాగే పెళ్లి నేపధ్యంలోనే సాంతం సాగే కథ. ఈ నేపధ్యం మాత్రం ఓ  టెంప్లెట్ లా వుంది ప్రస్తుత రోమాంటిక్ కామెడీకి. ఈ పెళ్ళిళ్ళ నేపధ్యాల్ని  వదిలిపట్టి వేరే నేపధ్యాలు సృష్టించలేరేమో. 
          ఇందులో గోపీ సుందర్ సమకూర్చి హిట్టయిన పాట ఒకటి చిత్రీకరణ అంత క్రేజ్ గా ఏమీలేదు. ఇంకా గోపీసుందర్ ‘భలేభలే  మగాడివోయ్’ లో కుదిరినట్టుగా సెమీ క్లాసిక్స్ సాంగ్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు గానీ వర్కౌట్ కావడం లేదు. యూత్ కి ఇలాటి పాటలవసరమా? మణికందన్ కెమెరా వర్క్ ఉన్నతంగా వుంది. అవుట్ డోర్ దృశ్యాల్లో,  పాత్రల ముఖ భావాల్ని పట్టుకోవడంలో ఈసారి మరికాస్త నైపుణ్యం ప్రదర్శించాడు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ కి సెకండాఫ్ సవాలు. ఎందుకంటే ఆయన ఎడిటింగ్ తో కత్తిరింపులేసి పరుగెత్తించడానికి స్కోపు లేకుండాపోయింది. సెకండాఫ్ కి ప్రతీసీనూ ముఖ్యమైనదే. స్వాభావికంగా ప్రతీదీ మందకొడిగా నడిచేదే. ఇంకేం కత్తెరేస్తారు. ఇది స్క్రిప్టు లోపం.

చివరికేమిటి 


          తెలుగు రోమాంటిక్ కామెడీలైనా,  లేదా రోమాంటిక్ డ్రామాలైనా ఎప్పుడూ అవే విసిగించే  రెండే రెండు పాయింట్స్ తో వుంటాయి. ఐతే అపార్ధాలతో విడిపోవడం, లేదంటే ప్రేమ చెప్పలేకపోవడం. దీనివల్ల ఏమవుతోందంటే, హీరోహీరోయిన్ల పాత్రలు విడిపోతాయి. పాత్రలు విడిపోతే అది కథవదు.  ఒరిజినల్ గా రోమాంటికే కామెడీల్లో విడిపోవడం వుండదు. లవర్స్ నువ్వా నేనా అన్నట్టు పరస్పర సంఘర్షలో వుంటారు. అప్పుడే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో, సిట్యుయేషనల్ కామెడీతో ఇద్దరి మధ్యా కథనం రక్తి కడుతుంది. ‘చిలసౌ’ దీన్ని సాధించింది. ఇప్పుడు ‘గీత గోవిందం’ సాధించింది. అదీ విషయం.

          అయితే ‘గీతాగోవిందం’ పాత వాసనలు వదులుకోలేదు. చేసిన తప్పుడు పనితో హీరోయిన్ కీ, ఆమె అన్నకీ మధ్య హీరో ఇరుక్కున్న ఇంటర్వెల్ మలుపు మన్నిక గలదే. దానికి విపరీత రెస్పాన్స్ కూడా వస్తోంది. కానీ తర్వాత ఈ చిక్కు ముడి విప్పడం దగ్గరే హీరోయిన్ పాత్రని దిగజార్చేశారు. అంతవరకూ ఎంతో స్ట్రాంగ్ పర్సనాలిటీతో వున్న హీరోయిన్, హీరో మంచితనం గురించి ఎవరో చెప్పింది నమ్మేసి ప్రేమలో పడిపోతుంది. ఇంతటితో ఆగకుండా రవితేజలా హీరోని  టీజ్ చేస్తూ పాట కూడా పాడేస్తుంది. హీరోమంచితనం వెల్లడయ్యే ఘట్టంకూడా హీరోయిన్ కోసం హీరో ప్లాన్ చేసిన అభిప్రాయాన్నే కల్గించేలా వుంటుంది. ఇక చివర్లో నిత్యామీనన్ సలహా తీసుకుని హీరో కథని ముగించడాన్ని కూడా తేలిగ్గా తీసుకున్నారు.