వైఎస్ షర్మిల అరెస్టపై విజయమ్మ గుస్సా.! ఇంట్లోనే దీక్ష.!

కుమార్తె వైఎస్ షర్మిల అరెస్టు పట్ల వైఎస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను పరామర్శించేందుకు వెళుతున్న తనను పోలీసుఅడ్డుకోవడంపై మరింత తీవ్రంగా స్పందించారు వైఎస్ విజయలక్ష్మి. ‘మేం ప్రభుత్వాలు నడపలేదా.? మాకు పద్ధతులు తెలియవా.? నా కూతుర్ని అరెస్టు చేశారు. నేను పరామర్శించాలి.. ఆమె యోగక్షేమాలు తెలుసుకోవాలి..

‘ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు విజయలక్ష్మి. ‘నన్ను వెళ్ళనిస్తారా.? లేదంటే, తెలంగాణలో కార్యకర్తలు ఆందోళనలు చేయాలనీ, బంద్‌లు చేయాలనీ, గొడవలు చేయాలని పిలుపునివ్వాలా.?’ అంటూ ఒకింత బ్లాక్‌మెయిలింగ్ టోన్‌లోనే విజయలక్ష్మి వ్యాఖ్యానించడంపై పోలీసులు సైతం విస్తుపోయారు.

అనంతరం విజయలక్ష్మిని పోలీసులు గృహనిర్బంధంలో వుంచారు. షర్మిల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతోందనీ, ఈ క్రమంలో ఆమె అరెస్టవడం పట్ల బాధగానే వున్నా, ప్రజల కోసం ఆమె పోరాడుతున్న తీరు పట్ల తనకు గర్వంగా వుందని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిన విజయలక్ష్మి, కొన్నాళ్ళ క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

‘తెలంగాణలో షర్మిల ఒంటరిగా పోరాడుతోంది.. ఆమెకు నేను అండగా వుంటాను..’ అని చెప్పారు విజయమ్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే.