వైఎస్ షర్మిల సాధించిన అతి పెద్ద విజయమిదే.!

చిన్న విషయం కాదిది.! అందుకే, తెలుగుదేశం పార్టీ కూడా కంగారు పడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అయితే మింగలేక కక్కలేక నానా తంటాలూ పడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వైఎస్ షర్మిలకు ఫోన్ చేయడమేంటి.? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంటే, ‘అలా ఎలా చేస్తారు.?’ అంటూ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, అటు తెలుగుదేశం పార్టీ, ఇంకో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వీటన్నిటితోపాటు జనసేన పార్టీ’ గింజుకుంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సంగతి సరే సరి. షర్మిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ఫోన్ రావడం అనేది పూర్తిగా రాజకీయ అంశం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వైఎస్ షర్మిల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి రాజకీయ లబ్దిని బీజేపీ తరఫున ఆశిస్తున్నారన్నది ముందు ముందు తేలుతుంది.
ఈలోగా, ఒక్క ఫోన్ కాల్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యారన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించాక వైఎస్ షర్మిల సాధించిన అతి పెద్ద విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు.

అంతే మరి.! తెలుగు రాష్ట్రాల్లో గడచిన ఎనిమిదేళ్ళలో చాలా అరెస్టులు జరిగాయ్. అప్పుడెప్పుడూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ఆయా రాజకీయ నాయకులకు ఫోన్లు వెళ్ళిన పరిస్థితి లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విషయంలో కావొచ్చు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కావొచ్చు.. ప్రధాని ఇంతలా స్పందించలేదు.

సోము వీర్రాజుని అయితే, ‘మీరెవరు.? మీ పేరేంటి.?’ అని ప్రధాని ఇటీవల విశాఖ పర్యటనలో మోడీ అడిగారంటూ అప్పట్లో వచ్చిన కథనాలు అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే.