ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న వైఎస్ షర్మిల.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ కానున్నారట. ఈ మేరకు వైఎస్ షర్మిల త్వరలో ఢిల్లీకి వెళ్ళనున్నారని తెలుస్తోంది. ప్రధాని మోడీనే స్వయంగా వైఎస్ షర్మిలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.

అతి కొద్ది రోజుల్లోనే.. అంటే వారం రోజుల లోపే వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళతారట. ప్రధాని నరేంద్ర మోడీ, వైఎస్ షర్మిలకు ఈ రోజు ఫోన్ చేసి, దాదాపు పది నిమిషాలు ఆమెతో మాట్లాడారు. ఇటీవల హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల అరెస్టు తదనంతర పరిణామాల నేపత్యంలో మోడీ, ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, షర్మిల తన వెంట వైఎస్ విజయలక్ష్మిని కూడా ఢిల్లీకి తీసుకెళ్ళనున్నారనీ, మోడీతో భేటీలో ఈ ఇద్దరూ పాల్గొంటారనీ సమీచారం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగనుందనీ, వైఎస్ షర్మిలతో ఫోన్‌లోనే దాదాపు అన్ని విషయాలూ మాట్లాడేసిన మోడీ, ఆ   విషయాలపై పూర్తి సమాచారాన్ని వైఎస్ షర్మిల నుంచి రాబట్టనున్నారని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వైఎస్సార్టీపీ నుంచి మద్దతు తదితర అంశాలపై మోడీ, షర్మిల మధ్య చర్చలు జరగనున్నాయంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా ఏ అడుగు వేసినా, అది అత్యంత వ్యూహాత్మకంగానే వుంటుంది. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఆయన ఏ పనీ చేయరు. అనూహ్యంగా వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయడం పట్ల వైఎస్సార్సీపీ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టీడీపీ అయితే విస్తుపోతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ మిత్రపక్షం జనసేన నిశితంగా పరిశీలిస్తోంది.