వైఎస్ షర్మిల పాదయాత్ర: ఎన్నెన్ని బ్రేకులో.!

ఇంకోసారి.. మళ్ళొకసారి.. మళ్ళీ మళ్ళీ మరోసారి.. ఇలా బ్రేకుల మీద బ్రేకులతో వైఎస్ షర్మిల పాదయాత్ర కొన‘సాగు’తోంది. రాజకీయ పరమైన వివాదాలు, వ్యక్తిగతమైన కారణాలు.. ఇలా కారణాలైవేతైనేం.. వైఎస్ షర్మిల చేపట్టిన ‘సుదీర్ఘ’ పాదయాత్ర.. కొనసాగుతూ.. సాగుతూ.. తూ.. వుంది. పెద్ద ‘బ్రేక్’ తర్వాత వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్ళీ మొదలైంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా వైఎస్ షర్మిల చేపడుతున్న ఈ పాదయాత్ర వల్ల రాజకీయంగా ఆమెకు లాభమెంత.? అంటే, అది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. ఈలోగా వైఎస్ షర్మిల మాత్రం, రాజకీయ ప్రత్యర్థుల్ని తన మాటలతో కడిగి పారేసేందుకు శాయశక్తులా కృషి చేస్తూనే వున్నారు.

తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి షూస్ పంపించారు.. తనతోపాటు పాదయాత్రకు రమ్మని. ఆయనెందుకు వస్తారు.? ఛాన్సే లేదు. అదొక తరహా పబ్లిసిటీ స్టంటు. తెలంగాణలో సమస్యలు లేవా.? అంటే, ఎందుకు లేవు.. చాలానే వున్నాయి. వాటినే వైఎస్ షర్మిల ప్రస్తావిస్తున్నారు తన పాదయాత్రలో.. ఇందులో తప్పేముంది.?

అయితే, వైఎస్ షర్మిల టైమింగ్ పరంగా చాలా చాలా తప్పులు చేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రను కాస్తా, మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్.. అన్నట్లుగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. దానికి తోడు.. పండగొచ్చినా, పబ్బమొచ్చినా.. సెలవులు పెట్టేస్తున్నారు పాదయాత్రకి.. అన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు.

బ్రేకుల్లేని పాదయాత్ర గనుక వైఎస్ షర్మిల చేయగలిగి వుంటే అడ్వాంటేజ్ అయి వుండేది. కానీ, ఈ టైమ్ పాదయాత్రతో ఆమె ఎంత కష్టపడుతున్నా నవ్వులపాలైపోతున్నారు.