వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫక్తు సమైక్యవాది. రాష్ట్రం విడిపోవడానికి ఆయన ససేమిరా వద్దన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఏర్పడిన తెరాసను అడుగడుగునా అణచిపెట్టారు. ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ ను కట్టడి చేశారు. అసలు వైఎస్ బ్రతికి ఉంటే రాష్ట్రం విడిపోయేదే కాదనే వాదన ఉంది. ఈ వాదన ఆంధ్రా ప్రజలకు గొప్పగా అనిపిస్తే తెలంగాణ ప్రజానీకానికి మాత్రం ఆగ్రహం తెప్పిస్తుంది. రాష్ట్రం విడిపోకూడదని బలమైన స్టాండ్ తీసుకున్న వైఎస్ఆర్ పట్ల రెండు ప్రాంతాల ప్రజల్లో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్ పేరు ప్రతిష్టలు ఏపీలో అద్భుత మంత్రంలా పనిచేయవచ్చు కానీ తెలంగాణలో తేలిపోతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకున్నది లేదు.
వైఎస్ఆర్ సమైక్యవాది అని ఇక్కడి జనానికి బాగా తెలుసు. కాబట్టే కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరును స్వేచ్ఛగా వాడుకోలేకపోయింది. ఆయన పేరు చెబితే మంచి నాయకుడని అంటారే కానీ ఓన్ చేసుకోవడానికి ఇష్టపడరు ఇక్కడి ఓటర్లు. అదే కాంగ్రెస్ పాలిట ప్రతికూల అంశమైంది. కానీ వైయస్ షర్మిల మాత్రం తెలంగాణలో పార్టీ పెట్టబోతూ తండ్రి పేరును మంత్రంలా జపిస్తున్నారు. రాజన్న రాజ్యం తీసుకొస్తాను అంటున్నారు. ఆదిలోనే ఈమెకు చెక్ పెట్టాలని తెరాస నేతలు స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చారు. మళ్ళీ ఆంధ్రా వాళ్ళు తెలంగాణ మీద పడ్డారని, అన్న పార్టీలోస్థానం పదవి ఇవ్వకపోతే ఇక్కడొచ్చి పడ్డారని ఎద్దేవా చేస్తున్నారు. కొందరైతే కేవలం తెరాసకు ఉన్న రెడ్డి, క్రిస్టియన్ ఓట్లను చీల్చడానికే బీజేపీ షర్మిలను రంగంలోకి దింపిందని అంటున్నారు.
ఇవన్నీ షర్మిల మీద ఆమె పెట్టబోయే పార్టీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. రేపొకనాడు కేసీఆర్ తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ఆర్ కుమార్తె షర్మిల. ఆమె తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ఓట్లు వేస్తామా. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది పరాయి ప్రాంత నాయకుల, పార్టీల పాలనలో బ్రతకడానికా అంటూ తిరుగులేని బాణాలు సంధిస్తారు. అవి గురి తప్పే ప్రసక్తే ఉండదు. అవే తగిలాక షర్మిల పార్టీ కోలుకునే అవకాశమే ఉండదు. షర్మిల పార్టీ వెనుక కారణాలు ఏవైనా కావొచ్చు కానీ ఉద్యమంతో ఏర్పడిన రాష్ట్రంలో పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించిన తన తండ్రి పేరును వాడుకోవాలని అనుకోవడమే బ్లండర్ మిస్టేక్.