వైఎస్ షర్మిల అరెస్టుపై సజ్జల రామకృష్ణా రెడ్డి చిత్రమైన స్పందన.!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం వైపుగా సొంత కారులో వైఎస్ షర్మిల దూసుకెళుతుండగా, ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నర్సంపేటలో జరిగిన గలాటా, తన పాదయాత్రకు ప్రభుత్వమే ఆటంకాలు కల్పిస్తుండడం.. వెరసి షర్మిల గుస్సా అయ్యారు. నిన్న నర్సంపేటలో జరిగిన దాడుల నేపథ్యంలో ధ్వంసమైన కారులోనే వైఎస్ షర్మిల, ప్రగతి భవన్ వైపు వెళ్ళగా, ఆమెను అరెస్టు చేశారు పోలీసులు.

అరెస్టు అనంతరం షర్మిలను పోలీస్ స్టేషన్‌కి తరలించగా, ఆమెను పరామర్శించేందుకోసం వైఎస్ విజయమ్మ ఇంటి నుంచి బయటకురాగానే ఆమెనూ పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో షర్మిల చేస్తున్న విమర్శలు.. వాటి గురించి తమనేమీ అడగొద్దు’ అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.

అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి, షర్మిల పట్ల తమకు గౌరవం వుంటుందనీ, ఆమె అరెస్టు బాధాకరమనీ సజ్జల చెప్పారు. మామూలుగా అయితే, ప్రభుత్వంలో వున్నవారు షరామామూలుగా చెప్పే మాట ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని. మరి, షర్మిల అరెస్టు విషయంలో సజ్జలకు ఎందుకు బాధ కలిగినట్లు.? వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అరెస్టులు జరుగుతున్నాయి. వాటి పట్ల కించిత్ బాధ కూడా వ్యక్తం చేయలేదు సజ్జల. చేస్తే ఇంకేమన్నా వుందా.? తేడాలొచ్చేస్తాయ్.!