ఫాఫం షర్మిల.! తెలంగాణ రాజకీయాలకు బలైపోయినట్టే.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దని వారించినా వినలేదట వైఎస్ షర్మిల. ఈ విషయాన్ని వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే చెప్పుకొచ్చారు.

జగన్‌ని కాదని తెలంగాణలో షర్మిల, కొత్త రాజకీయ కుంపటి పెట్టారు. తనను కాదని తన చెల్లెలు రాజకీయ ఆలోచనలు చేసినా, ఆమె స్థాపించిన పార్టీకి తెరవెనుకాల వైఎస్ జగన్ సహాయ సహకారాలు అందించారన్న ఆరోపణలు లేకపోలేదు.

సుదీర్ఘ పాదయాత్రని తెలంగాణలో వైఎస్ షర్మిల చేశారు కూడా.! తెలంగాణలో వైఎస్సార్ అభిమానుల్ని కలుపుకుని వైఎస్ షర్మిల ఇంకాస్త జాగ్రత్తగా రాజకీయాలు చేసి వుంటే, వ్యవహారం మరోలా వుండేది.

కొన్నాళ్ళు బీజేపీతో సఖ్యతగా మెలిగి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం ద్వారా వైఎస్ షర్మిల, విశ్వసనీయతను కోల్పోయారు తెలంగాణ సమాజం దృష్టిలో. కాంగ్రెస్‌లో విలీనం దిశగా అడుగులేసి, కాంగ్రెస్ అధిష్టానం పిలుపు కోసం ఎదురుచూసి, నీరసించిపోయారామె రాజకీయంగా.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయ్. ఇప్పుడిక ఏం చేయడానికీ వీల్లేదు. కాంగ్రెస్‌తో సర్దుకుపోయి, ఓ అసెంబ్లీ సీటు అయినా ఆమె తెచ్చుకోగలరో లేదో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అదే వైసీపీ సానుభూతిపరుల కోసమైనా, ఆమె గట్టిగా నిలబడి వుంటే.. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏదో ఒకటి ఆమె పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించేవే. తద్వారా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రెండో మూడో సీట్లు తెలంగాణలో వచ్చి వుండేవి.

అన్న వైఎస్ జగన్ మాటని పెడచెవిన పెట్టిన వైఎస్ షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో సాధించిందేంటి.? బిగ్ లూజర్‌గా మిగిలిపోవడం తప్ప.!