తమిళ సై వెటకారం మామూలుగా లేదుగా!

గతకొన్ని రోజులుగా తెలంగాణలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ గా నడుస్తున్న యవ్వారం సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన ఈ గ్యాప్ పై తాజాగా మరోసారి గవర్నర్ తనదైన వెటకారం డైలాగులేశారు. తాను తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్‌ సిటిజన్‌ అనే విషయం కేసీఆర్ మరిచిపోయారని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో తమిళసై కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలే చేశారు.

అవును… గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. కేసీఆర్ ని ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన గవర్నర్‌… పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ.. ఈ రాష్ట్ర చీఫ్‌ ని మాత్రం కలవలేం” అని అన్నారు. భారీ సెక్రటేరియట్‌ ప్రారంభిస్తే ఫస్ట్‌ సిటిజన్‌ అయిన తననే ఆహ్వానించలేదని డైరెక్టుగా డైలాగులేసేశారు.

ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన తమిళ సై… ప్రగతి భవన్‌ – రాజ్‌ భవన్‌ దూరంగా ఉంటున్నాయని.. వివిధ దేశాలు ఒక్కచోటికి రాగలవు కానీ.. రాజ్‌ భవన్‌ – ప్రగతిభవన్‌ మాత్రం క్లోజ్‌ గా రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ తనవిషయంలో ప్రొటోకాల్ పాటించలేదని తప్పుబట్టిన గవర్నర్… తాను తెలంగాణకు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని స్పష్టం చేశారు.

కాగా… 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ప్రారంభించిన వేడుకకి కూడా గవర్నర్ ను రాష్ట్రప్రభుత్వం ఆహ్వానించని సంగతి తెలిసిందే! ఇలా వరుసపెట్టి తనను అవమానిస్తున్నారన్నట్లుగా తమిళసై ఇలా కీలక వ్యాఖ్యలు చేశారు! మరి ఈ గ్యాప్ ఇంకెంత దూరం వెళ్తుందనేది వేచి చూడాలి!