ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలనాల మోత మోగుతున్నది. టిఆర్ఎస్ లో భారీ కుదుపు ఖాయంగా కనబడుతున్నది. కేసిఆర్ మేనల్లుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు రాజకీయ వైరాగ్యం ప్రకటించి 24 గంటలు గడవకముందే హరీష్ రావుపై బిజెపి నేత మరో పెద్ద బాంబు వేశారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రాజకీయాలకు నుంచి వైదొలగాలిగితే బాగుంటుంది అని హరీష్ రావు ఇబ్రహింపూర్ లో సంచలన ప్రకటనలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి రాష్ట్ర నేత (మాజీ టిఆర్ఎస్ కీలక నేత) రఘునందన్ రావు హరీష్ రాజకీయ భవిష్యత్తు గురించి సంచలన ప్రకటనలు గుప్పించారు. మెదక్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోసానికి, నయవంచనకు కేసిఆర్ పెట్టింది పేరు అని మండిపడ్డారు. అసెంబ్లీ రద్దు వేళ కేసిఆర్ 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించినా.. మళ్లీ ఆ లిస్టులో కొందరి పేర్లు ఎగిరిపోతాయని జోస్యం చెప్పారు.
ఆ ఎగిరిపోయే జాబితాలో తొలి పేరు హరీష్ రావుదే అని బిజెపి పార్టీకి సమాచారం ఉందని రఘునందన్ వివరించారు. హరీష్ రావుకు టికెట్ లేదని ఇప్పటికే కేసిఆర్ చెప్పేశాడని అన్నారు. హరీష్ టికెట్ ఎగరగొట్టి సిద్ధిపేటలో కేసిఆర్ పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు బిజెపికి సమాచారం అందిందన్నారు. అందుకోసమే ఇబ్రహింపూర్ లో హరీష్ రావు రాజకీయ వైరాగ్యంతో మాట్లాడినట్లు చెప్పారు.
105 జాబితాలో తొలి వికెట్ హరీష్ రావుదైతే తర్వాత మరింత మందికి సీట్లు దక్కవు అన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు ఏం చేయబోతున్నారో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు. రాజకీయ వైరాగ్యంతో రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? లేక జాతీయ పార్టీ అయినే బిజెపిలో చేరతాడా హరీష్ తేల్చుకోవాలని సలహా ఇచ్చాడు. కేసిఆర్ టికెట్ నిరాకరించినా ఇంకా టిఆర్ఎస్ లో కొనసాగుతాడో హరీష్ నిర్ణయించుకోవాలన్నారు.
సిద్ధిపేట జిల్లాలో సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ స్థానాల్లో ఇదివరకే ప్రకటించిన అభ్యర్థులను మార్చబోతున్నట్లు తమకు సమాచారం ఉంది. ఆ మూడు స్థానాల్లో మార్చి సిద్ధిపేటలో కేసిఆరే పోటీ చేయబోతున్నారు. సిద్ధిపేట ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా కేసిఆర్ ఎంతగా వంచనకు మారుపేరుగా నిలిచారో తెలుసుకోవాలి. అల్లుడు హరీష్ రావుకు పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు అర్థమవుతున్నది.
కారుకు ఉన్న నాలుగు టైర్లలో ఒక టైర్ పంచర్ అయిందని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. అందుకోసమే స్టెపినీగా సంతోష్ రావును కేసిఆర్ రాజ్యసభకు తెచ్చుకున్నాడని తెలిపారు. దశాబ్దాలుగా కేసిఆర్ ఎంతో మంది నాయకులను బలి తీసుకున్నట్లే ఇప్పుడు అల్లుడు హరీష్ రావు ను సైతం బలి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. కొడుకు కేటిఆర్ ను ముఖ్యమంత్రి ని చేయడం కోసమే అల్లుడు హరీష్ ను బలి ఇస్తున్నాడని ఆరోపించారు.
తక్షణమే హరీష్ రావు ఆలోచించుకుని అవమానించి బలి తీసుకోవాలనుకుంటున్న టిఆర్ఎస్ లోనే ఉంటాడో జాతీయ పార్టీ అయిన బిజెపిలోకి వస్తారో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు రఘునందన్.
బిజెపి రఘునందన్ రావు మాట్లాడిన సంలచన విషయాలు కింద వీడియోలో ఉన్నాయి చూడండి.