తెలంగాణ రాజకీయాలపై వైఎస్సార్సీపీ ఓవరాక్షన్ ఎందుకు.?

మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలు, తెలంగాణ రాజకీయాలపై సోషల్ మీడియాలోనో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందరో తమకు తోచిన రీతిలో వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. సెటైర్లు కూడా వేసేస్తున్నారు.! అసలు తెలంగాణ రాజకీయాలతో వైసీపీ నాయకులకు ఏం పని.?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై బీఆర్ఎస్ అధినేత కేసీయార్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు తదితరులూ ఆంధ్రప్రదేశ్ మీద సెటైర్లేయడం చూశాం. తెలంగాణలో మానుకోట ఘటన అందరికీ గుర్తుండే వుంటుంది.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాళ్ళు రువ్విన ఘటన అది. ఆ ఘటనకు కారణం ఇప్పటి బీఆర్ఎస్.!

చిత్రంగా, భారత్ రాష్ట్ర సమితికి వైసీపీ సహాయ సహకారాలు అందించింది తెరవెనకాల. వైసీపీ మద్దతుదారులంతా తెలంగాణలో గులాబీ పార్టీకే ఓట్లేశారు. ఇది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడంలో మాత్రం వైసీపీ కీలక భూమిక పోషించిందనుకోండి.. అది వేరే సంగతి.

ఆ లెక్కన, వైసీపీ క్యాడర్ కూడా తెలంగాణలో జెండా కూలీలుగా మారిపోక తప్పలేదు.! ఇప్పుడేమో, భట్టి విక్రమార్కని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా చూస్తున్నారు వైసీపీ మద్దతుదారులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అదే కోణంలో చూస్తున్నారు వాళ్ళంతా. ఇంకోపక్క, కామారెడ్డిలో కేసీయార్, రేవంత్ రెడ్డిలను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఒకప్పుడు వైసీపీ నేత కావడంతో, ఆయన్ని కూడా తమ వాడేనని అంటున్నారు వైసీపీ మద్దతుదారులైన నెటిజనం.

ఇవన్నీ నాణేనికి ఓ వైపు. ఇంకో వైపు టీడీపీని, జనసేననీ ట్రోల్ చేస్తోంది వైసీపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి వైసీపీ, సోషల్ మీడియా వేదికగా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్రోల్ చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

ఈ చర్య వల్ల వైసీపీకి, ఆంధ్రప్రదేశ్‌లో ఒరిగేదేమీ వుండదు సరికదా, వైసీపీకి ఏపీలో రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ.