రాజకీయం అంటే ఏదో వ్యక్తిగత వ్యవహారం కాదు. ప్రజాక్షేత్రంలో నిలబడి, ప్రజల కోసం చేసే పని. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నేతలకు ప్రజలే సాక్షులు, ప్రజకే న్యాయనిర్ణేతలు. ఏదైనా ప్రజల ద్వారానే తేలాలి. తేడాలు వస్తే ప్రజల ముందే నిరూపించుకోవాలి. ఇక్కడంతా ప్రజాస్వామ్యమే తప్ప దైవస్వామ్యాన్ని చోటు లేదు. అసలు ప్రజాస్వామ్యంలో దేవుడికి పనేం ఉంటుంది. దేవుడు దేవుడే, రాజకీయం రాజకీయమే. రెంటినీ కలపడం తప్పు. కానీ ఈ తప్పును మన నేతలు యథేచ్ఛగా చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు దేవుళ్ళ పేర్లను, దేవాలయాలను మహా గొప్పగా వాడేస్తున్నారు. తమ నిజాయితీని నిరూపించుకోవడానికి దేవుళ్ళనే సాక్ష్యులుగా, జడ్జీలుగా నిర్ణయించేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వేదికగా నడిపిన హైడ్రామా అంతా ఇంతా కాదు. హైదరాబాద్ వరద సహాయాన్ని నిలిచిపోయేలా చేసింది బీజేపీయేనని కేసీఆర్ అంటే కాదు నిలిపివేసింది కేసీఆరేనని బండి సంజయ్ అన్నారు. ఇలా వాదనలు జరుగుతుండగానే బండి అమ్మవారి ఆలయంలో ప్రతిజ్ఞ పర్వానికి తెరతీశారు. గుడికి వెళ్లి ప్రమాణం చేసి తాను తప్పుచేయలేదని అంటూ కేసీఆర్ కూడ వచ్చి ప్రమాణం చేయాలని డిమాన్డ్ చేశారు. ఆ ఎపిసోడ్ బాగా పనిచేసింది. ఇక ఈ దేవుళ్ళ ముందు ప్రమాణాల పర్వం ఏపీలో కూడ జోరుగానే సాగుతోంది. అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య వార్ మొదలైంది.
నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని ఇరువురు వాదించుకుని చివరకు బిక్కవోలు వినాయక గుడిలో ప్రమాణాలకు దిగారు. ఇద్దరు నేతలు ఒకేసారి గుడిలోకి వెళ్లి వినాయకుడిని కంగారుపెట్టేశారు. ఎవరికివారు అవినీతికి పాల్పపడలేదని ఒట్లు పెట్టేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మరి ఒట్లు వేసిన ఎవరూ అవినీతికి పాల్పడకపోతే అక్కడ అవినీతి ఎవరు చేసినట్టో ప్రమాణాలకు జడ్జీగా ఉన్న గణనాథుడే తేల్చాలేమో. ఈ డ్రామా ముగిసిన వెంటనే విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి గొడవ మొదలైంది. విజయసాయి వెలగపూడిని భూకబ్జాదారు అంటూ విమర్శించడంతో వెలగపూడి ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడిలో ప్రమాణం చేసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. కానీ వీరి వ్యవహారం గుడి వరకు వెళ్ళలేదు. దీంతో సాయిబాబా సేఫ్ అయ్యారనుకోండి.
కానీ ప్రజాక్షేత్రంలో పారదర్శకత పాటించి ప్రజల ముందు స్వచ్ఛంగా కనబడాల్సిన నాయకులు ఇలా పరస్పర అవినీతి ఆరోపణలతో దేవుళ్ళ మీద ప్రమాణాలు అంటూ మాట్లాడటం ఈమేరకు విజ్ఞత అనిపంచుకుంటుందో వారే ఆలోచించుకోవాలి. అయినా ఓట్లు వేసింది గెలిపించింది ప్రజలు అయినప్పుడు మధ్యలో దేవుళ్లను బలవంతాన తీసుకొచ్చి భక్తుల భావోద్వేగాలతో ఆదుకోవడం సబబే కాదు.