తెలంగాణ మీద పవన్ కు అంత కన్ ఫ్యూజన్ ఎందుకొచ్చింది?

Pawan Kalyan

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకూడదని జనసేనాని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో కూడా అభ్యర్థులను బరిలోకి దించుతానని ఆయన చాలాసార్లు ప్రకటించారు. దీనితో చాలా మంది తాము పోటీ చేయవచ్చని  డబ్బు దస్కం రెడీ చేసుకున్నారు. పవన్ నియమించిన పొలిటికల్ ఆపైర్స్ కమిటీ సమావేశమయిన అభ్యర్థులనుంచి దరఖాస్తు అహ్వానిస్తుందని ఆశపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్  వచ్చే లోపు ఈ ప్రాసెస్ పూర్తవుతుందని భావించారు.  అయితే, పార్టీలో  తెలంగాణ ఎన్నికల కు సంబంధించి ఎలాంటి అలికిడి లేదు. తెలంగాణ వ్యవహారాలు చూసుకునే నాధుడే లేడు. ఎన్నికల కమిటీ యే లేదు.

దీనికి కారణం, తెలంగాణలో పోటీ చేయరాదని పవన్ కల్యాణ్ భావించడమేనని విశ్వసనీయంగా తెలిసింది.

రాష్ట్ర విభజన  ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నపుడు  జనసేన పార్టీ పుట్టింది. రెండు రాష్ట్రాలకు రెండు రకాల సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం జనసేన  కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ చెబుతూ వచ్చారు. అయితే, ఆయన చూపెపుడూ ఆంధ్ర మీదే ఉండింది. దానికి కారణం అపుడు టిఆర్ ఎస్ నాయకులు ఆయన్ని ఆంధ్రోడిగా ముద్రవేసి, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటేసహించం అని ప్రకటించడమే.  2014 లో ఆయన టిడిపి, బిజెపి ల తరఫున  ప్రచారం చేశారు. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. దీనికి సరైన కారణం ఇంతవరకుచెప్పనే లేదు.అపుడు పోటీ చేసి ఉంటే పొత్తులో భాగంగా ఆయన కొన్ని సీట్లు గెల్చుకునే ఉండేవారే.

ఈ మధ్యలో ఆయన తెలంగాణ మీదకు దృష్టి మళ్లించారు.   ఒక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని విపరీంతా ప్రశంసిస్తూ వస్తున్నారు. టిఆర్ ఎస్ నేతలు కూడా ఆయన మిత్రులయ్యారు. సమావేశాలయ్యాయి. లంచ్ లు వగైరా పూర్తయ్యాయి. కెటిఆర్ కాటమరాయుడు చిత్రం చూశారు. ట్వీట్ చేశారు.

 

మరొక వైపు తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రటించారు. నిజానికి, ఆయన కెసిఆర్ ప్రభుత్వాన్ని కొనియాడటం, కెటీ ఆర్ తో సఖ్యంగా ఉండటం, ముఖ్యమంత్రి కెసియార్ ను కలుసుకోవడంతో తెలంగాణలో జనసేన ఒక పార్టీ గా పెరగడం కష్టమని చాలా మంది భావించారు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని అంతగా పొగిడేటపుడు  మరొక పార్టీ అవసరమేముంటుంది?

ఇలాంటపుడే   తెలంగాణలో ఆయన తీర్ణయాత్ర జరిపారు.కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అది తన  రాజ‌కీయ యాత్ర అని చెప్పారు. తర్వాత ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. తనకోసం వచ్చిన యూత్ ను చూసి ఆవేశపడిపోయి తెలంగాణలో సైతం జనసేన  పోటీ చేస్తుందని వారికి ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణలో పార్టీని బ‌ల‌ప‌ర‌చండని రెండు మూడు సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే, ఇవేవీ సీరియస్ సమావేశాలు కాదని, కేవలం తన కోసం వచ్చిన యూత్ ని ఉత్సహపరిచి ఈల వేసేందుకు, కేకేసేందుకు, చప్పట్లు కోట్టేందుకు చేసిన ప్రకటనలేనని ఇపుడు అంతా అనుకుంటున్నారు.  

అందుకే,  తెలంగాణ అసెంబ్లీ రద్దు వంటి కీలకమయిన రాజకీయ నిర్ణయం తీసుకున్నా ఆయన ఉలక లేదు, పలకలేదు. దీని మీద జనసేన వైఖరేమిటో ఆయనెపుడూ చెప్పలేదు. అన్ని రాజకీయ పార్టీలు  ఎన్నికల కోసం కత్తులు కటార్లు నూరకుంటుంటే జనసేనాని తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. తెలంగాణలో ముందస్తు కాకుండా ఉంటే ఏదో ఒక కూటమిటో చేరిపోయి  ఎన్నికల్లో పోటీ చేసి ఉండేవాడని, అయితే, ముందస్తు రావడంతో ఆయన ప్లాన్లు తారుమారయ్యాయని చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటిచేస్తారో లేదో  ఒక మాట చెబితే తమ దారి తాము చూసుకుంటామని చాలా మంది జనసేన టికెట్ కోసం రెడీ అయిన వాళ్లు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.  ఎన్నికల్లో  జనసేన పోటీ చేస్తే తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశపడ్డ వారు వాళ్లంతా. ఎన్నికల  క మిషన్ తెలంగాణ ఎన్నికల  షెడ్యూల్‌ ప్రకటించిన రోజు, విజయవాడ పార్టీ కార్యాల‌యానికి వారంతా చేరుకున్నారు.

అపుడు పవన్  తూర్పుగోదావ‌రి జిల్లా నేత‌ల మీటింగ్‌లో ఉన్నారు.  తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చెయ్యాలని తెలంగాణ నుంచి అదే పనిగా విజయవాడ వెళ్లిన కొంతమంది అభిమానులు ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. ప‌వ‌నన్నయ్య త‌న నిర్ణయాన్ని ప్రక‌టించాల‌ని డిమాండ్ చేశారు. జనసేన ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే తామూ పోటీ చేసేందుకు సర్వం సిద్ధంచేసుకున్నామని లేని ప‌క్షంలో, త‌మ దారి తాము చూసుకుంటామ‌ని కూడా చెప్పారు.

పవన్ కల్యాణ్ నుంచి స్పందనే లేదు. అయితే, తెలంగాణలో పోటీ చేయరాదని, పోటీ చేసేందుకు పార్టీ దగ్గిర ప్రస్తుతానికి శక్తి సామర్థ్యాలు లేవని చెబుతూ అక్కడ పోటీ చేసేది లేదని  పవన్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రటించేందుకు జంకుతున్నారు.

 కారణం ఏమిటి?

తెలంగాణ ఎన్నిలకు పవన్ జనసేన దూరంగా ఉండేందుకు పలుకారణాలను పరిశీలకులు చెబుతున్నారు. అవి:

తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేసి తెరాస ప్రభుత్వాన్ని విమర్శించి సంబంధాలు చెడగొట్టుకోవడం పవన్ కు ఇష్టం లేదు.

తెలంగాణాలో పార్టీ నిర్మాణం చేపట్టలేదు. ఇలాంటపుడు పోటీ చేసి ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపలేక, డిపాజిట్లు పోతే, మొదటికే మోసం వస్తుంది. దాని ప్రభావం అంధ్రా ఎన్నికల మీద పడుతుంది. తనని తెలంగాణలో ఆంధ్రోడిగా నే చూస్తున్నారు. అందువల్ల గిట్టని వాళ్లు జనసేనకు ఆంధ్రా పార్టీ అని ముద్ర వేసే ప్రమాదం ఉంది.

2019లో ఆంధ్రా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపించాక తెలంగాణలో ప్రవేశిస్తే గౌరవంగా ఉంటుంది. ఇప్పటికి ఆంధ్ర ఎన్నికలే ముఖ్యం.

తెలంగాణలో పోటీ చేస్తే ఆంధ్రా మీద  ఫోకస్ తగ్గిపోతుంది. 

ఈ ఎన్నికల్లో తాను తీవ్రంగా వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తున్నందున జనసేన కార్యకర్తలు అభిమానులు టిడిపి కి వ్యతిరేకంగా నిశబ్దంగా పని చేయాలి.

ఆంధ్రోడిగా  తెలంగాణ లో ఓటడగటం కష్టమనే గిలి పవన్ ను పీడిస్తున్నది

టిఆర్ ఎస్ ను విమర్శించకుండా ఓటడగటం కష్టం. విమర్శించి  ప్రచారం చేయడం ఇంకా కష్టం.

ఈ  విషయాల మీద ఇప్పటికే తెలంగాణలో ఉన్న జనసైనికులకు సంకేతాలు వెళ్లాయని తెలిసింది. అయితే, దసరా అనంతరం ఆయన తెలంగాణ నేతలతో  ఒక సమావేశం ఏర్పాటు చేసి,  చర్చించి తెలంగాణ  ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడంలేదో వివరించి, ఆమోదం తీసుకుని అధికారికంగా తెలంగాణ ఎన్నికలను మర్చిపోండని ప్రకటిస్తారని తెలిసింది.