(వి. శంకరయ్య)
తెలంగాణ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులలో65 శాతం మంది పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వుందని ఫలితంగా టిఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదని లగడపాటి రాజగోపాల్ చిలక జోస్యం చెప్పారు. ఒక వేళ ఇదే నిజమైతే ఎపిలో రానున్న ఎన్నికల్లో టిడిపి ఓటమి తథ్యమని లగడపాటి పరోక్షంగా చెప్పకనే చెప్పారని భావించాలి. తెలంగాణలో టిఆర్ఎస్ MLA లలో అవినీతి లేదని కాదుగాని ఎపిలో టిడిపి MLA లతో పోల్చితే ఎవరి కైనా దిమ్మదిరుగుతుంది. ఎపిలో టిడిపి MLA లు అవినీతి కూపంలో మునగానాం తేలానాం గా వున్నారు. కెసిఆర్ ఎన్ని తప్పులు చేసినా మంత్రులను MLA లను చాల వరకు అదుపులో పెట్టుకున్నారు. ఎపిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
2014 లో అధికారంలోని కొచ్చిన తొలి రోజుల్లోనే మంత్రుల MLA లఅవినీతి పురాణాలు ఈ రోజు టిడిపిని కంటికి రెప్పలా కాపాడే మీడియానే వింత వింత కథనాలతో వండి వార్చింది. కారణాలు ఏవైనా సరే ముఖ్యమంత్రి కూడా రాజకీయ అవినీతికి తలుపులు బార్లాతీశారు. మన వారే కదా- ఇప్పుడు సంపాదించుకోక పోతే ఏలా అనే ధోరణి వెర్రి తలలు వేసింది.
తదనంతరం కూడా ప్రభుత్వ పథకాల అమలు నిధులు స్వాహాపై ప్రతి పక్ష మీడియానే కాకుండా టిడిపి కొమ్ము కాచే మీడియా కూడా పలు సందర్భాల్లో బహిర్గతం చేయడం అందరికీ తెలుసు. ఇసుకాసురుల దోపిడీ కథనాలు నీరు చెట్టు కింద కుంటలు తవ్వకం చెక్ డ్యాం ల నిర్మాణంలో కోట్లు కొట్టుకు పోయాయని టిడిపి అనుకూల మీడియానే బహిర్గతం చేసింది. అంతే కాదు. ఈ రోజు ఏమైనా చెప్ప వచ్చు గాని కెసిఆర్ లాగా పార్టీ పై ప్రభుత్వంపై చంద్రబాబు కు పట్టు లేదని ఈ పాపులర్ మీడియా ఎన్నో కథనాలు ప్రచురించడం వాస్తవం కాదా?
అంతెందుకు? ప్రస్తుతం ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సందర్భంగా ప్రతి జిల్లాలో ఎక్కువ మంది MLA లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. పైగా సమయం సందర్భం లేకుండా యంపి దివాకరరెడ్డి 40 మందిని మార్చక పోతే ఓడి పోవడం తథ్యమని ముఖ్యమంత్రి చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. దివాకరరెడ్డి ఉద్దేశం ఏమైనా కావచ్చు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అంత కన్నా ఎక్కువగానే అవినీతి విహారం చేస్తోంది. ఏ నియోజకవర్గంలో గానీ అధికార పార్టీ MLA కు తెలియకుండా కింద స్థాయి నేతలు అవినీతికి పాల్పడలేరు.
అంతకన్నా మరొక అంశముంది. . పార్టీ నేతలతో నింపి బడిన జన్మ భూమి కమిటీలు సరిగా పనిచేయలేదని స్వలాభంతో కొత్త సెక్షన్ ను పార్టీకి దగ్గరకు తీసుకు రాక పోగా పార్టీకి అపకారం జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన సందర్భంకూడా వుంది. దీనికి తోడు ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా మీ పనితీరు తో ఫలితాలు రావడం లేదని పలుమార్లు MLA లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వాపోయిన సందర్భాలు లేకపోలేదు.
అయితే ఏమాట కామాట చెప్పుకోవాలి. కెసిఆర్ కు MLAలపై వుండిన పట్టు ఎపిలో చంద్రబాబు కు లేదు. ఎందుకు కంటే దెందులూరు ఎమ్మెల్యే పై ఎన్నో ఆరోపణలు వచ్చినా చంద్రబాబు అదుపు చేయలేక పోతున్నారు. అవి నీతి అంశంలో ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఇతనినే కాదు. ఎవరిన్ని పార్టీ నుండి పంపడం అటుంచి గట్టిగా మందలించ లేకున్నారు.
పైగా మున్ముందు చంద్రబాబుకు తల నొప్పులు తప్పవు. తెలంగాణలో కెసిఆర్ కు తొలి రోజుల్లో తల పోటు ఎదురు కాలేదు గాని ఎన్నికల వాతావరణం వచ్చే సరికి అసలు సినిమా చూచారు. కాని చంద్రబాబు కు ఇప్పటినుండే ఇబ్బందులు తప్పవు.
ఈ పాటికే టిడిపి పుష్పక విమానంలావుంది. కొంతమంది జారుకుంటునారు. పాత కాపులకు ఫిరాయించిన వారికి టిక్కెట్లు ఇవ్వడం కత్తి మీద సామే. పైగా లగడపాటి రాజగోపాల్ చిలక జోస్యం తెలంగాణలో నిజమైతే వీరందరిలో ఏరివేత మొదలెట్టాలి. లేకుంటే బోటు బోల్తా కొట్టడం ఖాయం. .
నిజంగానే ముఖ్యమంత్రి ఏరివేత మొదలెట్టితే మరోవైపు టిడిపి పెద్ద కుదుపుకు లోనౌతుంది. రేపు ఎపిలో బిజెపి కాంగ్రెస్ జనసేన వైసిపి తో పాటు మాయావతి పార్టీ అఖిలేశ్ పార్టీ ఇలా పలు పార్టీలు ఎవరికి వారు పోటీ చేసే అవకాశముంది. టిడిపి లో టికెట్ దొరకని వారు ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయం. ఎవరైనా తమ రాజకీయ ఉనికి చంద్రబాబు కోసం త్యాగం చేయరు కదా? ఇంత వరకు నేతలను చంద్రబాబు జారి పోకుండా కాపాడు కొచ్చారు. గాని ఎన్నికల సమయంలో అసాధ్యం. ఎవరు ఎన్ని తప్పుడు ఆటలు ఆడినా మందలించ కుండా వున్నందున ఇప్పటి వరకు కాపాడు కొచ్చారు. . అయితే ఇన్నాళ్లు వీరు చేసిన గలీజు తుదకు ముఖ్యమంత్రి భరించక తప్పదు.
ఒక విధంగా ముఖ్యమంత్రి కి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా వుంది. కెసిఆర్ లాగా టోటల్ గాఎక్కువ మందికి టికెట్ లు ఇస్తే ప్రజా వ్యతిరేకత ఉప్పెనలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. లేదా అభ్యర్థులను మార్చితే రెబల్స్ బెడద పెనుభూతంలాగా వుండ బోతోంది. మొత్తం మీద లగడపాటి చిలక జోస్యం ఇప్పటి నుండే ముఖ్యమంత్రి కి నిద్ర లేని రాత్రులను తెచ్చి పెట్టింది.
(వి. శంకరయ్య, రాజకీయ వ్యాఖ్యాత ఫోన్ నెం. 9848394013)