తెలంగాణలో ప్రతి పార్టీకో లెక్కుంది…ఇదీ ఆ చిక్కు లెక్క

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కు తుక్కగా జరిగిన పోలింగ్, ఆపైన పిచ్చిపిచ్చిగా బజారు కెక్కిన సర్వేలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చిత్రమయిన పరిస్థితిని సృష్టించాయి.

పార్టీలన్నింటిలో పైకి సంతోషం, లోన భయం. ఎగిట్ పోల్స్ ను నమ్మాల వద్దా అనే సంశయం. నేషనల్ సర్వేలని నమ్మితే, అవి ఫెయిల్ కావన్న గ్యారంటీ లేదు. లోకల్ సర్వే లగడపాటి దే నిజం కావచ్చు అని టిఆర్ ఎస్ నేతల్లో అనుమానం. అన్ని సర్వేలొకటి, లగడపాటి చెప్పిందొకటి. లగడపాటి చెప్పింది వినసొంపుగా ఉంది, మరి అది ఫెయిలవదన్న గ్యారంటీ ఏమిటి, కాంగ్రెస్ భయం ఇది. దీనితో చిన్న పార్టీల జెండా లెగరేస్తున్నాయ్. అన్ని పార్టీల ముందున్న సమస్య ఒక్కటే… ఈ జనం వొళ్లు మండి ఇంత భారీగా వేటేశారా, వొళ్ల తెలియని ఆనందంతో గుద్దేశారా? పార్టీలు అంచనావేసుకోలేక పోతున్నాయి.

చిన్న పెద్ద పార్టీలన్నీవచ్చే ప్రభుత్వం తమదే అంటున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడా ఎదురయి ఉండదేమో. పెద్ద పార్టీలయిన తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజా కూటమి ప్రభుత్వం మాదే అంటే అర్థముంది. మూడు నాలుగు లేదా ఏడెనిమిది సీట్లు గెల్చుకునే పార్టీలు కూడా వచ్చే తెలంగాణ ప్రభుత్వం తమదే అంటున్నాయి. మరొక ఇరవై నాలుగ్గంటల లోపు ఓట్ల కౌంటింగ్ ఉన్నపుడు ఈ పార్టీలు తమ పార్టీలదే ప్రధాన పాత్ర ఉంటుందని  తమ పార్టీల రోల్ లేకుండా ఎవరూ  ప్రభుత్వం ఏర్పాటు చేయాలేరని ధీమా గా తిక్క తిక్క లెక్కలు చెబుతున్నాయి.

కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలవుతున్నది. 9 నెలల ముందుగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని ఈ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలు రెండు ప్రధాన పక్షాలకు మెజారిటీ ఇవ్వడంతో టిఆర్ ఎ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నామని, ముహూర్తాలు నిర్ణయించడమే తరువాయి అంటున్నాయి. 100 సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు నుంచి మంత్రలు దాదా ఢంకా భజాయిస్తున్నారు. జాతీయ సర్వేలన్నీ టిఆర్ ఎస్ కే మెజారిటీ ఇవ్వడంతో ఈ పార్టీ ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నంత సందడి ఈ పార్టీ లో కనిపిస్తుంది. కెసియార్, కెటియార్,కవిత, హరీష్ రావుల ప్రకటనల్లో ఇది కనిపిస్తుంది. పోలింగ్ భారీగా జరగడాన్ని కూడా టిఆర్ ఎస్ తనకు అనుకూలంగా అన్వయించుకుంది. ప్రజలు మళ్లీ కెసియారే సిఎం అంటూ పోలింగ్ కేంద్రాల వైపు పరుగులు తీశారనేది టిఆర్ ఎస్ ఇంటర్ ప్రెటేషన్.

అయితే, పక్కాలోకల్, లోకల్ నాడి తెలిసిన లగడపాటి సర్వే కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఎనుగుల బలాన్నిచ్చింది. జాతీయ సర్వేలు ఈ మధ్య ఫెయిలవుతున్నాయి, ఉత్తరాదికి చెందిన ఈ సంస్థలు దక్షిణాది ప్రజలు నాడిపట్టలేకపోతున్నాయని, అని లగడ పాటి తన సర్వే ప్రత్యేకత గురించి చెప్పడంతో కాంగ్రెస్, టిడిపిలో విజయోత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. లగడపాటి రాజగోపాల్ సర్వే నిజమవుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. 68 శాతం పోలింగ్ మించితే కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని లగడపాటి చెప్పడంతో కాంగ్రెస్ లొ పండగవాతావారణం సృష్టించింది. ఎందుకంటే, పోలింగ్ 73 శాతం దాటింది. తమ కూటమికి 65 నుంచి 70 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అరాకొర కొరత వస్తే, కాంగ్రెస్ రెబెల్స్ గా నిలబడి గెలవబోతున్న ఇండిపెండెంట్లు మద్దతునిస్తారని కాంగ్రెస్ భావిస్తున్నది.

పెద్ద పార్టీలు  పైకి భీకరంగా ఆత్మవిశ్వాసం చూపిస్తున్నా, లోన భయం వెంటాడుతూనే ఉంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మాదే నని తెగు ప్రచారం చేస్తున్నారు.

ఆరేడు సీట్లు మించి గెల్చుకునే సత్తాలేని ఎంఐఎం పార్టీ వచ్చే ప్రభుత్వం తమదే అంటున్నది. ఈ పార్టీ రెండు రకాలుగా వచ్చే ప్రభుత్వం తమదే అంటున్నది. ఒకటి , తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎం అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతాడని మజ్లీస్ పార్టీ నేత అక్బరుద్దీన్ కర్నాటక ఎన్నికలయిపోయినప్పటి నుంచి చెబుతున్నారు. కర్ణాటకలో హంగ్ వచ్చినపుడు తక్కువ సీట్లు గెల్చుకు న్న కుమారస్వామి తమకు ఆదర్శమని చెబుతున్నారు. ఇక రెండు, తెలంగాణలో ఎవరు ముఖ్యమంంత్రి కావాలన్నా తామే కీలకమని అక్బరుద్దీన్ చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీకి ఏ సర్వే కూడా అయిదారు స్థానాలు మించి ఇవ్వలేదు. అయినా సరే, అధికారం రేసులో తాము కూడా ఉంటామని అంటున్నారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్న బీజేపీ సహకారం అవసరమవుతుందని, అపుడు తాము అనుకున్న పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే, టిఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బిజెపి మద్దతిస్తుందని చెబుతూ ఒక షరతు విధించారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ . టిఆర్ ఎస్ కు ఎంఐఎం తో సంబంధం ఉండరాదన్నది షరతు.
అధికారికంగా టిఆర్ ఎస్ ఎంఐఎం మధ్య పొత్తు లేదు. టిఆర్ ఎస్ ఆ విషయం ప్రకటించి బిజెపి చేయిందుకోవచ్చు. బిజెపి కూడా సంతృప్తి వ్యక్తం చేయవచ్చు.

ఇక ఇండిపెండెంట్ల వ్యవహారానికి వస్తే, లగడపాటి ఇప్పటికే వారికి పెద్ద పీట వేశారు. ఈసారి భారీగానే ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలున్నట్టు జాతీయ సర్వేలు కూడా చెప్పాయి. దీనితో ఇండిపెండెంట్ల పంట పండినట్లే. ఈ ఎన్నికల్లో 8 నుంచి 12 మందిదాకా ఇండిపెండెంట్లు గెలుస్తారని జాతీయ సర్వేలు చెప్పాయి. అంతకు ముందే లగడ పాటి ఈ విషయం చెప్పారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని ఆ పార్టీ నమ్ముతోంది. అంతేకాదు సొంతంగా తమకు 45 సీట్లు, మిత్ర పక్షం టీడీపీకి 5 నుంచి 9 సీట్లు వస్తాయని అలాగే టిజెఎస్ కు 2 నుంచి 3 , సిపిఐకి 1 స్థానం దక్కినా మొత్తం అటు ఇటుగా కూటమికి 55 వరకు వస్తాయని కాంగ్రెస్ లెక్కలు కడుతూ ఉంది. అప్పటికీ కొరత వస్తే సీట్లు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తారని, ఎటూ చూసిన అధికారం మనదేనని కాంగ్రెస్ నమ్మకం. అందుకే ఇండిపెండెంట్లతో ఆ పార్టీ అపుడే బేరసారాలు మొదలుపెట్టిందని మీడియా కథనాలు.