కోదండరాం పోటీ జనగామ నా? ఉప్పల్ లోనా?

తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీగా ప్రకటించిన తర్వాత అనేక కొత్త చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ జెఎసిగా పనిచేసిన సమూహమంతా రాజకీయ పార్టీగా అవతరించింది కాబట్టి జన సమితి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందని కోదండరాం ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు లేవు.. గిత్తులు లేవని ఆయన పైకి స్పష్టం చేసినా.. బయట మాత్రం వేరే టాక్ నడుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, జన సమితి, టిడిపి, సిపిఐ, న్యూడెమోక్రసి పార్టీలు మహా కూటమిగా అవతరించే చాన్సెస్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరి జన సమితి పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేసుడు ఖాయం కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కోదండరాం ఎక్కడ పోటీ చేస్తారన్నది చర్చనీయాంశమైంది. అసలు ఆయన పోటీ చేస్తారా? లేదా అని ఒక చర్చ అయితే ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏదబ్బా అన్న మరో చర్చ సాగుతున్నది. దీనిపై ఒక స్టోరీ. చదవండి.

కోదండరాం తొలినుంచీ లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన తెలంగాణ విద్యార్థిదశలో లెఫ్ట్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. తర్వాత విద్యావంతుల వేదిక నడిపారు. మొన్నటి వరకు జెఎసి ఛైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీ అధినేత అయ్యారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కోదండరాం తన జిల్లా అయిన మంచిర్యాలలోనే పోటీ చేస్తారా? లేకపోతే రాజధాని హైదరాబాద్ లో పోటీ చేస్తారా? లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బరిలో దిగుతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కోదండరాం సొంత ఊరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ఇప్పుడు మంచిర్యాల జిల్లా). రానున్న 2019 ఎన్నికల్లో ఆయన మంచిర్యాలలో పోటీ చేయవచ్చని ఇంతకాలం జోరుగా ప్రచారం సాగింది. సొంత జిల్లా కావడం.. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సింగరేణి కార్మికులతో కోదండరాం కు బలమైన సంబంధాలు ఉండడంతో ఆయన ఆ సీటును ఎంచుకుంటే సునాయాసంగా గెలుస్తారన్నది జన సమితి నేతల అంచనా. ఇప్పటివరకు అదే టాక్ నడిచింది కానీ తాజాగా మరో రెండు నియోజకవర్గాల్లో కోదండరాం పోటీ చేయవచ్చన్న టాక్ మొదలైంది. అందులో ఒకటి జనగామ కాగా మరొకటి ఉప్పల్. ఈరెండులో ఏదో ఒకసీటులో కోదండరాం పోటీ చేసే చాన్స్ ఉందంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి.

జనగామలో ఆయన పోటీ చేస్తారన్న వాదన వెనుక పెద్ద కథే ఉంది. ఒకటి జనగామలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని జన సమితి నేతలు అంచనా వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, లేదంటే ఒకవేళ ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆయన లోపాయికారిగా జన సమితికి సహకారం చేయవచ్చన్న చర్చ ఉంది. దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత జనగామ అభివృద్ధికి సర్కారు చేసిందేమీ లేదన్న భావనలో ఉన్నారు. జనగామలో రెడ్డీ సామాజికవర్గం వారు బలంగా ఉండడంతో ఆ నియోజకవర్గానికి కేవలం జిల్లా కేంద్రం ఇచ్చుడు తప్ప ఇంకేమాత్రం అభివృద్ధి చేయలేదన్న చర్చ ఉంది. అందుకే కోదండరాం మొన్న చేపట్టిన నిరహారదీక్షల సందర్భంగా సభను జనగామలోనే జరిపారు. ఆయన అక్కడ కన్నేశారు కాబట్టే నిరహారదీక్షల హడావిడి చేశారని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకాలంలో మొదలుకొని.. తెలంగాణ వచ్చిన తర్వాత జన సమితి పెట్టేంతవరకు కూడా జనగామ కేంద్రంగా కోదండరాం కార్యకలాపాలు చేపట్టినట్లు చెబుతుంటారు. అయితే జనగామలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఉండగా కోదండరాం పోటీ చేయడం సాధ్యమేనా అన్న చర్చ ఉంది. ఎందుకంటే ఒకవేళ మహా కూటమి అయితే పొన్నాలకు టికెట్ దక్కే అవకాశాలుంటాయి. మరి కోదండరాం ఎందుకు అక్కడకు పోతారన్న ప్రశ్న కూడా ఉంది.

ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ లో కోదండరాం పోటీ చేయవచ్చని కూడా ఒక వాదన వినిపిస్తున్నది. ఉప్పల్ లోనే ఎందుకంటే? ఇక్కడ చదువుకున్న ఓటర్ల సంఖ్య ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా గుండుగుత్తగా ఓటింగ్ అనేది సిటీలో ఉండదు. దాంతోపాటు ఎడ్యూకేటెడ్ పీపుల్స్ లో కోదండరాం పట్ల మంచి అభిప్రాయం ఉంది. ఇవన్నీ పాజిటీవ్ అంశాలుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ రాజకీయాలు, సిటీ రాజకీయాలు వేరుగా ఉంటాయన్న విషయం ఢిల్లీ ఎన్నికల్లో రుజువైందని అంటున్నారు. ఢిల్లీలో సాంప్రదాయ కాంగ్రెస్, బిజెపిలను పక్కకు నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని బంపర్ మెజార్టీతో జనాలు గెలిపించిన విషయాన్ని గుర్తు  చేసుకుంటున్నారు. విద్యాధికులు ఉన్నచోట డబ్బు, మందు ప్రలోభాలు పనిచేయవన్న భావన ఉంది. కోదండరాం అయితే మంచిర్యాల లేదంటే ఉప్పల్ లో పోటీ చేయవచ్చని వరంగల్ జిల్లాకు చెందిన ఒక జెఎసి నాయకుడు చెప్పారు. ఏ కోశాన చూసినా జనగామ ఆప్షన్ ను కోదండరాం ఎంచుకునే చాన్స్ లేదని ఆయన స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో రెండు పర్యాయాలు డబ్బు, మద్యం పంచకుండానే ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలు చూసినా, నాగేశ్వర్ ఎన్నిక చూసినా సిటీ రాజకీయాల వైపు కోదండరాం ఆలోచన చేయవచ్చని ఆయన విశ్లేషించారు.

ఇక మరో ముఖ్యమైన విషయమేమంటే? అసలు కోదండరాం పోటీ చేస్తారా? లేదంటే పోటీ చేయకుండానే తన పార్టీ వారికి టికెట్లు ఇచ్చి అందరి తరుపున ప్రచారం చేస్తారా అన్న ఇంకో చర్చ కూడా ఉంది. ఒకవేళ కూటమి ఏర్పాటైతే కూటమి తరుపున కూడా ఆయన పోటీ చేయకుండా ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కోదండరాం గత చరిత్ర అంతా చూసినా లెఫ్ట్ నేపథ్యం ఉంది. అందుకే లెఫ్ట్ పార్టీల నేతలు కీలక నేతల మాదిరిగా కోదండ పోటీ చేయకుండానే తన వారిని బరిలోకి దింపి గెలిపించుకునేందుకు ఎత్తుగడ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నల్లగొండకు చెందిన ఒక విద్యార్థి జెఎసి నేత అన్నారు.