Heat Waves Alert: ఈ ఏడాది ఎండలు భయంకరమే.. వడగాలుల ప్రభావం ఎలా ఉండబోతోందంటే?

Heat Waves Alert: ఈ వేసవి తెలంగాణ ప్రజలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1901 నుంచి 2025 వరకు నమోదైన ఉష్ణోగ్రతల సరాసరిని పరిశీలించినట్లయితే, ఈ ఏడాది ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. గతంలో కంటే ఎక్కువగా వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.

ప్రస్తుతం గాలి తేమ శాతం క్రమంగా తగ్గుతుండటంతో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోని దక్షిణ, మధ్య భాగాల్లో ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మే నెల నాటికి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇది 125 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో ఒకటిగా నిలవొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇందులో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో సాధారణ స్థాయికి మించి వేడి తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన సంవత్సరాలతో పోల్చితే రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగే అవకాశముంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం, వేసవి కాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకూడదని, తగినంత నీరు తాగుతూ ఉండాలని, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కన్నప్ప షేక్|| Cine Critic Dasari Vignan Review On Kannappa Teaser || Prabhas || Manchu Vishnu || TR