Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు కోట్లలో నష్టాలు.. చేతులెత్తేసిన ఎల్ అండ్ టీ

Hyderabad Metro

హైదరాబాద్ మెట్రో మరోసారి కష్టాల్లో పడింది. భారీ నష్టాలతో మెట్రోను నడిపించడం తమ వల్ల కాదంటూ ఎల్‌ అండ్ టీ సంస్థ చేతులెత్తేసింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మెట్రో రైలు నిర్మాణం ఉండాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అనంతరం భూసేకరణ చేసి మెట్రో నిర్మాణం చేపట్టింది. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మెట్రో నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్థతో మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో 2017లో మెట్రో నిర్మాణం పూర్తి అయి రాకపోకలు ప్రారంభమయ్యాయి.

దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరాయి. ప్రయాణం కూడా సులువుగా మారింది. నగరంలోని ఈ చివరి ప్రాంతం నుంచి ఆ చివరి ప్రాంతం వరకు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మెట్రో ఎంతో ఉపయోగపడింది. ప్రతి రోజూ లక్షలాదతి మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే కరోనా సమయంలో మెట్రో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అప్పటి నుంచి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేయడం, ట్రావెల్ కల్చర్ మార్పులతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాంతో మెట్రో ఆదాయం పడిపోయింది.

ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టుతో తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ సంస్థ తెలిపింది. తన వాటాలను విక్రయించేందుకు సిద్ధమంటూ ప్రకటించింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాలను కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరింది. కొత్త స్పెషల్ పర్పోజ్ వెహికల్ ద్వారా ఈ విక్రయం జరగాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు సంస్థ ఉన్నతాధికారులు లేఖ రాశారు. రూ.626కోట్లతో నష్టంలో ఉన్నామని పేర్కొన్నారు. అలాగే నష్టాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ రైల్ కారిడార్ ఫేజ్-11ఏ, ఫేజ్-11బి విస్తరణ ప్రాజెక్టుల్లో తాము పాల్గొనమని స్పష్టం చేసింది. దీంతో నగరంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.