తెలంగాణ ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. నిజాం ప్రభువులు ఈ సంస్థానాన్ని పాలించేవారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ ప్రజలకు మాత్రం స్వేచ్ఛ లభించలేదు. ఎందుకంటే అప్పటివరకు ఆంగ్లేయులకు సామంత రాజుగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అని.. తాను ఏ దేశంలో కలవనని ప్రకటించుకున్నారు. అయితే హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని బలంగా కోరుకున్నారు. అప్పటి హైదరాబాద్ సంస్థానం మూడు ప్రాంతాల కలయికగా ఉండేది.
మూడు ప్రాంతాల కలయిక..
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాంతాలు భాగంగా ఉండేవి. రాజధాని హైదరాబాద్ నుంచే నిజాం నవాబులు సంస్థాన పాలన వ్యవహారాలు నిర్వహించేవారు. అప్పటి మొత్తం జనాభాలో 90 లక్షల మంది తెలంగాణ ప్రజలు ఉండగా.. మరాఠా ప్రజలు 40 లక్షలు, కన్నడ ప్రజలు 20 లక్షలు ఉండేవారు. ఇతర సంస్థానాలతో పోలిస్తే ఎక్కువ జనాభా కలిగిన సంస్థానంగా హైదరాబాద్‌కు గుర్తింపు ఉంది. అంతేకాదు, దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థానం కూడా. రాజభాషగా ఉర్దూ ఉండేది. పాలకుల అణచివేత వల్లే ఉర్దూకు దక్కిన గౌరవం నాటి తెలుగు, మరాఠీ, కన్నడ భాషలకు దక్కలేదు చెబుతుంటారు.
ప్రజల మాన, ప్రాణాలకు లేని రక్షణ..
ఒకవైపు దేశ్ ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో ప్రజలు మగ్గిపోతుంటే.. మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. దీంతో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. అంతటి అరాచక పాలన కొనసాగేది. ముఖ్యంగా రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ రాక్షసుడిగా ప్రవర్తించేవారు. జమీందారీ వ్యవస్థపై ఆధారపడి నిజాం పాలన సాగించేవారు. సామాన్య ప్రజలపై నిరంకుశంగా వ్యవహరించేవారు. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. అడ్డు తిరిగిన వారిని నిర్థాక్షిణ్యంగా చంపేసేవారని నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు చెప్పేవారు.
ఆపరేషన్ పోలో.. లొంగిపోయిన నవాబ్..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఆర్యసమాజ్ వివిధ మార్గాల ద్వారా పోరాటం చేశాయి. దీంతో ఈ సంస్థలను నవాబ్ ఉస్మాన్ నిషేధించారు. నిజాం అరాచకాలు ఎక్కువ కావడంతో పాటు దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ సంస్థానంపై ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైనిక చర్యకు ఉపక్రమించారు అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్. దీంతో 1948 సెప్టెంబర్ 13న సైనికులు సంస్థానం అంతటా చుట్టుముట్టారు. ఇక చేసేదేమీ లేక సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ భారతదేశ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. దేశంలో హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా పిలుస్తారు.
విలీనమా.. విమోచనమా..? రాజకీయ రగడ..
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 2023లో 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను ప్రారంభించింది. 2023లో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించింది. అయితే బీజేపీ మాత్రం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 వచ్చిందంటే తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతాయి. విమోచన దినోత్సంగా బీజేపీ.. విలీనం, జాతీయ సమైక్యత దినోత్సవంగా ఇతర పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. రాజకీయాలు ఎలాగున్నా సరే సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఓ సెంటిమెంట్. తమకు నిజాం నిరంకుశ పాలన నుంచి స్వతంత్రం లభించిన రోజుగా ప్రజలు భావిస్తారు.
