టిఆర్ఎస్ లోకి మరో వరంగల్ కాంగ్రెస్ నాయకుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరడంతో క్యాడర్ లో ఆందోళన నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత టిఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ జడ్పీ ప్లోర్ లీడర్ వెంకన్న టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది. వెంకన్న ప్రస్తుతం మహబూబాబాద్ నుంచి జడ్పీటిసి గా ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయ నతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చర్చలు జరిపినట్టు సమాచారం. ఆయన ఒకటి రెండు రోజుల్లో గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వెంకన్న అనుచరుల ద్వారా తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 26 మంది జడ్పీటీసీలు గెలుపొందగా ప్రస్తుతం ఆ పార్టీలో వెంకన్నతో పాటు ఆరుగురు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జడ్పీ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌గా ఉన్నటువంటి ఆత్మకూరు జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి సైతం గత నెలలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో వెంకన్న పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సంజీవరెడ్డితో కలిసి వెళ్లిన వెంకన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పార్టీ మారే విషయమై మంతనాలు జరిపినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వెంకన్న పార్టీ మారితే జడ్పీలో కాంగ్రెస్‌ జడ్పీటీసీల సంఖ్య ఐదుకు చేరుకునే అవకాశం ఉంది.

ఎం. వెంకన్న

స్థానిక ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు రాబోతుండడంతో స్థానికంగా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారట. అందుకే గ్రామీణ ప్రాంతాలలో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే ముందుగా జిల్లాలో బలమైన నేతలతో సంప్రదించి వారు పార్టీ మారిన తర్వాత కింది స్థాయి నేతలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన షాక్ నుంచి తేరుకోక ముందే కాంగ్రెస్ లో బలమైన నేతలు పార్టీని వీడడం ముఖ్య నేతలను కలవర పెడుతోంది. టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు కళ్లెం వేసేలా కాంగ్రెస్ నేతలు కూడా తమ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. సర్పంచ్, పార్లమెంటు ఎన్నికలు సవాల్ గా ఉండడంతో పార్టీ నేతలు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.