Munugode By-poll: ‘తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. వారం రోజుల క్రిందటే హామీ ఇచ్చారు. కానీ, పోలింగ్ ముందు రోజు కూడా ఇవ్వలేదు. కొందరికి మాత్రమే ఇచ్చారు. మాకు అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ, ఓటెయ్యడానికి వచ్చాం. ఏం చేస్తాం.? వచ్చే ఎన్నికలకి ఓటు వెయ్యాలంటే, ఇప్పుడు వెయ్యక తప్పదు..’ అంటూ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయంలో కొందరు మహిళలు పోలింగ్ బూత్ వద్దనే వాపోయారు.
ఇంతకీ, సదరు మహిళలకు ‘తులం బంగారం’ ఆశ చూపించినదెవరు.? ఇంకెవరు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట. ‘హామీ ఇవ్వకపోతే అడిగేటోళ్ళం కాదు కదా.? వాళ్ళు ఇస్తున్నప్పుడు.. మేం తీసుకోవాలి కదా.? గెలిచి, కోట్లు సంపాదిస్తున్నారు.. వారిని గెలిపించినందుకు మేం తీసుకోకపోతే ఎలా.?’ అంటూ సదరు మహిళలు పూర్తి క్లారిటీతో మీడియాని ఎదురు ప్రశ్నించేశారు.. ఓటు కోసం నోటు తీసుకోవడం తప్పు కదా.. అని అడిగినందుకు.
డబ్బులిస్తేనే ఓట్లేస్తాం..
కొందరు ఓటర్లైతే రాజకీయ పార్టీల ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. గంప గుత్తగా ఓటర్లు ఒక చోట చేరి, అభ్యర్థుల తాలూకు మనుషుల్ని తమ వద్దకు రప్పించుకుంటున్నారు.
ఓ మతానికి చెందిన ఓటర్లంతా.. ప్రార్థనా మందిరం కోసం డబ్బులిస్తామని ఓ పార్టీకి చెందిన అభ్యర్థి హామీ ఇచ్చేదాకా ఓట్లెయ్యడానికి రాలేదట. హామీ రాగానే, ఒకేసారి గుంపులుగా ఆ ఓటర్లంతా పోలింగ్ బూత్ వైపు పరుగులు తీయడం గమనార్హం.
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఇలాంటి సిత్రాలు చాలానే కనిపిస్తున్నాయ్.! ‘ఈసారి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఎక్కడికి పోతారు.? ఏడాదిలోనే ఎన్నికలొస్తాయ్ కదా, అప్పుడు డబుల్ వసూలు చేస్తాం..’ అని ఓటర్లు, రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నారు.