పిసిసి లీడర్ల పై విజయశాంతి సీరియస్

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయశాంతి వంటబట్టించుకున్నట్లున్నారు. అందుకే ఆమె ముందు సొంత పార్టీని సెట్ రైట్ చేసే పనిలో ఉన్నారు. పిసిసి నాయకత్వంపై ఆమె తీవ్ర అసంతృస్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఒక ప్రకటన వెలువరించారు. ఆమె స్టేట్ మెంట్ కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతున్నది. పూర్తి వివరాలు చదవండి.

సాగదీసి సాగదీసి కూటమిలో సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక అభ్యర్థులకు బి ఫారాలు కూడా ఇచ్చేసింది. నామినేషన్లు వేశారు. కూటమి కి ఇచ్చిన సీట్లలో కూడా నామినేషన్లు వేసింది కాంగ్రెస్. ఈ తతంగం ఇట్లా ఉండగానే మరో బ్లెండర్ మిస్టెక్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం.

ఈనెల 23న యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణలో భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. మేడ్చల్ లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. ఈ సభకు కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రముఖ పత్రికల్లో యాడ్స్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ యాడ్స్ ద్వారా జనాలకు సమాచారం అందిందో లేదో కానీ పిసిసి నాయకత్వం మాత్రం ఇరకాటంలో పడింది.

పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఆహ్వానించే నాయకురాలు సోనియాగాంధీ ఫొటో తప్ప తెలంగాణలోని ఏ మహిళా నాయకురాలి ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అగ్గి మీద గుగ్గిలమైంది రాములమ్మ. ఆమెను తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది అధిష్టానం. ఆమె పోటీ కూడా చేయకుండా స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చినందున ఆమె ఫొటో ప్రకటనలో ఉండాల్సి ఉండే. కానీ ప్రకటన తయారు చేసిన వారు ఆ విషయం పట్టించుకోలేదు. ఏదో మొక్కుబడిగా నాలుగైదు ఫొటోలు పంపి యాడ్స్ డిజైన్ చేయించినట్లు కనబడుతున్నది. 

నిజానికి రాములమ్మ ఒక్కరే కాదు గొప్ప మహిళా నేతలు తెలంగాణలో ఉన్నారు. మాజీ మంత్రులు ఉన్నారు. జె గీతారెడ్డి, డికె అరుణ, సబిత ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, కొండా సురేఖ వీళ్లంతా మాజీ మంత్రులుగా పనిచేశారు. వీరిలో ఏ ఒక్కరి పేరు కానీ, ఫొటో కానీ ప్రకటనలో వేయకపోవడం వివాదం రేపింది. ఈ అంశంపై విజయశాంతి మెసలకుండా విమర్శించింది.

సోనియా సభకు మగవాళ్లు మాత్రమే వస్తారా? అని ప్రశ్నించారు విజయశాంతి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ సభలో మహిళలు కూడా పాల్గొంటారు కదా? అని నిలదీశారు. మీడియా ప్రకటనల్లో మహిళా నేతల ఫొటోలు ఎందకు వేయలేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా టిఆర్ఎస్ ను ఉదహరిస్తూ కొంత కటువుగానే విజయశాంతి విమర్శలు గుప్పించారు.

 

గడిచిన నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించే మనం చేసిందేమిటి అని ఆమె ప్రశ్నించారు. సోనియా సభకు మహిళా నేతల ఫొటోు పెట్టకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. టిఆర్ఎస్ కు మహిళలు అంటే చిన్నచూపు అని నిత్యం విమర్శలు చేస్తున్నాము. గతంలో మంత్రి పదవి ఇవ్వలేదు. ఈసారి కేవలం నాలుగు సీట్లు మాత్రమే మహిళలకు టిఆర్ఎస్ ఇచ్చిందని నిందిస్తున్నాము. మరి మన మీటింగ్ లో మహిళల ఫొటోలు లేకుండా అగౌరవపరచడం భావ్యమా అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.  ఈమేరకు విజయశాంతి ఒక ప్రకటన జారీ చేశారు.

విజయశాంతి విమర్శలతో కాంగ్రెస్ పెద్దలకు దిమ్మతిరిగిపోయింది. ఆమె విమర్శలపై ఆలోచనలో పడ్డారు. దానికి ఎవరు కారణం అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి పత్రికా ప్రటకనలు జారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ పెద్దలు చర్చించుకుంటున్నారు. ఎంతైనా రాములమ్మా మజాకా అంటున్నారు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు.