బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాములమ్మ పార్టీ అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మొదటి రోజు నుండే అంకురార్పణ చేశారు. నేడు పార్టీలో చేరిన తర్వాత బీజేపీ కార్యాలయాలయంలో విజయశాంతి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాములమ్మ… కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నాడని విమర్శలు చేసారు. కేసీఆర్ పతనం ప్రారంభమైంది అని ఆమె హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావటం ఖాయం అన్నారు. అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నాడు అని ఆమె విమర్శించారు.
కేసీఆర్ కు తెలంగాణ ప్రజల కంటే.. డబ్బు మీదనే ఎక్కువ ప్రేమ అని, రాఖీ కట్టిన చెల్లెళ్ళకు ఒకప్పుడు లక్ష రూపాయలు ఇవ్వలేని కేసీఆర్ కు లక్ష కోట్లు ఎలా వచ్చాయి అని ఆమె నిలదీశారు. వరద బాధితులకు సాయం ఎందుకు చేయటం లేదో చెప్పాలి అని ఆమె నిలదీశారు. తెలుగుదేశంలో మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే కేసీఅర్ ఉద్యమంలోకి వచ్చాడు అన్నారు. నేను ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నారు అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్… నాకంటే గొప్ప నటుడు అని ఆమె వివరించారు.
తన కుటుంబం నుంచి ఎవర్నీ రాజకీయాల్లోకి తీసుకురానన్న కేసీఆర్ మాట తప్పాడు అని మండిపడ్డారు. తల్లి తెలంగాణ పార్టీని స్వార్థంతోనే కేసీఆర్ టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు అని, నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ ఎన్నో విధాలుగా ప్రయత్నించారు అని ఆమె విమర్శించారు. ప్రణాళిక ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో నన్ను తిట్టించాడు అని, బీజేపీ నాకు తల్లి పార్టీ. ప్రత్యేకమైన కారణాలతోనే బీజేపీని వీడాను అన్నారు. 1998నుంచి తెలంగాణ కోసం పోరాటం చేశాను. కేసీఆర్ ఎక్కడున్నాడో ప్రజలకు తెలుసు అని ఆమె అన్నారు. చంద్రబాబు కారణంగానే అప్పట్లో బీజేపీని వీడాను అని ఆమె చెప్పారు. తిరిగి అమ్మ వొడిని చేరటం తనకు ఆనందంగా ఉందన్నారు.