కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
సినిమాల్లో లేడీ బాస్‌గా, లేడీ అమితాబ్‌గా గుర్తింపు ఉన్నా అవేవీ ఆమెకు రాజకీయాల్లో ఇప్పటివరకూ పెద్దగా ఆమెకి కలిసి రాలేదు. 1998లో బీజేపీతోనే విజయశాంతి రాజకీయ ఆరంగేట్రం జరిగింది. తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. కొన్నాళ్లకు దాన్ని టీఆర్ఎస్లో కలిపేశారు. టీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ఎన్నికైన రాములమ్మ… ఆ తర్వాత… టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.
టీఆర్ఎస్లో విబేధాలతో… ఈ మాజీ మెదక్ ఎంపీ…. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఐతే… కాంగ్రెస్ పార్టీలోనూ ఆమె అధిష్టానానికి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ మధ్య బీజేపీకి అనుకూలంగా మాట్లాడటంతో… ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అదే చివరికి నిజమైంది.
బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని… కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెడతానని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా కీలక పాత్రను పోషిస్తానని తెలిపారు.