వెలిమినేడులో పర్యావరణ పరిరక్షణ పోరు హోరెత్తుతుంది. గ్రామంలో కంపెనీల విస్తరణకై గత వారం రోజులుగా సాగుతున్న పోరు విస్తృత స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దలు, నాయకులు, విద్యావంతులు, మేధావులు, యువకులు సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కంపెనీల విస్తరణను అడ్డుకోవాలని తీర్మానించారు.
రాఖీ పండుగ ఉన్నా సరే అంతా సమావేశమై గ్రామ అభివృద్ది, గ్రామ భవిష్యత్తు గురించి చర్చించారు. 14వ తారీఖు నాడు ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని తీర్మానించారు. గ్రామంలో కాలుష్యం పెరిగి రోగాల బారిన పడటంతో పాటు, గ్రామమే నాశనమయ్యే పరిస్థితి వస్తదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజలంతా కలుపలుగోలుగా వచ్చి ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కంపెనీల కాలుష్యం పెరగడంతో ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా గ్రామంలోని ప్రతి పౌరుడు పోరాడాలని అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా కలుపుకోని పోరులో భాగం చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగే ర్యాలికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హాజరు కానున్నట్టు సభ్యులు తెలిపారు. రాఖీ పండుగను కూడా గ్రామస్థులు కంపెనీల కాలుష్యం ఆందోళన మధ్యే జరుపుకున్నారు. రాఖీ పండుగనాడు కూడా గ్రామంలోని ప్రజలకు సంతోషం కరువైందని వారు ఆవేదన చెందారు. రాఖీ పండుగ సంధర్భంగా సమావేశంలో రాఖీలు కట్టుకొని ప్రతిన బూనారు.
నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం గ్రామానికి రక్ష అని వారు ప్రతిన చేశారు.
ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ,రాజకీయల నాయకులు, పార్టీ పెద్దలు,వినాయక మండపాళ్ల నిర్వాహకులు, విద్యావంతులు, యువకులు, మేధావులు, ఉపాధ్యాయులు, గ్రామ పౌరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.