నల్లగొండ జిల్లా వెలిమినేడులో ఉప సర్పంచ్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. మూడో విడతలో భాగంగా వెలిమినేడులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధి దేశబోయిన మల్లమ్మ సర్పంచ్ గా విజయం సాధించారు. సీపీఎం బలపరిచిన అభ్యర్ధి బొంతల లక్ష్మీఉపేందర్ రెడ్డి 36 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
వెలిమినేడులో 14 వార్డులున్నాయి. ఇందులో 8 వార్డులు కాంగ్రెస్, 3 వార్డులు సీపీఎం, టిఆర్ఎస్ 3 వార్డులు గెలుపొందాయి. ఉప సర్పంచ్ ఎన్నికకు 8 మంది సభ్యుల కోరం కావాలి. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ ఉన్నా అభ్యర్ది ఎంపిక జరగకపోవడంతో బుధవారం ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. గురువారం ఉదయం ఉప సర్పంచ్ ఎన్నిక జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ సరిపోను కోరం లేకపోవడంతో మళ్లీ ఏం చేయాలో అధికారులకు తోచలేదు. దీంతో టిఆర్ఎస్ పార్టీ వాళ్లు వెంటనే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.
కాంగ్రెస్ , సీపీఎం వార్డు మెంబర్లను తమ వర్గంలోకి తీసుకునే దిశగా చర్యలు చేపట్టారు. వారిని ప్రలోభాలకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సరిపోను కోరం లేకపోవడంతో మళ్లీ ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వార్డు మెంబర్లు వస్తుండగా దౌర్జన్యంతో కాంగ్రెస్, సీపీఎం వార్డు మెంబర్లను టిఆర్ఎస్ వాళ్లు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన వార్డు మెంబర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
“వెలిమినేడులో ఉప సర్పంచ్ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి అన్ని అర్హతలున్నాయి. అయినా టిఆర్ఎస్ వాళ్లు తమ రాజకీయ బుద్దితోటి మా పార్టీతో పాటు సీపీఎం సభ్యుడిని అపహరించారు. అక్రమంగా బెదిరించి క్యాంపుకు తరలించారు. బూతు మాటలు తిడుతూ కొడుతూ తీసుకెళ్లారు. వారిని మాజీ ఎమ్మెల్యే వీరేశం దగ్గరకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
టిఆర్ఎస్ వారు నీచ రాజకీయం చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. వెంటనే వారిని విడుదల చేయాలి. చట్ట ప్రకారం ఉప సర్పంచ్ ఎంపిక జరగాలి. వెలిమినేడు చరిత్రలోనే ఇటువంటి రాజకీయాలను మొదటి సారి చూస్తున్నాం. అనుభవం లేని వారంతా పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికను ఉద్రిక్తతలకు దారితీశారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ వారు సహకరించి చట్ట ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక జరిగేలా చూడాలి. మోసపూరిత రాజకీయాలు సరికావు. కొంతమంది సోషల్ మీడియాలో ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పు. కొంత మంది ఆకతాయిలు పెట్టే పోస్టులను నమ్మొద్దన్నారు. అధికారులు మళ్లీ తేదిని ప్రకటించి కోరం ఉంటే ఉప సర్పంచ్ ఎంపిక జరుపుతారు.” అని కాంగ్రెస్ వార్డు మెంబర్ అన్నారు.
ఉప సర్పంచ్ ఎన్నిక ఆందోళన వీడియో కింద ఉంది చూడండి