నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉమ్మెంతుల కిరణ్ కుమార్ రెడ్డి, సాగర్ల పరమేష్ యాదవ్ లు అయిలేను మల్లన్న స్వామి దర్శనం చేసుకొని గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు ఎలికట్టె రోడ్డుకు వెళ్లేందుకు యూ టర్న్ తీసుకుంటున్నారు.
ఇదే క్రమంలో నల్లగొండ డిపోకు చెందిన బస్సు నల్లగొండ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. వారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలోనే బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎగిరి రోడ్డు పై బలంగా పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. పరమేష్ కు గాయాలయ్యాయి. వారిద్దరిని స్థానికులు వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కిరణ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
చిట్యాల మండల కేంద్రంలోని బస్టాండ్, పోలీస్ స్టేషన్ ముందు యూ టర్న్ లు చాలా డేంజర్ గా ఉన్నాయి. గతంలో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినా అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మంది చనిపోయినా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిగ్నల్ లు ఏర్పాటు చేయాలని అలాగే ఈ రెండు ప్రాంతాలలో కూడా పోలీసు సిబ్బంది ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని వారు డిమాండ్ చేస్తేన్నారు. తక్షణమే స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.