రెవెన్యూ శాఖలో పెరుగుతున్న అవినీతి పై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు అవినీతిమయంలో కూరుకుపోయి రైతులను నానా తిప్పలు పెడుతున్నారని తెలుస్తోంది. ఈ బాధలు పడలేక ఏకంగా ఓ రైతు సోషల్ మీడియాలో సమస్య చెప్పడంతో సీఎం కేసీఆర్ స్పందించారు. దీంతో నల్లగొండ జిల్లాలో మరో రైతు తనకు వచ్చిన కష్టం పై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఎమ్మార్వో ఆఫీసు ముందు గుంత తీసి తాను ఇచ్చిన అప్లికేషన్లను బొంద పెట్టాడు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన జోగు అశోక్ అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. ఆయన నాలుగు సంవత్సరాల క్రితం తన పొలంలో బోరు వేసుకున్నాడు. పక్క పొలం రైతు కూడా బోరు వేసుకునే ప్రయత్నం చేయగా అప్పుడు అశోక్ వారిని వాల్టా చట్టం కింద ఆధారాలు చూపి ఆపాడు. కొద్ది రోజుల క్రితం రాత్రికి రాత్రే పక్క పొలం వ్యక్తి బోరు వేశాడని తెలుస్తోంది. దీంతో అశోక్ బోరు ఎండిపోయింది.
అశోక్.. వీఆర్వో హాబీబ్ , ఎమ్మార్వో లకు ఫిర్యాదు చేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి బోరు వేశారని వెంటనే బోరు మూసివేయాలని కోరాడు. అయినా కూడా రెవిన్యూ అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. దీంతో రైతు అశోక్ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కదిలి రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టాడు. చిట్యాల ఎమ్మార్వో ఆఫీసులో పైస లేనిదే పని కాదన్నారు.
చిట్యాల ఎమ్వార్వో ఆఫీసు లంచాలకు కేరాఫ్ అడ్రస్ అట…
చిట్యాల ఎమ్వార్వో ఆఫీసు లంచాలకు కేరాఫ్ అడ్రస్ అని తెలుస్తోంది. ఎమ్వార్వో ఆఫీసులో పని చేయాల్సిన వీర్వోలు ఆఫీసు పక్కనే ఓ రూం తీసుకొని పని చేస్తున్నారట. అక్కడే అన్ని సెటిల్ మెంట్లు జరుగుతాయట. చిట్యాల మున్సిపల్ ఆఫీసు అయిన తర్వాత భూములకు డిమాండ్లు పెరగడంతో రెవిన్యూ అధికారులు జేబులు నింపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఊరి నుంచి ఓ పెద్ద మనిషితో లింక్ పెట్టుకొని ఆ ఊరు నుంచి ఏ సమస్య వచ్చినా ముందుగా వారికి ఫోన్ చేసి వారి కనుసైగల్లో ఈ దందా నడుపుతారని తెలుస్తోంది.
వెల్లంల వీఆర్వో హాబీబ్ పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా అతని పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పట్టా మార్పిడి, సర్వే చేస్తే, క్యాస్ట్ ఇన్ కం సర్టిపికెట్ ఇలా ఏ పనికైనా ఓ రేటు ఉంటుందని తెలుస్తోంది. అసలు భూమి మార్చేందుకు పైసలు ఎందుకియ్యాలిర బై అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ జీతగాళ్లు అయి ఉండి లంచాలు తీసుకోవడానికి సిగ్గు లేదా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీని పై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కి సమాచారం అందినట్టు తెలుస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వోలతో పాటు బాధ్యులైన అధికారుల పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. వీఆర్వో ని ఉద్యోగం నుంచే తీసేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.