తెలంగాణ కీలక కేబినెట్ కు ఇద్దరు మంత్రులు దూరం

తెలంగాణ రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముందస్తు సంకేతాలు ఇస్తూనే.. అదంతా ఏం లేదన్నట్లు సిఎం కేసిఆర్ వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తున్నారు. కేసిఆర్ తీరు అటు ప్రతిపక్ష పార్టీలే కాక సొంత పార్టీ నేతలకు కూడా అంతుచిక్కడంలేదు. తన నోటినుంచి ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలు వస్తాయని కేసిఆర్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ ముందస్తు కోసం చేయాల్సిన కార్యచరణ మొత్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రగతి నివేదన సభ అట్టహాసంగా సాగనుంది. దాని కంటే కొద్ది గంటల ముందే అత్యంత కీలక కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లో జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. భవిష్యత్ లో కొత్త రాజకీయాల పరిణామాలకు ఈ కేబినెట్ భేటీ నాందిపలకనుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ భేట ీతర్వాత అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని టిఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేదు లేదంటూనే అధికార పార్టీ ముందస్తు ఏర్పాట్లలో తలమునకలైందని ప్రతిపక్ష పార్టీలు అంచనాకొచ్చాయి. దీంతో ఆ పార్టీలు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. పొత్తులు, ఎత్తుల పై నజర్ వేశాయి.

 అత్యంత్ర ప్రాధాన్యత కలిగిన ఇవాళ్టి కీలక కేబినెట్ భేటీకి ఇద్దరు మంత్రులు గైర్హాజరవుతున్నారు. వారెవరో కాదు స్వయాన సిఎం కేసిఆర తనయుడైన కేటిఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. వీరిద్దరూ కేబినెట్ భేటీకి హాజరునుంచి మినహాయింపు లభించింది. ఈ మినహాయింపు ఎందుకు అనుకుంటున్నారా? కేబినెట్ భేటీ అనంతరం మంత్రులంతా నేరుగా ప్రగతి నివేదన సభకు పోతారు. అయితే ప్రగతి నివేదన సభ ఇన్ఛార్జి బాధ్యతలను మంత్రి కేటిఆర్ కు అప్పగించారు కేసిఆర్. దీంతో కేటిఆర్ కేబినెట్ సమావేశం నుంచి మినహాయింపు లభించింది. అలాగే రవాణా సౌకర్యాలు, ఇతరత్రా విషయాలను సభా ప్రాంగణం వద్ద ఉండి పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి కూడా మినహాయింపు దక్కింది.

ఈనేపథ్యంలో వారిద్దరూ సభా  ప్రాంగణం వద్దే మకాం వేశారు. ఉదయం నుంచి అక్కడే ఉండి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం వద్దకు ఆదివారం ఉదయమే కొందరు చేరుకున్నారు. దీంతో వారందరికీ టిఫిన్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం వద్ద మంత్రి కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నుంచి తనకు, మంత్రి పట్నం కు మినహాయింపు ఇచ్చారని చెప్పారు. సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకే తాము ఏర్పాట్లలో నిమగ్నమయ్యామని చెప్పారు.

కేబినెట్ నిర్ణయాలను కేసిఆర్ సభలోనే అనౌన్స్ చేస్తారని కేటిఆర్ వెల్లడించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రగతి నివేదన సభ ద్వారా ప్రజలను కోరతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల భయం పట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆందోళనతో ఉందన్నారు. తెలంగాణ సిఎంగా కేసిఆరే అవుతారని తమ రాజకీయ ప్రత్యర్థులైన రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి కూడా తెలుసన్నారు.