తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు గడిచినా ఇంత వరకు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పై క్లారిటి లేదు. కొత్త ప్రభుత్వం కొలువుతీరుతుందన్న నమ్మకంతో అసెంబ్లీకి అన్ని హంగులు ఏర్పాటు చేసి అలంకరించారు. ఇంత వరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా కాలేదు. సీఎం తర్వాత ప్రాముఖ్యత కలిగిన అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పలువురు కీలక నేతలు ప్రస్తావనకు వచ్చినా వారు పదవి చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో స్పీకర్ ఎంపిక చర్చనీయాంశంగా మారింది. గతంలో స్పీకర్ గా పని చేసిన వారంతా తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ భయం ప్రస్తుతం ఉన్న సభ్యులకు భయం పట్టుకుంది. ఈ సారి బాధ్యతలు చేపట్టే వారు కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేరనే భయంతో ఎవరూ కూడా స్పీకర్ పదవి చేపట్టడానికి ముందుకు రావడం లేదు.
ముందుగా స్పీకర్ పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎంపిక ఖాయమని చర్చ జరిగింది. ఇదే విషయమై సీఎం కేసీఆర్ ఈటల వద్ద ప్రస్తావించినట్టుగా కూడా కార్యకర్తలు చర్చించుకున్నారు. అయితే స్పీకర్ పదవి చేపట్టేందుకు ఈటల రాజేందర్ సుముఖంగా లేరని తెలుస్తోంది. సీఎంతో కూడా ఆయన ఈ విషయమై చర్చించి స్పీకర్ పదవి చేపట్టేందుకు తాను సిద్దంగా లేనని సున్నితంగానే చెప్పారని తెలుస్తోంది.
ఈటల రాజేందర్ స్పీకర్ పదవి చేపట్టకపోతే డిప్యూటి స్పీకర్ గా పని చేసిన పద్మాదేవేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించారట. కానీ తనకు మంత్రి పదవే కావాలని స్పీకర్ పదవి తాను చేపట్టలేనని పద్మా దేవేందర్ రెడ్డి కూడా కేసీఆర్ కు చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ రెడ్యానాయక్ పేరును కూడా పరిశీలించారు. కానీ అనూహ్యంగా రెండు కొత్త పేర్లు స్పీకర్ పదవికి తెరపకి వచ్చినట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి గా పని చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు స్పీకర్ పదవికి కేసీఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నేత. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ పదవికి పోచారం పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
మరో నేత పేరు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేరును కూడా స్పీకర్ పదవికి కేసీఆర్ పరిశీలిస్తున్నారట. అల్లోల గత కేబినేట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఆయన మరో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సారి అల్లోలకు స్పీకర్ పదవి ఇస్తే ఎలా ఉంటుందని పార్టీ కీలక నేతల వద్ద కేసీఆర్ అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అల్లోల పని తీరు పై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని ఆయనకు ఈ సారి కేబినేట్ లో చోటు దక్కకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ పదవి చేపట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే అప్పటికప్పుడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి స్పీకర్ పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
స్పీకర్ పదవికి ఉన్న సెంటిమెంట్ ఆ పదవి చేపట్టాలంటేనే భయపడే విదంగా తయారైంది. స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందో మరో 5 రోజుల్లో తేలనుంది. అనూహ్యంగా ఈ ఇద్దరు నేతల పేరు తెరపైకి రావడంతో పార్టీలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్ నేతలను స్పీకర్ పదవి తీవ్ర భయాన్ని రేపుతుంది. స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత మళ్లీ ఏ నాయకుడు కూడా గెలవలేదు. దీంతో నేతలంతా స్పీకర్ పదవితోటే తమ రాజకీయ జీవితం ముగుస్తుందని భయపడుతున్నారు. మరి స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో ఆ పదవి చేపట్టేందుకు ఏ నేత ధైర్యం చూపబోతున్నారోనన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.