కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ సీట్ల పై ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కుటుంబ సీట్ల లొల్లితో బజారుకెక్కి పరువు తీసుకోకుండా అంతర్గతంగా చర్చించుకొని నేతలంతా ఒక నిర్ణయానికి వచ్చారని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. చాలా మంది నేతలు తమ కొడుకులకు, బిడ్డలకు టిక్కెట్ లు ఇవ్వాలని కోరుతున్నారు.
ఒక ఫ్యామిలీలో ఒకరికే సీటు అనే విధానానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు, కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఉత్తమ్ దంపతులు సిట్టింగ్ లు కావడం అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో ఈ మినహాయింపునిచ్చారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు స్థానం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు తమ కుటుంబ సభ్యులకు ఆశిస్తున్న సీట్ల వివరాలివే…
కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటి చేస్తుండగా తన కుమారుడు రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ టికెట్ కావాలని కోరుతున్నారు.
డికె అరుణ గద్వాల్ నుంచి పోటి చేస్తుండగా తన కూతురు స్నిగ్ధారెడ్డికి మక్తల్ టికెట్ కోరుతుంది.
దామోదర రాజనర్సింహ్మ తన భార్య పద్మినిరెడ్డికి టికెట్ కోరుతున్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ నుంచి పోటి చేస్తుండగా మునుగోడు రాజగోపాల్ రెడ్డికి దాదాపు ఖరారైందని నేతల ద్వారా తెలుస్తోంది.
అంజనీయాదవ్ తన కుమారుడు అనిల్ యాదవ్ కు ముషీరాబాద్ టికెట్ కోరుతున్నారు.
మాజీ హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మహేశ్వరం నుంచి పోటి చేస్తుండగా తన కుమారుడు కార్తీక్ రెడ్డికి రాజేంద్ర నగర్ నుంచి టికెట్ కోరుతుంది.
ముఖేష్ గౌడ్ తన కుమారనికి సీటు ఇవ్వాలని కోరుతున్నాడు.
కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ తన అల్లుడు క్రిశాంక్ కోసం కంటోన్మెంట్ టికెట్ కోరుతున్నారు.
సీట్ల విషయంలో ఒక క్లారిటి వస్తేనే ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే సీనియర్ నేతలకు, సిట్టింగ్ లకు వారి స్థానాలు వారికే అనే సిగ్నల్ రావడంతో నేతలంతా ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అంతర్గత కుమ్ములాటలు ఉండేవి. దాంతో వాళ్లకు వాళ్లకే తేలదు, పక్కొనిది ఏం తేల్చుతరని కేసీఆర్ పలుసార్లు వ్యాఖ్యానించారు. దీంతో అటువంటి విమర్శలకు తావులేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అయితే కీలక నేతలు తమ పుత్రరత్నాలకు అడుగుతున్న ప్లేస్ లో చాలా మంది ముఖ్య కార్యకర్తలు టికెట్ ఆశిస్తున్నారని ఈ నేపథ్యంలో వారిని కాదని పక్కకు పెడితే క్యాడర్ సహకరించకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. వారు ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇప్పుడు వారసులకు ఇస్తే వారు సహకరించరని ఈ విషయంలో నేతలు ఆలోచించాలని పలువురు నేతలు కోరారని తెలుస్తోంది. దీంతో మళ్లీ అంతర్గత పోరు తప్పదని టికెట్ ఆశించిన నేతలు రెబల్ గా పోటి చేసే అవకాశం ఉంటుదనే చర్చ జరిగింది.
స్థానిక నేతలు చాలా బలం కలిగి ఉంటారని వారి కింద ఉన్న నేతలు సహకరించపోతే ఓటు బ్యాంకు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని టికెట్ లు ఆశిస్తున్న నేతలకు పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. మరీ ఈ పంచాయతీ ఇంకెప్పుడు తేలుతుందా అనే చర్చ అందరిలో మొదలైంది.