తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో కారు జోరుతో దూసుకెళ్లింది. అయితే ములుగు నియోజకవర్గంలో మాత్రం టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ కాంగ్రెస్ దెబ్బకు కారు కుదేలైంది. దీంతో సీఎం కేసీఆర్ ములుగు జిల్లాగా ప్రకటించిన తర్వాత అక్కడ టిఆర్ఎస్ కు ఇది రెండో ఎదురు దెబ్బ.
త్వరలో నూతన జిల్లాగా అవతరించబోతున్న ములుగు ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి సీతక్క విజయం సాధించారు. ములుగును జిల్లా కేంద్రంగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ నుంచి పోటి చేసిన మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ ఓడిపోయారు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా టిఆర్ఎస్ కాంగ్రెస్ తలపడ్డాయి. కాంగ్రెస్ నుంచి నిర్మల హరినాథం, టిఆర్ఎస్ నుంచి హారిక, ఇండిపెండెంట్ గా శ్రీదేవి బరిలో నిలిచారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన బండారు నిర్మల హరినాథంకు 2833 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధి గండ్రకోట శ్రీదేవి 2022 ఓట్లు, టిఆర్ఎస్ బలపరిచిన సైకం హారిక 1488 ఓట్లు పోలయ్యాయి. అయితే అంతా కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య పోటి ఉంటదని భావించినా అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్ధి గట్టి పోటినిచ్చారు. దీంతో టిఆర్ఎస్ కు అజ్మీరా చందులాల్ ఓటమి, సర్పంచ్ అభ్యర్ధి ఓటమితో రెండు సార్లు ఎదురు దెబ్బ తగిలిందని అంతా చర్చించుకుంటున్నారు.
తన అభ్యర్ధిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ములుగు సీతక్క తన సత్తా చాటారు. సీతక్క రేవంత్ రెడ్డి అనుచరురాలు. టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి రేవంత్ తో పాటే సీతక్క చేరింది. సీతక్క గెలిచినప్పటి నుంచి ములుగులో టిఆర్ఎస్ కు చెక్ పెట్టే దిశగా ప్రయత్నిస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో కూడా అధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో తెలంగాణ అంతటా కారు జోరు చూపించినా ములుగులో మాత్రం సీతక్క కారుకు బ్రేకులు వేశారు.