ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తాకనున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన నేతలు దిద్దు బాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
టిఆర్ఎస్ పార్టీలో తాము ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నా కూడా తమకు అధిష్టానం సరైన గుర్తింపు నివ్వడం లేదని వారు ఆగ్రహంగా ఉన్నారు. తమకు గుర్తింపు లేనప్పుడు తామెందుకు పార్టీలో కొనసాగాలని వారు నిశ్చయించుకున్నట్టు నేతల ద్వారా తెలుస్తోంది.
చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనుట లేదు. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యత తనకు దక్కడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని కొంత కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాండూర్ లో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన విశ్వేశ్వర్ రెడ్డిని.. ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది అందులో మీరు ఉన్నారా అని విలేఖరులు ప్రశ్నించగా ఇద్దరు కాదు ముగ్గురు ఎంపీలు అని చెప్పారు. దీంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి. ఇదే సమయంలో కొడంగల్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇద్దరు ఎంపీలు టిఆర్ఎస్ లో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ కూడా పార్టీ తీరు పై అసంతృప్తిగా ఉన్నారు. అతనిని పట్టించుకోకుండా పొమ్మనలేక పొగబెట్టినట్టు పార్టీ వ్యవహరిస్తుందని సన్నిహితుల వద్ద సీతారాం నాయక్ చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీతారాం నాయక్ పోటి చేసేందుకు వీలు లేకుండా కేరళకు చెందిన ఐపీఎస్ లక్ష్మణ్ నాయక్ ను ప్రోత్సహిస్తున్నట్టు సీతారాం నాయక్ కు సంకేతాలు అందాయి. గతంలో కాంగ్రెస్ ఎంపీగా పని చేసిన బలరాం నాయక్ అసెంబ్లీకి పోటి చేస్తున్నారు. దీంతో మహబూబాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటి చేయాలని సీతారాం నాయక్ నిర్ణయించుకున్నారని సన్నిహితులు తెలిపారు. వీరిద్దరు కూడా తమ ఎంపీ సీట్లు కన్ఫామ్ చేసుకొని కాంగ్రెస్ గూటికి త్వరలో చేరనున్నారని తెలిస్తోంది.
మరో ఆంధ్రా- తెలంగాణ బార్డర్ ఎంపీ కూడా టిఆర్ఎస్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తన ఆస్తులపై దాడులు జరిగినా కూడా కనీసం నేతలు స్పందించలేదని అతను అసంతృప్తిగా ఉన్నాడని, వేరే పార్టీ నుంచి గెలిచి వచ్చినా కూడా తనకు సరైన గుర్తింపు లభించలేదని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని నేతలు చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి ఆయన కేటిఆర్ కి చాలా సన్నిహితుడు. దీంతో జిల్లాలోని అసెంబ్లీ స్థానాలన్నింటికి తన మనుషులకు టికెట్లు ఇప్పించుకోవచ్చని ఆయన ప్లాన్ చేశారు. కానీ అసెంబ్లీ సీట్ల కేటాయింపులో పూర్తిగా వ్యతిరేకత రావడంతో అప్పుడే ఆయన పార్టీని వీడుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన వేచి చూసే ధోరణిలో వ్యవహరించారు. అయినా కూడా మార్పు లేకపోవడంతో త్వరలోనే పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా వీరి బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. పార్టీలో సరైన గుర్తింపు లేదని చిన్న చూపు చూస్తున్నారని అందుకే పార్టీని వీడాలనే యోచనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
వీరంతా కూడా అసెంబ్లీ ఎన్నికలలోపే పార్టీని వీడి టిఆర్ఎస్ కు షాకివ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఎన్నికల ముందు వీరు పార్టీని వీడడంతో ఓటు బ్యాంకు పై ప్రభావం పడుతుందని వీరి అంచనా. మరి టిఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారోనని, నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా చర్చించుకుంటున్నారు.